2570* వ రోజు... ....           23-Oct-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

31 మంది బాధ్యులతో 2570* నాటి వీధి మెరుగుదల.

          ఆదివారం వేకువ (23-10-22) కూడ అమరవీరుల స్థూపం దగ్గరే వాళ్ళు ఆగారు. 4.20 - 6.12 నడుమ అక్కడి నుండి కాసానగర్ దిశగానే వారి రహదారి శుభ్ర - సుందరీకరణ కృషి కొనసాగింది. ప్రధానంగా పడమటి ప్రక్కనే సదరు కృషి జరిగినా, అమర చిహ్నం బైట గుబురు పొదలు కూడ అదృశ్యమై అది 100 అడుగుల రహదారిగానో అనిపిస్తున్నది.

          అవనిగడ్డ బాటకు తూర్పు దిక్కున పనిచేసినది ఏడెనిమిది మంది కత్తుల - దంతెల పనివారు! అందులో ముగ్గురైతే పనిలో మునిగి నడుము ఎత్తడం కూడ మరచినవారు! ఆ పొదల్లో – చీకట్లో – ప్రామాదికమైన జీవజంతువులుంటాయో అని శంకించినది నాబోటివారు! ఈ ఔత్సాహికలు మాత్రం నిస్సంకోచంగా - 20 మందికి నిరంతరాయంగా తమ గంట కాలం పని ముగించారు.

పైగా రెండు రకాల కృషి దారికి పడమర దిక్కు గానే చేశారు

1) గడ్డినీ, పిచ్చి చెట్లను నరికి, కొన్ని పాదుల్ని బాగుచేసి, ఇతర వ్యర్ధాలను తొలగించినది.

2) బాట మార్జిన్ ను అతిక్రమించిన చెట్ల కొమ్మల్నీ, మంత అందంగా లేని పూల మొక్కల కాడల్నీ చాకచక్యంగా ఒడుపుగా తొలగించిన సుందరీకరణ ప్రయత్నం! (అందులో కొన్ని ముళ్ల - పూల ముక్కలుండి, ఒక సుందరీకర్తకూ, ట్రస్టు కార్మిక సమన్వయ కర్తకూ వ్రేళ్లు గాయపడిన వైనం!)

          నేటి 30 మందికి పైగా శ్రమదాతల్లో ఐదారుగురు మరీ సందడి రాయుళ్ళు! పనితో బాటు పాటల చరణాలతో - మాటలతో - సామెతలతో తోటి వాళ్లను హుషారెక్కిస్తారన్నమాట!

          వీళ్ళ వైఖరికి భిన్నంగా ఇంకో ముగ్గురుంటారు - వాళ్లు మరీ నిశబ్ద కర్మిష్టులన్న మాట! పనిలో మునిగి -  రెండు మార్లు పిలిచినా వినిపించుకోని మరీ మితభాషులు!

          ఈ ఎనిమిదేళ్ల స్వచ్చ సుందరోద్యమ పయనంలో ఎప్పుడైనా గాని పాలు పంచుకొన్న 200 మంది మిత్రుల్లో - గుర్తు తెచ్చుకొంటే - ఎన్ని ప్రత్యేక మనస్తత్త్వాలో! ఎంతెంత శ్రమదాన ఔచిత్యాలో!

6.25 కు గాని సాధ్యపడని ముగింపు సభలో:

1) సొంతూరి స్వచ్చ – పరిశుభ్ర – సౌంర్య సంకల్ప నినాదాలిచ్చే అవకాశం తోట నాగేశ్వరునిది!

2) కారకర్తల పట్ల తరగని ప్రేమతో తన పుట్టినరోజు వంకతో (తినుబండారాల పంపకం కోసం ఈయనకు రెండో - మూడో పుట్టిన రోజులొస్తాయి!) మిఠాయిలు తినిపించినది భౌతికంగా చాలా దూరాన ఉన్న ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రీజీ!

3) కారణముందో లేదో గాని - నిన్న అందరికీ బిస్కట్ల పొట్లాల ప్రదాతకుల దుర్గా ప్రసాదు!

(ఏ సవరణా లేకుంటే) - బుధవారం వేకువ శ్రమదాన ప్రదేశం మళ్ళీ నాగాయలంక బాటలోనే!

          బంధుత్వము కలదని

బంధుత్వము కలదని? ఋణాను బంధం ఉందని?

ఎవ్వరు బ్రతిమాలారని? మొహమాటంతోనని!

ఇంతమంది ఇంతకాల మీ ఊరిని అర్చించుట

ఈ ప్రజలను దీవించుట - ఈ సంస్కృతి సృష్టించుట.....?

- నల్లూరి రామారావు,

   23.10.2022