2571* వ రోజు... ....           24-Oct-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

షరామాములు గానే – కార్యకర్తల ఉప సంఘం సేవలు @2571*

          సోమవారం – (24.10.2022) వేకువ సదరు సేవలు గంగులవారిపాలెం వీధిలో -  మూడు చోట్ల - మూడు రకాలుగా జరిగినవి. కర్తలు 5+2+2 మంది! (అసలు వాళ్లు 5 గురు, లేట్ కమ్మర్స్ ఇద్దరు, ప్రేక్షక పాత్రలు ఇద్దరివి!) ఇక నెరవేరిన కృషి వివరాలకొస్తే :

          జల వినోదం దగ్గర – బాటకు పడమర – ఎప్పుడో నరికేసిన చెట్ల మొండేలు – (అవి రంగుల చిత్రలేఖనాలతో, అల్లిన పూలతో బాటసారుల్ని అలరిస్తూనే ఉన్నాయి) – బొగిలి పోతుండగా - రెండు చోట్ల - రెండు సిమెంటు స్థంభాలు పాతి, శాశ్వత ఆసరా కల్పించడమొకటి;

          ఆస్పత్రి ఉత్తరపు జాగాలో తీరుబడిగా కూర్చొనేందుకుగాను చెట్ల మొదళ్లతో అందంగా అమర్చిన అదనపు ఆసనాలు కొన్ని;

          మూడోది గంగులవారిపాలెం దగ్గర జాతీయ ఉపమార్గంలో - ప్రయాణికుల గుర్తు కోసం తామే నిలిపిన గ్రామ నామఫలకం వెలిసిపోతుంటే - పునర్నవీకరణం!

- ఇదీ ఈ నాటి పరిమిత కార్యకర్తల స్వగ్రామ ప్రయోజనకర చర్యలు!

          ఎలాగైతే ఇంతటి వీధి అందాన్ని ప్లాస్టిక్ తదితర వ్యర్ధాలతో హత్య చేసేందుకు కొందరికి చేతులు వస్తాయో - అలాగే ఈ స్వచ్చ - సుందర కార్యకర్తల నైజం తమకు చాతనైనంత వరకూ ఒక్కో వీధిని పునఃపునస్సుందరీకరించడం.

          ఉభయుల్లో ఎవరు అలసి పోవాలో - ఎవరు మారాలో కాలమే నిర్ణయించాలి!

          కార్యకర్తల తరపున ఊరి స్వచ్ఛ – సుందరోద్యమ సారాంశ నినాదాల్ని ముమ్మారు ప్రకటించినది 84 ఏళ్ల గోపాలకృష్ణ వైద్యుల వారు!

          మన సమకాలంలో

జన చేతన పెంపొందే - సామూహిక కృషి వెలిగే

గ్రామం ఉమ్మడి మేలుకు కదం త్రొక్కు శ్రమకన్నా

మన సమకాలంలో ఒక మహత్కార్యముంటుందా?

వీరోచిత కార్యమనగ వేరే ఒకటుంటుందా?

- నల్లూరి రామారావు,

   24.10.2022.