2590* వ రోజు........           13-Nov-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమైన ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

                      2590* వ నాటి శ్రమదాన సంగతులు.

            ఈ ఆదివారం (13.11.2022) వేకువ మళ్లీ గాంధీ స్మృతి వనం దగ్గరే పదముగ్గురు కాబోలు శుభోదయ తొలి కార్యకర్తల్నీ, వారి శ్రమదాన సంసిద్ధతనీ గమనించారా? వాళ్లకు తోడు ఇంకో 18-19 మంది సహచర స్వచ్చోద్యమ కారుల్నీ – వాళ్లు నేడు సాధించిన ఊరి మెరుగుదల కృషినీ ఇప్పుడు చూద్దాం!

            అసలే ఇది మౌన ముద్రాంకితుడైన ఒక జాతిపిత సన్నిధి. ఇక్కడ తనకంకితంగా జరిగే సమాజపరమైన కార్యకర్తల సేవలు ఎలా ఉండాలి?  మనం గమనిస్తే ఇలాంటి విగ్రహం గాని, స్మృతి వనం గాని ఎక్కువగా కనిపించవు. నిన్నటి పూలవనం ఏర్పాటుకు పొడిగింపుగానే  శ్రద్ధగా, ప్రణాళికా బద్ధంగా, కార్యకర్తలు కుండీల పూల మొక్కలతో సంచరించడాన్ని, వరుస క్రమంలో మొక్కలు నాటడాన్ని తిలకించండి! వారిలో ఉద్యోగ విరమణ చేసిన, వయస్సు మళ్లుతున్న పంతులమ్మలనూ, వైద్యులనూ, రైతులనూ, చిరుద్యోగులనూ ఆసక్తి ఉంటే అడగండి – “ ఇంత వేకువ చలిలో ఊరికి దూరంగా ఎక్కువమంది  గ్రామస్తులు నిద్రా ముద్రాంకితులై ఉండగా మీ 30 మందికే ఈ మురుగు కాలువలు, ఈ రహదారి ఉద్యానాలు, శ్మశానాలు బాగు చేసే ఖర్మ  ఎందుకు పడింది? .....” అని.   

            “ అయ్యా! గ్రామ పౌరులుగా ఇది మా కనీస బాధ్యత – ఈ 2590 రోజుల శ్రమదానం వల్ల మాకు పోయేదేమీ లేదే ! – ఏ కొద్దిపాటి మానసిక దైహిక రుగ్మతలో తప్ప!” అని సమాధానం వస్తుంది.

            ఒక సంపన్న రైతు – చిరకాల చల్లపల్లి స్వచ్చోద్యమ కార్యకర్త – కమ్మ్యూనిస్టు వీధి ప్రముఖుడూ అయిన శ్రీమాన్ మాలెంపాటి అంజయ్య, విశ్రాంత డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ కోటేశ్వర రావు గార్లు  విజయవాడ రోడ్డు పరిసరాలు పిక్కటిల్లే లాగా మూడు మార్లు మన శ్రమదాన పరమార్థాన్ని నినదించగా 6.30 కు కార్యకర్తల ప్రయత్నం రేపటికి వాయిదా పడింది.

            గాంధీజీకి ప్రీతి పాత్రంగా మంగళవారం నాటి మన సుందరీకరణ శ్రమదానం కూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రక్కనే జరుగునని తెలియచేయడమైనది.     

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   13.11.2022.