1921 * వ రోజు....           14-Feb-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1921* వ నాటి ముచ్చట్లు.

  ఈ వేకువ 4.05 నుండి6.15 నిముషాల దాక –

1- మండల పరిషత్ ఆఫీస్ పరిసరాలలోనూ, 2- RTC బస్ ప్రాంగణంలోనూ ద్విముఖంగా జరిగిన స్వచ్చంద శ్రమ విరాళ దాతలు మొత్తం 30 మంది.

 

20 మందికి పైగా బైపాస్ మార్గంలోని పాల కేంద్రం దగ్గర ఆగి, తమ శ్రమ సంకేత సాధనాలను ధరించి అక్కడి నుండి తొలి దశలో విజయవాడ రహదారి దాకను, అక్కడి నుండి వీరు రెండు భాగాలుగా విడిపోయి ఏడెనిమిది మంది కోట వైపుగా రహదారిని శుభ్ర పరుస్తూ కస్తూరి మామ్మ గారి రహదారి వనం దాకా రకరకాల కాలుష్య కారక వ్యర్ధాలను సంహరించారు.

 

పది మందికి పైగా స్వచ్చ సైనికులు అక్కడి నుండి ఉత్తర దిశగా సాగి మండల పరిషత్ భవనం ముంగిట, మండల రెవిన్యూ కార్యాలయం ఎదురుగా ఉన్న కాలుష్యాల మీద ఒక గంట పాటు యుద్ధం ప్రకటించారు. ఆ ప్రాంతం లోని మురుగు కాల్వలో దిగి దాని లోపల, రెండు గట్ల మీద ఉన్న అన్ని రకాలైన కాలుష్య కారకాలను ఏరి, నరికి, ఊడ్చి మళ్లీ ఈ మూడు ప్రాంతాలలో పోగు పడిన వానిని ఊడ్చి ఆ పోగులను ట్రాక్టర్ లోకి ఎక్కించి చెత్త కేంద్రానికి చేర్చి వచ్చారు.

 

కొంత మంది కార్యకర్తలు రోడ్డు పక్కన ఉన్న రద్దును ఎత్తి ట్రాక్టర్ లో వేసి బస్టాండ్ లో రోడ్డు పక్కన ఉన్న పల్లం లో వేసి సర్దారు.

 

సుందరీకరణ సభ్యుల RTC బస్ ప్రాంగణ చిత్ర లేఖన ప్రయత్నం అందరికీ సంతృప్తి కరంగా ఈనాడు ముగిసింది.

 

ఇన్ని రకాలైన గ్రామ మెరుగుదల శ్రమదాన కృషి 1921 రోజులుగా జరుగుతూ ఉంటే ఇది గమనిస్తున్న – పరిశీలిస్తున్న – వద్దన్నా మైకు నుండి వినిపిస్తున్న స్వచ్చ - శుభ్ర – సుందర స్ఫోరక గీతాలను వింటున్న సోదర గ్రామస్తులు ఈ స్వచ్చంద శ్రమదాన వేడుకలో ఎందుకు పాల్గొనరో తెలియకున్నది.

 

కోడూరు వేంకటేశ్వర రావు గారి వివాహ వార్షికోత్సవ జ్ఞాపికలుగా “మనకోసం మనం “ ట్రస్టుకు  అందిన 520/- ల విరాళానికి, కార్యకర్తలు వారి నుండి స్వీకరించిన స్వల్పాహార విందుకు మనందరి ధన్యవాదాలు, అభినందనలు.

 

లాయర్ కొడాలి మురళి  ముమ్మారు ప్రకటించిన గ్రామ స్వచ్చ- సుందర సంకల్ప నినాదాలతో, తాను త్వరలోనే క్రమం తప్పని స్వచ్చ సైనికుడుగా మారబోతున్నాననే వాగ్దానంతోను, నేటి మన గ్రామ కర్తవ్య దీక్ష రేపటికి – పెదకళ్లేపల్లి  మార్గంలోని మేకల డొంక దగ్గరకు వాయిదా పడింది.

 

     ఈ ప్రకృతి- ఈ దుర్గతి

అకాలముగ వాన-ఎండ-వికృతంగా ఈ ప్రకృతి

వికలమైన జనం ఎదలు- కకావికలమైన జగతి

ఏదో ఈ చల్లపల్లి స్వచ్చ సైనికులకు తప్ప

ఎవరికైన పట్టినదా ఈ పర్యావరణం దుర్గతి?

 నల్లూరి రామారావు  

 స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

శుక్రవారం – 14/02/2020

చల్లపల్లి.