2589* వ రోజు.... ....           12-Nov-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమైన ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం - 2589*

            ఈ శనివారం వేకువ కూడా స్వచ్చ కార్యకర్తల శ్రమదాన ఉత్సాహానికి బ్రహ్మ ముహూర్తంలో – 4.16 కే తెల్లవారింది. విజయవాడ బాటకు తూర్పుగా ఉన్న గాంధీ స్మృతి వనం దగ్గరకు ఈ ఔత్సాహికులు చేరుకునేటప్పటికి జోరు వాన కాచుకుని ఉన్నది. అయితే 8 ఏళ్లుగా ఎన్నో వానలకు తడిసి, ఎండలకు ఎండి, మంచును, చలిని ఎదిరించి జయించి రాటుతేలిన చల్లపల్లి కార్యకర్తలను మాత్రం ఏమీ చేయలేక తోక ముడించింది.

            జాతిపిత గౌరవ స్మృతిలో నేటి వేకువ అసలు మన వాళ్ళు చేయదలచుకున్నది అంతకు ముందున్న ప్రాత ఉద్యానంలో మొక్కలు నాటి, హరిత సంపదలు ప్రతిష్టించడమే!

            ఈ స్వచ్చోద్యమంలో 9 వ సంవత్సరంలో కార్యకర్తల నూతనోత్సాహం విశిష్ట అతిధుల ఆగమనం అందుకే.

            స్థానిక వాణిజ్య ప్రముఖులయిన అన్నవరపు పాండురంగారావు, కొల్లిపర సాంబశివరావు గార్లు ఇతర గ్రామ ముఖ్యులతో పాటు వచ్చి, నేటి శ్రమదాన కృషికి అడ్డుపడబోతున్న వాన ఒరవడిని తగ్గించారు;

            పాక్షికంగా అయినా సరే కార్యకర్తల శ్రమదానం జరగడం ముదావహం!  

            ఈనాటి శ్రమదాన విశేషాలను అదే పనిగా నేనెందుకు రాయాలి గాని, మీకు గనుక జై స్వచ్చ చల్లపల్లి సైన్యంవాట్సప్ మాధ్యమం ఉంటే రకరకాల చిన్న గుంపుల ఫొటోలను పరిశీలించండి. అందులో;

- ముందుగా మౌన మునీశ్వరుని ఎదుట దారికిరుప్రక్కల కొంగ్రొత్త ఉద్యానాలాకై సంసిద్ధంగా ఉన్న ఖాళీ ప్రదేశాలను,

- పూల మొక్కల కుండీలతో ఉత్సాహపడుతున్న కొందరు కార్యకర్తలను గుర్తుపట్టండి.

- చలి తీవ్రంగా ఉన్న వాన పడుతున్న చీకటి వేళ వచ్చిన కార్యకర్తల్లో ప్రముఖ గౌరవ వైద్యులూ, గృహిణీమాతల్లులూ, వయో వృద్ధులూ, చిన్నారులూ, ఎందుకున్నారో అడగండి.

- అసలిందరు కార్యకర్తలకు ఈ వాన జడిలో ఈ గంటన్నర శ్రమదానం ఫలితంగా ఏం ఒరిగి ఒళ్ళో పడిందో అసలు వాళ్ళది ఆదర్శమో, సామాజిక బాధ్యతా వ్యసనమో వాళ్ళతో ఒక్కసారి చర్చించండి.

            శ్రమ జీవన సౌందర్య సంకేతంగా కేకు ముక్కల, ఆపిల్ పండ్ల పంపకం కూడా చోటు చేసుకున్నది.  

            చల్లపల్లి దైనందిన స్వచ్చ కార్యక్రమ సంచాలక వైద్యులు దాసరి రామకృష్ణప్రసాదు గారు, గ్రామ ప్రధమ పౌరురాలు కృష్ణకుమారి గారు, అన్నవరపు కొల్లిపర నేటి శ్రమదానోద్యమ అతిధులూ ఈ ఉదయం ఏమి ప్రసంగించారో- కార్యకర్తల ఉత్సాహాన్ని ఎంతగా పంచుకున్నారో – 9 వ ఏటి గ్రామ బాధ్యులందరూ వినితీరాలి!  ఈ కార్యాకర్తలందరి పట్టుదలను 3 మార్లు నినాద రూపంలో ప్రకటించినది - ఉస్మాన్ షరీఫ్.               

            రేపటి వేకువ మన పునర్దర్శనా స్థలం కూడా గాంధీ స్మృతి వనం దగ్గరే!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   12.11.2022.