2582* వ రోజు............           05-Nov-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

                    చల్లపల్లి స్వచ్చ సుందర ఉద్యమం – @2582* రోజులుగా

          ఔను మరి! ఈ 30-40-50 మంది స్వచ్చంద వీధి శుభ్ర కారులకు అన్ని రోజులైనా అలసట రాదు; గ్రామ సమాజానికి నేటి అత్యావశ్యక మనదగిన ఆ ఉద్యమానికి పట్టు – విడుపూ లేదు; ఆట విడుపు ఉండదు! నేటి 30 మంది శ్రమదాతలు తలా 100 నిముషాలు ఇష్టారాజ్యంగా పాటుబడింది పాగోలు బాటలోని ఏ అరవై గజాల స్థలమో కావచ్చు! లోతుగా ఆలోచించని వాళ్లకిది చిన్న విషయమే అనిపించవచ్చు!

          కాని, అది నిజంగా ఆలోచనాత్మకం, సదాచారణాత్మకం! నేటి శ్రమత్యాగ సమీక్షా కాలంలో మన ఊరి సామాజిక తత్త్వవేత్త చెప్పిన “కేవలం ఏ నాటి కానాటి మానసిక సంతృప్తి కోసమే మనం ప్రయత్నిస్తున్నాం తప్ప - ఏ ఇతర ప్రయోజనాలూ ఆశించి కానేకాదు....” అనేది బహుశా ప్రతి స్వచ్చ కార్యకర్త ఆలోచనే! ఆ మాత్రపు తాత్త్విక బీజాలు లేని ఏ గ్రామస్తుల్నైనా ఈ DRK - పద్మావతులే కాదు – ఎవ్వరూ వేకువ 4.00 ల పారిశుద్ధ్య కృషికి కదిలించగలరా?

          ఈ గుంపులోనే ఇంకొక కళాకారుడికి ఈనాటి “స్వచ్చ-సుందరోద్యమం” ఎక్కడా చూడలేని ఒక అరుదైన పరిశ్రమగాను, కార్ఖానాగాను కనిపించిందట! మరి ఈ గంటన్నర రోడ్డు ఊడ్పునూ, చెట్ల సుందరీకరణనూ, వ్యర్థాల్ని తుంపులు చేస్తున్న యంత్రం రొదనూ చూసి, ఆగి, వెళ్లిన 30-40 మంది నడక వాళ్లకూ, బళ్ళ వాళ్లకూ, మోటారు వాహన చోదకులకూ, పాతికమంది గృహస్తులకూ ఏమనిపించిందో!

          ఎవరేమనుకొన్నా – ఎనిమిదేళ్లుగా ఒక ప్రత్యేక మార్గం ఎంచుకొని పయనిస్తున్న కార్యకర్తలు  మాత్రం స్థిరంగా గమ్యం వైపు అడుగులేస్తూనే ఉన్నారు. ఇతర పనులు – అంటే పిచ్చి మొక్కల తొలగింపూ, డ్రైనులోనూ, గట్టు మీదా చిందర వందరగా పడి ఉన్న కొమ్మల సేకరింపూ, ట్రాక్టర్ లోకి కాక - మ్రోగుతున్న యంత్రానికి ఎరవేయడానికి వ్యర్థాల తరలింపూ వంటివన్నీ ఎప్పటిలాగే జరిగిపోయాయి!

          ఈ శనివారం (05.11.2022) ముగింపు సభలో స్వచ్చోద్యమ సందేశాన్ని మూడుమార్లు నినదించిన వారు తాతినేని(నర్సరీ) వేంకటరమణ! ఏ వంకతోనో గాని – కార్యకర్తలకు బలవర్ధక పప్పుండల్ని పంపిణీ చేయించి, తినిపించినవారు – ఏ అహమ్మదాబాదులోనో ఉన్న శంకర శాస్త్రి!

          ఇప్పటికే ఆలస్యమయిందని తన నెలవారీ ఆర్థిక సౌజన్యాన్ని (520/-) మేనేజింగ్ ట్రస్టీకి ఇచ్చేసినది కోడూరు వేంకటేశ్వర నామ సీనియర్ కార్యకర్త!

          మన రేపటి వేకువ పునర్దర్శనం NTR – మహాబోధి పాఠశాల ద్వారం దగ్గరే అని నిర్ణయింపబడింది!   

            అతనిది సువిశాల దృష్టి

సుహృద్భావ మెందున్నా శోధించే పెద్ద జడ్జి

అతనిది సువిశాల దృష్టి – అన్నపరెడ్డి గురవ రెడ్డి

సామాజిక అరుగుదలను చక్కదిద్దు సూర్యకాంతి

లలిత కళారాధనతో విలసిల్లే మనశ్శాంతి!

 

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   05.11.2022.