2575* వ రోజు.. ....           28-Oct-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

ఎనిమిదేళ్లకు సమీపంగా శ్రమదాన యజ్ఞం - @2575*

         అనగా నేటి (శుక్రవారే, అక్టోబరు మాసే – 28 వ దివసే) నుండి రెండు వారాల్లో ఇదే బందరు గంగులవారిపాలెం దారుల కూడలిలో - (8 ఏళ్ల క్రితం) ఇందులోని కొందరు సామాజిక స్పృహకారులు ఈ గ్రామం మెరుగుదలకై తమ సమయం, శ్రమ అర్పించిన కాలం లెక్కలన్న మాట!

         ఏ రాజ్యం ఎన్నాళ్లుందో.... ఆరాణీ ప్రేమ పురాణం

         ఈ ముట్టడికైన ఖర్చులూ - మతలబులూ, కైఫీయతులూ...

         ఇవి కావోయ్ చరిత్ర సారం...

         ఈ పంక్తులు అసలైన దేశ చరిత్రల్ని నిర్వచించిన మహాకవి శ్రీశ్రీ కవిత్వంలోనివి.

సుదీర్ఘకాల శ్రమదానం,

చెమటలు చిందించిన స్వచ్ఛ కార్యకర్తలు,

నాలుగున్నర లక్షల పని గంటల సేవలు....” అని వర్ణించుకోవడం. ఏమంత సమంజసం కాకపోవచ్చు. చల్లపల్లిని రాష్ట్రానికీ, దేశానికీ ఒక మేలి నమూనాగా రూపొందించేందుకు కంకణం కట్టుకొన్న ఈ 40-50-60 మందికి కాలం హద్దులెందుకు? ఈ ఎనిమిది కాదు - మరో 8 - 16 ఏళ్ళైనా కేవలం లక్ష్యసాధనకే అడుగులు వేసే నిష్కామ కర్ములకు ప్రశంసలు మాత్రం ఎందుకు?

         ఈ దైనందిన స్వచ్చ కార్యక్రమ ప్రణాళిక, నివేదికలు దేనికంటే – గ్రామస్తులెవరైనా చదివి, మనసులు కలుక్కుమని, మరునాటి నుండి గ్రామ బాధ్యతల కోసం తొంగి చూడకపోతారా అనే ఆశతోనే! ఆ విధంగా నేటి కార్యకర్తల వీధి శుభ్రతా కృషి ఎలా ఉన్నదంటే :

- అది పొరుగు పంచాయితీకి చెందిన వీధి నుండే – పంట కాలువ సంస్కరణంతోనే మొదలయింది. నేటి 33 మంది శ్రమించి చక్కబెట్టింది 300 x 90 (అనగా 27000 చదరపుటడుగుల) బందరు రహదారినే గాని, రాజస్థాన్ టీ దుకాణం, 2 తోపుడు బళ్ల గలీజులు, SBI ఎదుట పేరుకొన్న మట్టీ, ద్విచక్రవాహన విక్రేతలు షామియానా దగ్గర వదలిన కశ్మలాల పెన్నిధులూ, కళాశాల – రిజిస్ట్రార్ కార్యాలయాల, పండ్ల దుకాణాల వ్యర్ధాలు సామాన్యంగా ఉన్నాయా మరి?

         సాధారణ జనులంతా తమ కుటుంబ శ్రేయస్సుకు శ్రమిస్తారు; ఈ స్వచ్చ కార్యకర్తల రూటే సెపరేటు – గ్రామస్తులందరి సౌజన్యం కోసం, సౌఖ్యం నిమిత్తం పాటుబడడంలోనే తమ ఆనందాన్ని వెదుక్కొంటారు! ఈ 2575* వ వేకువ సైతం అదే జరిగింది!

అక్షరాలా 2 గంటల శ్రమదానం తరువాత – 6.20 నుండి జరిగిన శ్రమత్యాగ సమీక్షా సభలో –

1) రేపటి గురవారెడ్డి – తదితరుల ప్రోగ్రాం గురించిన చర్చ,

2) నందేటి శ్రీనివాసుని గళ వినిర్గళ శ్రమ యజ్ఞ సందేశ గీతాలాపనా విజయవంతంగా జరిగినవి!

         మన రేపటి వేకువ 4.00 కూ, సాయంత్రం 3.30 కూ పునర్దర్శన స్థలం కూడ ఈ గస్తీ గదే!

                           శ్రమదాన యజ్ఞం

(గానం నందేటి శ్రీనివాస్ ; రచనం ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు)

శ్రమదానం ఒక యజ్ఞం - సహనం మన ఆయుధం

చల్లపల్లి స్వచ్చతకు నిబద్ధులం - ఆమె ముఖపద్మంపై చెరగని నవ్వులం ॥

         చల్లగ వీస్తూ - జనుల అలసట తీర్చే

         గాలి అడిగిందా ప్రతిఫలాన్ని నిన్నూ - నన్నూ!

         ఫలములనిచ్చీ - ప్రాణవాయువు పెంచే

         చెట్టు ఋణం తీర్చుమొనగాడున్నాడా అసలూ!

         తప్పటడుగును దిద్దీ - సాంప్రదాయము తెలిపే

         సమాజ ఋణం చెల్లించుట కర్తవ్యం కాదా!

         ఏసుక్రీస్తు గాంధీజీ ఏ ప్రతిఫలమాసించిరి?

         ఎందుకు తమ బ్రతుకులట్లు బలిదానం కావించిరి?

                  శ్రమదానం ఒక యజ్ఞం - సహనం మన ఆయుధం ॥

         మొండి శిలలను చెక్కీ జీవకళ పుట్టించే

         శిల్పి పనితనమే మన వేకువ శ్రమదానంలో

         స్వచ్ఛ శుభ్రతలద్దీ - వీధి వీధిని దిద్దే

         అందచందాలను సృష్టించు ప్రయత్నం మనదీ!

         గ్రామ సేవలకు రమ్మని అందరినభ్యర్థిద్దాం

         కదలి వచ్చు సమైక్యతకు ఘనస్వాగత మర్పిద్దాం

         కలిసొస్తే ఒక దండం! రాకుంటే సహస్రం!

         కర్మఫలిత మాసింపక కదం త్రొక్కుదాము మనం

                  శ్రమదానం ఒక యజ్ఞం - సహనం మన ఆయుధం

         ప్రజలను చీల్చే - కులమత గోడలుకట్టే

         శ్రమను అవమానించేంతటి దుస్వార్ధ పరులమా మనం?

         కశ్మలాలను ఊడ్చీ - ఒడలి చెమటలు చిందే

         స్వచ్చ - రమ్య - మాన్య చల్లపల్లి రూపకర్తలం

         స్వశక్తిని నమ్మీ - ఊరి స్వస్తత నిలిపీ

         అసలాగక అలుపెరుగక జరిపే ప్రస్థానంలో

         తమ తపస్సు ఫలితంగా తమ ఊళ్ళో ప్రజలెల్ల

         చిరాయువులై సుఖశాంతులతో వర్ధిల్లాలనుకొను

శ్రమదానం ఒక యజ్ఞం - సహనం మన ఆయుధం

చల్లపల్లి స్వస్తతకు నిబద్ధులం - ఆమె ముఖ పద్మంపై చెరగని నవ్వులం॥

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   28.10.2022.