2574* వ రోజు......           27-Oct-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

ఇవీ స్వచ్చోద్యమకారుల 2574* వ నాటి నిష్కామ కర్మలు.

          ఈ చర్యల కాలం మంచు – చలీ ఎక్కువైనా 4.156.00 నడిమి కాలానివి, సంఘటనా స్థలం కాసానగర తటాక సమీపాన! అందుకు పాల్పడ్డ వారి సంఖ్య 28. వారిలో క్రమం తప్పక 8 ఏళ్లు గాను, 7-6-5-3 ఏళ్ళు గాను సొంత నివాస గ్రామం కోసం - పాతిక ముప్పై వేల మంది జన సౌకర్యం నిమిత్తం పాటుబడుతున్న ధీరులూ - వీరులూ ఉన్నారు!

          తమ జీవిక కోసం, కుటుంబ సంక్షేమార్థం ఆలోచించి, పాటుబడిన పిదప - ఇక మిగిలిన కాలాన్ని తమ ఊరి బాగోగులే ధ్యాసగా గడిపే స్వచ్ఛ సైనికుల పట్ల లబ్దిదారులైన ఊరి మనుషులకెంత గురి కుదరాలి? గౌరవాభిమానాలు పెరగాలి? ఏ కాస్త సమయం దక్కినా వచ్చి ఎందరు వాళ్ళకు సహకరించాలి? ఇవన్నీ లేవనడం లేదు గాని – సదరు లక్షణ లక్షితులు చల్లపల్లిలో సగం మందైనా ఉన్నారా అనేదే ప్రశ్న!

          మరో కోణం నుండి చూస్తే - తొలి 2013, 2014 నాళ్లలాగా స్వచ్ఛ కార్యకర్తల సేవాదృక్పథాన్నీ, సామాజిక శ్రేయోభావాన్నీ , సుదీర్ఘకాల సమయ - మేధో - ఆర్థిక త్యాగాలనూ శంకించే – అవహేళన చేసే మనుషులిప్పుడు లేకపోవడం దానికదే శుభ పరిణామం అనుకోవాలి! మాబోటి వాళ్లను నిత్యం అబ్బురపరిచే కార్యకర్తల అరుదైన కాయకష్టానికి అన్ని వర్గాల - అన్ని స్థాయుల గ్రామస్తులూ గొప్పగా స్పందించలేనందుకు విచారించడం మానుకోవాలి!

          రహదారి కశ్మలాల మీద పంతం పట్టిన ఈ 28 మందీ ఈ వేకువ ఏమేం సాధించారట – వాళ్ల అంచనాలే మేరకు పూర్తయ్యాయట! సంఘజీవులుగా - బాధ్యులుగా ఎందరికి స్ఫూర్తి పంచగలిగారట.... అంటే :

          సామాన్ల ట్రాక్టర్ని - కారునీ - చెత్తబండినీ - సొంత బళ్లనీ నిలుపుకొని, చేతొడుగులూ -  తల దీపాలూ – కత్తీ కటార్లూ ధరించింది అమరుల జ్ఞాపక చిహ్నం దగ్గర.

          అక్కణ్ణుంచి దక్షిణంగా - నిన్నటి పనిచోటులోనూ, మరికొంత ముందరకూ పురోగమించి - మొత్తం 100 గజాల రహదారిలో సారా/కల్లు/గాజు/ప్లాస్టిక్ బుడ్లూ (నిన్న ఏరితే మళ్లీ వస్తాయా అనవద్దు – త్రాగించే వాళ్ళు త్రాగిస్తారు – హుషారు కావలసిన పౌరులు పీకల్దాకా త్రాగుతారు మరి!) పుల్లాపుడకలూ - అన్ని రకాల అనర్థాలను ఊడ్చి/ ఏరి/ ట్రాక్టర్లో నింపి తమ పనిని తామే మెచ్చేంతగా శుభ్రపరుచుకుంటూ పోయారు!

          పనిలో ఆలస్యమెందుక్కాదు? ఒక సుందరీకర్త రెండు ఈత చెట్ల మట్టల్ని చెలిగి, దారినపోయేవాళ్లు ఆగి - తల త్రిప్పి చూడక తప్పనంతగా నగిషీలు చెక్కితే - కాస్త ఎక్కువ సమయం పట్టకేం చేస్తుంది?

          6.20 కి కబుర్లాడుకొని, కాఫీలు త్రాగుకొని, గురవారెడ్ల/ భవనం భవానీల ఆగమన విశేషాలు మాట్లాడుకొని – రెండు బారలెగబ్రాకిన సూర్యుడ్ని చూసుకొని అందరూ గృహోన్ముఖులైనారు.

          రేపు, ఎల్లిఉండి ఉదయాల్లో మన శ్రమదాన కేంద్రం రాజా వారి కళాశాల నుండి బందరు రహదారిలోనేనట!

          వీరోచిత కార్యమేదొ

వీరోచిత కార్యమేదొ - స్ఫారోన్నత చర్యలేవొ -

స్వార్థం నర్తించు వేళ నిస్వార్థపు కర్మలేవొ!

ఈ ద్వైధీ భావాలకు ఏ ఆచరణము విరుగుడో

చల్లపల్లి స్వచ్చోద్యమ శ్రమ వేడుక లని తెలియుడు!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   27.10.2022.