2569* వ రోజు.......           22-Oct-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

28 మంది స్వార్ధ రహిత శ్రమదానం - @2569*

          ఈ శనివారం వేకువ చలిలో సొంత ఊరిలో పరిశుభ్ర – సౌందర్య దీక్షితులు 28 మందైతే – వారి కష్టంతో బాగుపడిన రహదారి అమరస్థూపం దగ్గరి అవనిగడ్డ దిశగా. నాలుగైదు గుంపులుగా విడివడిన కార్యకర్తలు ఎక్కడికక్కడ తమ ప్రయత్నం కొనసాగించారు.

          ఇద్దరు ప్రసాదుల ద్వయమైతే – బండ్రవుకోడు మురుగుకాల్వ దగ్గర అరగంటకు పైగా శ్రమించాక ప్రధాన శ్రమదాన స్రవంతిలో కలిశారు. మరో ఇద్దరు ఎందుకు పంతం పట్టారో గాని బాటకు పడమర – ఒక మిల్లు గేటు దగ్గర భాగాన్ని మంచి రైతు తన నారుమడిని సిద్ధం చేసినంతగా – నున్నగా తయారుచేశారు.

          అదేం చిత్రమో - ఎక్కడి నుండి వచ్చి పడ్డవో గాని – 3 రోజుల్నాడు శుభ్రపరచిన రహదారి తూర్పు ప్రక్కన నాలుగు డిప్పల ప్లాస్టిక్, తదితర వ్యర్ధాలు చేరితే – గ్రామ సర్పంచితో బాటు కొందరు వంగి శుభ్రపరిచారు.

          బోదె కాలువ తూము దగ్గర నీళ్లకడ్డుపడుతున్న చిన్న దుంగల్నీ, సీసాల్నీ, బోదె గట్టుల మీద వ్యర్దాల్నీ తొలగించి – డిప్పల కెత్తి మోసినది ఎలక్ట్రికల్ – కిరణా వ్యాపారితో సహా నలుగురు. తమాషా చూడడం తప్ప ఏకాస్తయినా సహకరించని గ్రామస్తులు – మూడు మిల్లుల, కోళ్ల ఫారాల సిబ్బంది!

          తుఫాను ముప్పుతప్పిందను కొంటుంటే ఉత్తరం నుండి వీచి కాస్త ఇబ్బంది పెట్టాలని చూచింది చలిగాలులు.

          ఇందరి ఏకోన్ముఖ లక్ష్యంతో జరిగిన శ్రమ ఫలించి, అంచనా ప్రకారం బాగుపడిన రహదారి భాగం 100 కు పైగా గజాల - అమరస్తూపం దాటే దాక! ఆలోచించగా అర్థమౌతున్న సంగతేమంటే - చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తల శ్రమదానం భిన్నత్వంలో ఏకత్వమని!

          నాకు ఇంకో స్పష్టత ఏమంటే – పండగొచ్చినా, ఇతర పనులు అడ్డు వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు అడ్డుకొంటున్నా ఈ మొండి కార్యకర్తలు ఏనాడూ తమ శ్రమదానాన్ని ఆపబోరని!  

          కత్తులతో శ్రమించినా, దంతెలుపయోగించినా, డిప్పల్లో కెత్తి మోసి లోడింగు చేసి, చెత్త కేంద్రానికి చేర్చినా, దట్టంగా పెరిగి క్రమ్ముకొని హద్దు మీరి రహదారి మీదకు రాజూచే కొమ్మల్ని కత్తెర్లతో సుందరీకరించినా, గూళ్ళు పడేంతగా చీపుళ్లతో ఊడ్చినా....ఎన్ని విభిన్న కృషులైనా - గమ్యం ఒక్కటే – అది “చల్లపల్లీ – అందలి ప్రజలూ ఎప్పటికప్పుడు మరింత మెరుగుపడాలనేదే!”

          అందుకే గదా ఈ ఊరి స్వచ్చ - సుందరోద్యమం ఎంత మాత్రం అసందర్భమూ కాదు, అసంబద్ధమూ కాదని చాలమంది చెప్పేది! అందుకేనేమో ఈ 30 40 – 50 మంది స్వచ్చోద్యమకారుల్లో కొందరైతే ఏకంగా పదేసి వేల పనిగంటలు శ్రమించినా అలసిపోనిది!

          2570* రోజుల కాలపరీక్షకు నిలిచి, ఎప్పటికప్పుడు చిరులోపాలుంటే సరిదిద్దుకొని - ఏళ్లు గడిచేకొద్దీ మరింత నిబద్ధతో ఈ శ్రమదానోద్యమం రాష్ట్రానికీ - దేశానికీ ఆదర్శమౌతున్నదంటే – అదంతా రోజూ గంటన్నరకు పైగా ఇందరు ఆచరణ శీలుర ఘనతే!

          ఎట్టకేలకు గంటా ఏబై నిముషాల తరువాత అందరూ 6.15 – 6.30 నడుమ కాఫీలాస్వాదించి, స్వచ్ఛ సంగతులు చర్చించి, పల్నాటి భాస్కరుని స్వచ్ఛ - శుభ్ర - సౌందర్య నినాదాలకు బదులిచ్చి, గృహోన్ముఖులయ్యారు!

          అమరుల జ్ఞాపక చిహ్నం దగ్గర నుండే రేపటి మన వేకువ సమయ పునర్దర్శనమూ – శ్రమదానమూ.

          మీ సుదీర్ఘ శ్రమ వినోదం.

ఇది విలక్షణ - మిది విచక్షణ - మిది వినోదం – ఇదె ప్రమోదం

ఒక వివేచన – సదాలోచన – ఉన్న ఊరికి తగు సమర్చన

గ్రామ పౌర కనీస బాధ్యత - రాష్ట్రమంతటి కొకనమూనా

ఎవ్వరూ వ్రేలెత్తి చూపని ఇతోధిక కర్తవ్య పాలన!

- నల్లూరి రామారావు,

   22.10.2022.