2572* వ రోజు.......           25-Oct-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

అక్టోబరు 25 నాటి వీధి క్రమబద్ధీకరణం - @2572*

            అది మంగళవారం వేకువ! చలి గాలి ముమ్మరిస్తున్న వాతావరణం - గంగులవారిపాలెం బాటలో – స్వయం ఛాయాచిత్ర/జల కేళి వినోద ప్రదేశం- బాగా ముందస్తుగా వచ్చిన శీతాకాలం! ఆస్పత్రి ప్రాయోజిత మంద్ర మధుర సంగీత నేపధ్యంలో ఆరుగురు స్వచ్చ కార్యకర్తల స్వచ్చంద శ్రమదాన దృశ్యాలు!

            ఇలాంటి ప్రకృతినీ, నిస్వార్థ శ్రమ సన్నివేశాన్నీ వినోదించే – ప్రమోదించే అభిరుచీ, అవకాశం, అర్హతా, అదృష్టం చల్లపల్లి లో కాక ఎన్ని ఊళ్ల ప్రజలకు ఉంటుందో చెప్పగలరా? నేటి బ్రహ్మ ముహూర్తాన – ఈ అత్యల్ప సంఖ్యాకులు తమ కోసం కాక- గ్రామ సమాజమంతటి ఆహ్లాదం  కోరి చేస్తున్న చిరు ప్రయత్నం మాత్రం ఎందరు గ్రామస్తులు గుర్తిస్తున్నారు గనుక? వీళ్ల సుందరీకరణ కృషిని ఎందరు అభినందించి – ఆశీర్వదించి – అనుసరిస్తున్నారు గనుక?

            గత 30-40 రోజుల ఎడ తెరిపి లేని వానలకు ఏపుగా పెరిగిన చెట్ల,  క్రోటన్ల, పూల మొక్కల కొమ్మల్ని – ఇద్దరు కత్తిరించడం, ఇద్దరు చీపుళ్లతో ఊడవడం, ఒకరు డిప్పల్లో కెత్తడం , మరొకరు పర్యవేక్షిస్తూ – కావలసిన సరంజామా అందిస్తూ తిరగడం ఇదీ నేను చూసిన అరగంట దృశ్యం! ఇప్పుడు – 6.40 తరువాత వాళ్ళ శ్రమ ఫలితంగా ఆ ప్రాంతం ఇంకెంత దర్శనీయంగా – అనుభవైక వేద్యంగా ఉన్నదో చూడాలి!

            స్వచ్చ కార్యకర్తల్లోనే ఆరేడుగురికి నాలుగేళ్ల నాడు కొందరు  “రెస్క్యూ టీం” అనే పేరు తగిలించారు. తీరా ఇప్పుడు చూస్తేనేమో – వాళ్ళ పనుల వైవిధ్యాన్ని బట్టి  - “ఆల్ రౌండర్స్ టీం” అని పేరు మార్చాలేమో!

            ఈ పూటకు తామనుకొన్నది సాధించాక వీళ్ల స్వచ్చంద శ్రమదాన పతాకం ఎగిరాక, తాతినేని వేంకట రమణ (మొక్కల రమణ) గారు  ముమ్మారు నినదించిన గ్రామ స్వచ్చ – సౌందర్య ఉద్యమ సారాంశాన్ని విని –

            రేపటి వేకువ జరగబోవు నాగాయలంక దారి శ్రమదానంలో కలుస్తారు!

     ఇక ముందర నవోదయం!

ఊరంతా డంపింగులు – వీధుల్లో కశ్మలాలు

ఆహ్లాదం, ఆరోగ్యం – అందనట్టి ద్రాక్ష పండ్లు

ప్రభుత్వాల వైఫల్యం – ప్రశ్నించని  ప్రజ నైజం

ఇదే పల్లెటూళ్ళ గతం – ఇక ముందర నవోదయం!

- నల్లూరి రామారావు,

  25.10.2022.