2588* వ రోజు........           11-Nov-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమైన ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

వసివాడక - పునర్నవంగా సాగే స్వచ్ఛ – సుందరోద్యమం - @2588*

          ఆ సంఖ్య ఈ శుక్రవారం (11-11-22) నాటిది! ఆ ఉద్యమకారులు పట్టుమని పాతిక మంది! (చల్లపల్లి + పాగోలు = పాతిక వేల జనాభాతో పోలిస్తే – అత్యల్ప సంఖ్యాకులు - బొత్తిగా 1:1000 మంది!) ఈ వేకువ కాలం, బాగుపడినదేమో – (చూసే కొందరికి నత్తనడకగా పని జరగుతున్నదనిపించినా) NTR పాఠశాల ప్రవేశద్వారానికటూ - ఇటూగానే!

          ఇంకో కోణం నుండి చూస్తే – “పావు లక్ష మంది పట్టించుకోని ఈ రహదారి పారిశుద్ధ్య - సుందరీకరణం ఈ పాతిక మందికే ఎందుకు? ఈ కిలోమీటరు బాట కోసం – మూడు నాల్గు వాహనాలూ, లబ్దప్రతిష్టులైన పెద్దలూ, రెండు వారాల పాటు ప్రణాళికాబద్ధంగా ఈ శ్రమదానమూ దేనికి? కూటికా - గుడ్డకా - ఏ సొంత లబ్దికి?...

          ఇలాంటి ఆలోచనలే మన పూర్వులు కూడ చేసుంటే - మన సమాజం ఈ మాత్రమైనా పరిణతి చెంది, ఈ కాస్తంత సాఫీగానైనా నడుస్తుండేదా? దేశానికి స్వాతంత్ర్యమూ - నామమాత్రమైన ఈ ప్రజా స్వామ్యమూ అప్పటి కొందరి ముందు చూపు వల్ల - త్యాగాల వల్లనే కదా సాధ్యపడింది? కనుక – “ఏమైనా సరే - ఎన్నేళ్లయినా సరే - ఊరి జనంలో ఉమ్మడి బాధ్యత వచ్చే దాకా ఊరి కోసం మనం చేయగలిగినంత శ్రమదానం చేస్తూనే ఉందాం....” అనుకొనే స్వచ్ఛ కార్యకర్తల దృఢ సంకల్పాన్ని స్వాగతిద్దాం!

          మన ఊరి స్వచ్ఛ– సుందరోద్యమం వయస్సు నేటితో 8 ఏళ్లు! బాలారిష్టాలు దాటుకొని -  దూషణ భూషణ - తిరస్కార పురస్కారాలన్నీ అధిగమించి సహర్షంగా – సజీవంగా – సమున్మేషంగా - సానుకూల దృక్పధంగా అది నడుస్తున్నదంటే - అది స్వచ్ఛ కార్యకర్తల శ్రమత్యాగం వలన మాత్రమే!

నేటి వీధి పారిశుద్ధ్యం విషయానికొస్తే:

- ఈ రోజు కూడ సుందరీకరణ బృందం తన పని తాను చేసుకుపోయింది!

- కొందరి పదను కత్తులు పనికిమాలిన పిచ్చి - ముళ్ల మొక్కల్ని ఖండించాయి!

 - అలుపెరగని చీపుళ్లు ఆ బాటను మరొక మారు ఊడ్చాయి!

- ఐదారుగురి శ్రమ ఫలితంగా పాఠశాల ముఖద్వారం ఎదుట వంతెన కిరుప్రక్కల కోసుకుపోతున్న రోడ్డుకు పెగ్గులు పాతి, కొమ్మ - రెమ్మలు పరచి, సాధ్యమైనంత రక్షణ లభించింది.

          ఒక్కమాటలో చెప్పాలంటే - ఈ పాతిక మందికీ ఈ 24 గంటలకు సరిపడా సంతోషం దక్కింది!

          సమీక్షా సభలో మైకు లేకుండానే స్వచ్ఛ సుందరోద్యమ సారాంశాన్ని గట్టిగా ముమ్మారు వినిపించినది గురవయ్య గురువు!

          మన స్వచ్చోద్యమం 9 వ ఏటి తొలి వేకువ శ్రమదానం - మన MLA రమేష్ బాబు గారితో కలిసి, గాంధీ స్మృతి వనం దగ్గర నిర్వహిద్దాం!

          అదృష్టమో - లేక దురదృష్టమో!

ఎంచదగిన శుభ్రతలను - కాంచదగిన అందాలను

ప్రత్యంగుళ స్వచ్చతలను - హరిత భరిత రహదార్లను

పరికించీ వినుతించే స్వచ్ఛ సేవలో పాల్గొన

లేని వారి దదృష్టమో - లేక దురదృష్టమో!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   11.11.2022.