2578* వ రోజు............           31-Oct-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

పంచ కార్యకర్తల 31-10-22 వేకువ సేవలు - @2578*

          ఆ సేవలు జరిగింది నాగాయలంక బాటలో తూర్పు దిక్కున గల అమరుల స్థూపం దగ్గర. నిన్న 65 మంది పాల్గొని, వ్యర్ధాలను ప్రోగులు చేసిన చోట! నిన్న ఎందుకో గాని వదిలేసిన, కొన్ని చెత్త/ ఆకుల/ కొమ్మ - రెమ్మల గుట్టలు చెత్త ట్రాక్టర్ లోకి చేరి, చెత్త కేంద్రానికి తరలిపోక మిగిలినవి రెస్క్యూ టీం మర్చిపోలేదు –

          పైగా కాస్త క్రొత్త ప్లాస్టిక్ చెత్తలు కూడ అక్కడ తయారైపోయినవి. నిన్నటి రహదారి ప్రక్కల ప్రోగుపడిన వ్యర్ధాల గుట్టల్ని ట్రక్కులో నింపుకొని, చెత్త కేంద్రానికి చేర్చడమే నేటి నలుగురైదుగురు కార్యకర్తల బాధ్యత!

          అదివారం ఉదయం అవనిగడ్డ రహదారిలోనే గంటన్నర పాటు జరిగిన శ్రమదాన ముగింపు సభ ఎంత వైవిధ్యంగా జరిగిందో చూశాం గదా! ఒక మంచి సామాజిక ప్రయోజనకర శ్రమదానం ఇలా జరగడం అరుదే. అందులో ట్రస్టు కార్మికులు, అతిథులు కాక ఎన్ని రకాల వ్యక్తులు కలిసి వచ్చిందీ తాతినేని రమణ గారు ఇలా వర్గీకరించారు; ఆయన ఆసక్తికి అభినందనలు!   

          ఆర్టీసి డ్రైవర్ – సివిక్స్ లెక్చరర్ – హెయిర్ బ్యూటీపార్లర్ యజమాని – సర్పంచ్ – స్కూల్ టీచర్స్ ఇద్దరు – సాఫ్ట్ వేర్ ఉద్యోగి – హీరో షోరూం అధిపతి – ఇద్దరు షావుకార్లు - ఒక డాక్యుమెంట్ రైటర్ - నర్సులిద్దరు - ఇద్దరు కారు డ్రైవర్లు - ఓ ట్రాక్టర్ డ్రైవరు – ఒక చిరుద్యోగి – రిటైర్డ్ చెక్ పోస్ట్ ఉద్యోగి - రిటైర్డ్ ప్రిన్సిపల్ – ఒక ZPTC - ఆరుగురు డాక్టర్లు – నర్సరీ ఓనరు – రైతులు నలుగురు – రిటైర్డ్ LIC ఉన్నతోద్యోగి – గ్రామ ఉపసర్పంచ్ – క్లాస్ వన్ కాంట్రాక్టరు – రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగి, వారి శ్రీమతి విశ్రాంత ఉపాధ్యాయిని – పోస్టల్ ఉద్యోగి – విశ్రాంత BSNL ఉద్యోగులిద్దరు - స్కూల్, ఇంజనీరింగ్ విద్యార్థినీ విద్యార్థులు - ఫర్నిచర్ దుకాణదారుడు - ఆరోగ్యశాఖ ఉద్యోగి – నలుగురు గృహిణులు.....

          గ్రామం నుండి ఇంకా పాల్గొనదగిన వారి జాబితాను కూడ ఇలాగే వ్రాస్తే బాగుంటుందేమో!

          నేటి స్వచ్చ – సుందర నినాదాలను వినిపించినది తూములూరి లక్షణరావు.  

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   31.10.2022.