2579* వ రోజు........ ....           02-Nov-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

రహదార్ల సుందరీకర్తల 2579* వ నాటి ఉద్యోగం.

          ఆ రహదారి భాగం ప్రాతదే! బుధవారం వేకువ 4.22 కే ఏ 3-4-5 కిలోమీటర్లో ప్రయాణించి, అక్కడి అశుభ్రం మీద దాడి చేయబూనిన స్వచ్చ కార్యకర్తలు 24 మందే! అది పెదప్రోలు శివారు వాడకట్టు - కాసానగర కాసారం గట్టు - దాని కవ్వల, ఇవ్వల పై పొరను మొన్నమొన్ననే వేయగా నిగనిగలాడుతున్న తారు రోడ్డుకు దిష్టి బొమ్మలుగా – దిక్కుమాలిన ప్లాస్టిక్, గాజు సీసాల, సంచుల గుట్టలు!

          మరి - ఇలాంటి కశ్మలాల గుట్టల్ని స్వచ్చ కార్యకర్తలెలా సహిస్తారు? కాసానగరీయులే 50-60 మీటర్ల దారి ప్రక్కల చిమ్మిన అపరిశుభ్రతలనూ, వానలకు బాగా పెరిగి, అదుపు తప్పి రోడ్డు మీదకు వాలుతున్న మేడి తదితర పిచ్చి చెట్లనూ, తీగల్ని తొలగించడానికి 24 మందికి - గంటన్నర చొప్పున (25, 26 వ వాళ్ళుగా ఒకరిద్దర్ని కార్యకర్తలు ఆహ్వానించారు గాని - అబ్బే – ఈ ఊరి వాళ్లేమీ చలించలేదు!) 36 పని గంటలు గడిచింది!

          ఒక ప్రక్కన ఆ వాడకట్టు వాళ్లు పవిత్రంగా పూజించుకొనే నాగేంద్రస్వామి వారి ఆలయం! దానికి మూడు ప్రక్కల్లో వాళ్లే విరజిమ్ముకొన్న కశ్మలాల భీభత్సం! అక్కడనే ఉన్నది - ఐదారేళ్ల క్రితం నాటి స్వచ్ఛ కార్యకర్తలు పాతిన స్వచ్చ సౌందర్య పరిరక్షణా హెచ్చరికల ఫలకం! ఐనా ఖాతరు చేయనంతగా గ్రామస్తుల నిర్లక్ష్యం! ఆ వంద గజాల రహదారిలోనే బుధవారం నాటి కార్యకర్తల శ్రమదానం! దీన్నెలా అర్థం చేసుకోవాలో - అది ప్రజాస్వామ్యవాదుల ఇష్టం! నాబోటి వాళ్లకు మాత్రం అది చాలా కష్టం!

 

          అది బలహీనతో బలమో గాని - ప్రజల అస్వస్తతకు దారి తీసే రహదారి అస్తవ్యస్తతల మీద చల్లపల్లి కార్యకర్తలకు ఎందుకంత అసహనం? గజగజ చలిలో, చినుకు చినుకు వానలో మూణ్ణాలుగు కిలోమీటర్ల దూరంలోని కాసానగరం అయోమయం మీద ఏమిటింత పంతం?

          సరే - అయిందేదో అయింది. ఈ రెండు డజన్ల మందీ శ్రమించి, 100 గజాల జాతీయ రహదారిని సంస్కరించి, అర బండెడు వ్యర్ధాలనూ సేకరించి, దాన్ని చెత్త కేంద్రానికి తరలించి, ఈ వేకువ తమ కృషితో కొంత సంతృప్తి వహించి, 15 రోజులుగా జరిగిన ఈ రహదారి శుభ్ర - సుందరీకరణను ముగించి,

          6.20 ప్రాంతంలో తలా కప్పెడు కాఫీ సేవించి, సజ్జా ప్రసాదు నామధేయుడి గ్రామ సామాజిక స్వచ్చ – శుభ్ర – సౌందర్య సంకల్ప నినాదాలకు ప్రతిస్పందించి, 6.30 పిదప సొంత పనులను గుర్తించి...స్వగృహోన్ముఖులయ్యారు!

          రేపటి వేకువ మరొక రహదారి సంస్కరణార్థం - పాగోలు దారి వంతెన దగ్గర కలుసుకోవాలని నిర్ణయించారు!

****************

ఆమె పేరు శకుంతల - తనదెంతో పద్ధతి

అసలామెది సన్మతి - మన అర్జున శ్రీమతి

ఈ వశిష్టు జీవితాన ఆమె మంచి అరుంధతి

సంవత్సర సమయంగా అతని కామె దివ్య స్మృతి!

 

గురువారంనాడేనట అమె ప్రధమ వర్ధంతి

ఘంటసాలపాలెంలో తన సంస్మరణార్థంగా

స్వచ్చ కార్యకర్తలందరచటికి వచ్చేయాలని

ఆ అర్జునరావు గారి అత్మీయపు వినతి!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   02.11.2022.