2576* వ రోజు......           29-Oct-2022

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

ఔను – చల్లపల్లి స్వచ్చోద్యమంలో ఇది 2576* వ నాడే!

ఈ శనివారం వేకువ (29.10.2022) 15 మంది ఎప్పుడొచ్చారో గాని – 4.14 కే కశ్మలాల మీద కదన కుతూహలంతో కనిపించారు. కొద్ది నిముషాల్లో క్రమ-క్రమ-క్రమంగా చేరుకొన్న 24 మంది – వెరసి 39 మంది – ఇక అక్కడి నుండి 2 గంటల పాటు – 2 రహదార్ల దుమ్ము దులిపి, “ఏ ఊరి – ఏ రోడ్లైనా ఉండవలసిన పద్ధతిదీ” అనేంతగా సుందరీకరించారు!

          అసలే మన ఊరికి ఇదొక సుదినం – దేశంలో ఎక్కడా లేనట్లు – ఒకానొక చల్లపల్లి లో జరుగుతున్న అరుదైన స్వచ్చ- సుందర – శ్రమదాన అష్టమ వార్షికోత్సవం! దాని తాలూకు ఉత్సాహం, ఉద్వేగం కొందరు కార్యకర్తల పనిలో ప్రతిఫలించింది కూడ! ఇంకొన్ని సంభాషణల్లో అనివార్యంగా గురవారెడ్డి వంటి దాతల ప్రస్తావన, ఎందరెందరు వదాన్యుల సౌహార్దంతోనో ఈ స్వచ్చ – సుందరీకరణోద్యమం విజయవంతమౌతున్న వాస్తవం ప్రస్తావనాంశాలుగా మారినవి!

          వాళ్ళ చిరకాల స్థిత ప్రజ్ఞతో, నేటి నూతనోత్సాహంతో 1) గంగులవారిపాలెం బాటలో కొంత దాక, 2) బందరు రహదారిలో మరొక 150 గజాలు – అనగా పిల్ల మొక్కల విక్రయ కేంద్రాల దాక – బాటసారుల దృష్టినాకర్షించేంతగా దర్శనీయంగా రూపొందినవి!

          రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుటి విశాలమైన రోడ్డు మార్జిన్ లో కొంగ్రొత్త గా వెలసిన బిర్యానీ తయారీ / విక్రయ శాలనూ, తన్మూలంగా, పుట్టుకొచ్చిన ఆహార వ్యర్థాల – ప్లాస్టిక్ అవశేషాలనూ ఓర్పుగా ఊడ్చి- నేర్పుగా తుడిచి, ఆక్రమణను  కూడ కాస్త అందంగా మార్చడాన్నీ ;   

          మూల్పూరి, పింగళి వార్ల ఉద్యానాలను మరొక మారు సంస్కరించిన వైనాన్నీ ;

          ఒకటో వార్డు ప్రక్క- అది మురుగు డంపో, తటాక అవశేషమో చెప్పలేను గాని – దాని దక్షిణపు ప్రక్క బాగు చేతకు తమ కష్టాన్ని పణంగా పెట్టిన ఐదుగుర్నీ ;

          కత్తులూ, దంతెలూ, చీపుళ్లూ ప్రయోగించి, మునసబు వీధి మొదలు 100 కు పైగా గజాల బాటలో – అన్ని రకాల వ్యర్థాల్ని తొలగించిన 20 మంది కర్మ వీరుల్నీ- అందులో పెద్ద డాక్టరమ్మలు – డాక్టరయ్యలు , పంతులమ్మలు – పంతులయ్యలు –  రైతులూ – గృహిణిలూ అందరూ స్వచ్చ- సుందరోద్యమ గూటి పక్షులే – ఎవరు అభివందనీయులుకారు? అనుసరణీయులు కారు?( ఈ అభివందనాలూ – అనుకరణలూ – అనుసరణలూ కార్యకర్తల సంతోషం కోసం కాదు సుమీ! కేవలం ఊరి మెరుగుదల కోసమే!)

          నేటి సమీక్షా సమయంలో కూడ శేషు గాయకుడు ప్రాత పాటలకు క్రొత్త ట్విస్టులిచ్చి- ఏవేవో చేర్చి పాడిన పాట,

          ఈ సాయంత్రం గస్తీ గది దగ్గర్నుండి పద్మాభిరామం వరకు 3.30 – 7.30 నడుమ జరిగే ఎనిమిదేళ్ల శ్రమదాన వార్షికోత్సవం చర్చా,

          లంకే సుభాషిణి గారి గ్రామ సుందరోద్యమ త్రివిధ విస్పష్ట నినాదాలూ – అదంతా ఒక పండుగ వాతావరణంలా గడిచింది.

          రేపటి మన పునర్దర్శన – పునః శ్రమదాన స్థలం ఈ సాయంత్రం ప్రకటింపబడునని ఇందుమూలముగా తెలపడమైనది!

               చెట్టునడుగూ – పుట్టనడుగూ –

 చెట్టునడుగూ – పుట్టనడుగూ – మురుగు కాలువ గట్టు నడుగూ-

కొమ్మనడుగుము – రెమ్మనడుగుము – పూలు పూచిన మొక్క నడుగుము

అంత ఎందుకు – చల్లపల్లి అంతరాత్మను అడిగి చూడుము

స్వచ్చ –సుందర కార్యకర్తల శ్రమను పూర్తిగ చెప్పగలుగును!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   29.10.2022.