2581* వ రోజు............           04-Nov-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

మరికొన్ని విశేషాలతో – 2581* వ నాటి శ్రమదానం!

          కార్తీక శుక్రవారం (4-11-22) వేకువ 4.17 కే పాగోలు దారిలోని అపార్ట్మెంట్ల వద్ద ఆగి, వీధి కశ్మలాల మీద పోరుకు తొలి అడుగులు డజను మందివి! వారిలో డెబ్బై ఏళ్లు దాటిన – పాగోలుకు చెందిన – విశ్రాంత గౌరవ చిరుద్యోగి కంఠంనేని రామబ్రహ్మం మహోదయుడొకరు!

          కొన్ని నిముషాల్లోనే - కనీసం 3 ఊళ్ళ నుండి - 3 దిక్కుల్నుండి వచ్చి, నడుములు వంచిన వాళ్లతో కలిపి మొత్తం 28 ½ మంది. (చివరి సగం మనిషి – ఇది వ్రాస్తున్న కలంపోటుగాడన్నమాట – అలా ఎందుకు కుంచించుకుపోయాడంటే - వయస్సు ప్రభావమూ, చిన్నపాటి అస్వస్తతా సమస్యలూ)

          ఒకరకంగా చెప్పాలంటే – ఈ మూడు రోజులు – సుమారు 80 మంది శ్రామికుల – 140 పని గంటల - ఉద్యోగం (= ప్రయత్నం) అంటే - విద్యుత్ శాఖ వారు నరికి వదిలేసిన హరిత వృక్ష అవశేషాలు X సుందరీకర్తల – కత్తులవాళ్ల – చీపుళ్ళ, దంతెధారుల పంతాలు అనొచ్చు! ఇందరి సమష్టి కృషితో ఈ వేకువ కూడ మరొక 70/80 గజాల దాక - మహాబోధి పాఠశాల తూర్పు గేటు దాక రహదారి పునః పారిశుద్ధ్యం జరిగిందన్న మాట!

          నేటి మరొక విశేషం – వ్యర్ధాల గుట్టలు ట్రాక్టర్ లో కొలువు తీరి, చెత్త సంపద కేంద్రానికి వెళ్లడానికి బదులు - తెలంగాణ – వనపర్తి వైద్య మిత్రులు చల్లపల్లికి బహూకరించిన యంత్రానికి బలైపోయి, తునాతునకలు కావడం! “నదీనాం సాగరోగతిః” (నదుల గమనాలు సముద్రంలోనికే) అన్నట్లు -  ఈ పాతికమంది సేకరించిన కొమ్మలూ, ఆకులూ, పిచ్చికంపలూ ఆ మిషన్ దగ్గరికి చేరుకున్నాయి!

          ఈ కారణంగా ఉదయపు నడకవారూ, ఇసుక బళ్లవారూ, ద్విచక్ర - చతుశ్చక్ర వాహనదారులూ  కొంత అగి నెమ్మదించవలసినా – ఎవరు వీళ్లు, ఎందుకీ మురికి పనులు?” అనే ఆరా బయల్దేరుతుంది గనుక - అదీ మంచిదే! సదరు యాంత్రిక కఠోర శబ్దాలకు అక్కడి పాతిక కుటుంబీకులకు నిద్రాభంగం కలిగినా – అదీ క్షంతవ్యమే!

          కొందరు కార్యకర్తలు తమ పని అర్థాంతరంగా వదలక పోవడం వల్ల ఈ పూట కొంత ఆలస్యం కాక తప్పలేదు. ఎప్పట్లాగే విశేషమేమనగా – ఆ వీధి నివాసుల్లో, పాదచారుల్లో ఒక్కరంటే ఒక్కరైనా శ్రమదానం జోలికి రాకపోవడం

          “శ్రమైక జీవన సౌందర్యానికి - సజీవ సాక్ష్యం ఉందిగా

          స్వచ్ఛ సంస్కృతికి ఉదాహరణగా – చల్లపల్లి ఒకటుండెగా....

అని ఈ కలమే వ్రాసి - ఒంగోలుకు చెందిన తరిగోపుల పురుషోత్తమరావు గారు పాడిన పాటను DRK గారు గుర్తుచేసి, సమీక్షించగా, నేటి స్వచ్చోద్యమ ఆంతర్యాన్ని ముమ్మారు నినదించే వంతు ధ్యానమండలికి చెందిన నాయుడు మోహనరావు గారిది!

          ఇదే పాగోలు దారిలో - ఇదే అపార్ట్మెంట్ల దగ్గరే రేపటి మన పునర్దర్శనం!

                   బ్రదర్ థెరిస్సా?

ఇతడనితర సాధ్యుడు – గోపాళం శివన్నారాయణుడు

వైద్య శాస్త్ర సారాంశం వడబోసిన భిషగ్వరుడు

అనునిత్యం అసంఖ్యాక వైద్య శిబిర ప్రవర్తకుడు

“బ్రదర్ థెరిస్సా” అనదగు ప్రజా వైద్య శ్రేష్టతముడు!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   04.11.2022.