2580* వ రోజు.........           03-Nov-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

స్వచ్ఛ - చల్లపల్లికి అనుబంధంగా పాగోలు రహదారిలో - @2580*

          గురువారం (3-11-22) వేకువ 4.17 కు పాగోలు బాట మురుగు కాల్వ వంతెన దగ్గర కలుసుకొన్నది 15మంది! నిముషాల ఎడంలో వచ్చి పనిలో దిగింది ఇంకో 10 మంది. అప్పుడందరూ కలివిడిగా ప్రాకులాడినందున బాగా శుభ్రపడింది బ్రహ్మం గారి గుడి నుండి భవన విభాగాల (అపార్ట్మెంట్స్) పర్యంతం - సుమారు 100 గజాల పాగోలు రోడ్డు!

          ఆ 100 గజాల్లోనే - బండ్రేవు కోడు మురుగు కాల్వ వంతెన ప్రక్కనే 10 మంది కార్యకర్తల గంటన్నర కాలమంతా ఖర్చైపోయింది. ఇక అందులో కలుస్తున్న పాగోలు డ్రైను (డ్రైనో, చెరువో మరి) అంచుల్ని బాగుచేయడం, బాగా బరువైన సిమెంటు స్తంభాల్ని సర్దడం ఇంకో 10 మంది కృషి! వంతెన మొదలు 100 గజాల వీధిని ఊడ్చి, ప్రోగుల్ని డిప్పల్లో నింపి, ట్రాక్టర్లో కెక్కించిన ఘనకార్యం మిగిలిన వాళ్లది!

          వంతెన దక్షిణ భాగం గత కొన్నాళ్లుగా స్థానికుల కట్టె పుల్లల దాపరికానికి బాగా పనికొచ్చింది. ఆ రెండు గట్టుల్ని ఖాళీ చేసి, కొమ్మల్ని (ఆ కొమ్మలేమో విద్యుత్ శాఖ వారు ముందు జాగ్రత్తగా నరికిన చెట్లవి) డంపింగ్ యార్డుకు చేర్చే ప్రయత్నం కూడా స్థానికుల అభ్యర్థనతో సగాన ఆగింది.

          మొత్తం మీద మామూలుగా చూసే వాళ్లకేమో ఈ పాగోలు రహదారే కాదు - మిగిలిన 6 రహదార్లూ శుభ్రంగా - పచ్చదనాల పందిళ్ళుగా - పూదోటలుగా కనిపిస్తాయి. స్వచ్చ కార్యకర్తలు ఏళ్ల తరబడీ రోడ్ల గుంటలు కొన్ని పూడ్చి, వేలకొద్దీ మొక్కలు నాటి, కంపలు కట్టి, నీరు పోసి, పెంచి, పూయించిన శ్రమే అందుక్కారణం! ఐతే ఈ కార్యకర్తల సూక్ష్మ దృష్టికి – ముఖ్యంగా సుందరీకరణ విభాగానికి మాత్రం ఇంకా జాగ్రత్త పడదగిన లోపాలు కనిపిస్తాయి!

          మరి - అదే స్వచ్ఛ - సుందర చల్లపల్లి తయారీ రహస్యం! అక్కడే ఉంది - లక్షలాది ఊళ్లకూ ఈ చల్లపల్లికీ ఉన్న తేడా!

          పాతిక మంది కార్యకర్తల పని సమయంలో లేని వాన వాళ్ల కాఫీల కాలం దాక ఓపిక పట్టింది గాని, సమీక్షా సమయంలో మాత్రం సన్మానించింది. ఐనా సరే - పద్మావతి ఆస్పత్రి ల్యాబ్ రవి వదలకుండా ముమ్మారు, గ్రామ స్వచ్చ సుందరోద్యమ నినాదాలు గట్టిగా ప్రకటించనే ప్రకటించాడు!

          రేపటి శ్రమదానం సైతం ఈ అపార్ట్ మెంట్ల దగ్గరే అనే ప్రకటన కూడ వచ్చింది!

          (నిన్నటి నా & వేల్పూరి ప్రసాద్ గారి వాట్సప్ ప్రకటనకు సవరణగా....)

          ఈ మధ్యాహ్నం 11.30 12.00 కు ఘంటశాలపాలెంలో వేమూరి అర్జునరావు గారు జరిపే “శకుంతల” గారి సంస్మరణ కార్యక్రమానికి కార్యకర్తలు రావలెనని విజ్ఞప్తి!

          వ్యక్తికి బహువచనం శక్తిని

బాహ్య విసర్జనలు మానిపి – పచ్చ పచ్చని చెట్లు పెంచి

ప్రతి వీధికి సౌందర్యపు పాఠాలను చెప్పి చెప్పీ

వ్యక్తికి బహువచనం శక్తని పదేపదే ఋజువు చేసే

ఓ శ్రమదానోద్యమమా! జోహారులు జోహారులు!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   03.11.2022.