2573* వ రోజు....           26-Oct-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

2573* వ వేకువ పర్యావరణ మిత్ర చర్యలు – అవనిగడ్డ రహదారిలో.

          ఒక ప్రక్క చలి తీవరిస్తున్న (బుధవారం - 26-10-22) వేళ – బ్రహ్మ ముహూర్తం - 4.20 సమయాన - అమరస్థూపం సాక్షిగా – తమ గ్రామ సామాజిక, బాధ్యతకు పూనుకొన్నది డజను మంది! క్షణక్షణ ప్రవర్ధమై వాళ్ల బలం నాలుగు రెట్లు (47 మంది) పెరిగింది అందులో – 7 గురు వక్కలగడ్డ, పమిడిముక్కల మూలాల వారు మన స్వచ్ఛ – సుందరోద్యమానికి అతిధి దేవోభవులు!

          అంతేనా – కొద్దినాళ్ల క్రితం భౌతికంగా గతించిన విశ్రాంతోపాధ్యాయిని, నిస్సంతువే గాని -  మరో విధంగా బహుళ సంతానవతీ శ్రీమతి “కృష్ణ బాలస్మృతి చిహ్నం గాను, ఒక బహుళార్థ సాధక శ్రమదానోద్యమానికి వెన్నుదన్ను గాను, ఆ అతిధులు 1,11,116/- విరాళమిచ్చిన అరుదైన సంఘటన కూడ!

          ఇలాంటి తాత్త్విక చింతనాపరుల సహృదయ సంఘీభావాలే ఏళ్ల తరబడి స్వచ్ఛ కార్యకర్తలు చేసే సామాజిక సేవలకు ప్రేరణలు! వారికి మన చల్లపల్లి స్వచ్చోద్యమ ప్రణతులు!

          ఈ నాటి గంటన్నర శ్రమతో జాతీయ రహదారికి ఏం ఒరిగి వొళ్ళో పడింది- అని ప్రశ్నించుకొంటే - అందుకు తొలి సమాధానం: మనకోసం కాక, ఊరంతటి ప్రయోజనార్థం చాతనైనంత పాటుబడ్డాంఅనే సంతృప్తి. మలి సమాధానం - తెల్లారింతర్వాత తాము శుభ్రపరచిన 150 గజాల సువిశాల రహదారిని చూసుకొని, కబుర్లాడుకొని, రోజంతా ఒక సద్భావనతో – సదుల్లాసంతో గడిపేందుకు ప్రొత్సాహకం! ఇక మూడో సంగతేమంటే – ఆ ఫలితం ఇప్పటికీ సంపూర్ణం కాదు గాని – గ్రామ పౌరుల్లో ఏ కొందరైనా స్ఫూర్తిపొంది వచ్చి చేతులు కలపడం!

          రహదారి మీద ఇంకో పొరను కేంద్రప్రభుత్వం ఏస్తున్నందున – ఉడ్చే పని కాస్త తగ్గి, తూర్పు ప్రక్కన డ్రైను దాక కొన్ని పిచ్చి - ముళ్ల మొక్కల్ని తొలగించడం, అంతకు ముందున్న చెట్ల, పూల మొక్కల పాదుల్ని చక్కదిద్దడం, మరింత అందంగా ఉండేందుకు కొన్ని చెట్ల కొమ్మల్ని తొలగించడం, దొరికిన మేరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాల్ని ఏరడం, పడమర ప్రక్కన ఇద్దరు సుందరీకర్తలు అదుపు తప్పిన చెట్లను క్రమబద్ధీకరించడం, నలుగురైదుగురు దంతె దారులు వ్యర్ధాల్ని గుట్టలు పేర్చడం వంటి నిత్య పారిశుద్ధ్య కర్మలన్నీ - హైదరాబాదీయుల సాక్షిగా జరిగిపోయినవి!

          మొన్నటి దీపావళిని కూడ ఒక చిచ్చుబుడ్డి వెలిగింపుతో లాంఛన ప్రాయంగా జరిపి, DRK డాక్టరు గారి సమీక్ష జరిగి, అంతకు ముందు ఊరి ప్రథమ మహిళ మన స్వచ్ఛ – సుందరోద్యమ సారాంశాన్ని ముమ్మారు నినదించి, స్వచ్ఛంద శ్రమదాన ధారావాహికను రేపటికి వాయిదా వేశారు!

          రేపటి మన పారిశుద్ధ్య కృషి నాగాయలంక రోడ్డులోని అమరస్ధూపం వద్దనే జరుగగలదని మనవి!

         చారిత్రక మూల్యాంకన

ఎవరైనా రాగలిగిన – ఏ కాస్తో చేయదగిన

సత్సంగం దొరుకుతున్న - సదాశయం పెంపొందిన

అనందం - ఆరోగ్యం - అత్మతృప్తి వర్థిల్లిన

స్వచ్ఛ – సుందరోద్యమమొక చారిత్రక మూల్యాంకన!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

  26.10.2022.