2592* వ రోజు...........           15-Nov-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

మళ్ళీ గాంధీ స్మృతి వనం సుందరీకరణలో - @2592*

            మంగళవారం (15-11-22) వేకువ సైతం 4.19 కే స్వచ్ఛ కార్యకర్తలకు ముహూర్తం కుదిరింది. బెజవాడబాటలోని మహాత్ముని సాక్షిగా వారి స్వచ్ఛ సుందర శ్రమదానం 6.07 కి - తలా 100 నిముషాలు మొత్తంగా 25 మంది 2500 నిముషాల పాటు అదొక శ్రమ వినోదమన్నమాట! వినోదంఅనే అగత్యం ఎందుకొచ్చిందంటే :

            వాట్సప్ ఫొటోలు, వీడియోలు గనుక శ్రద్ధగా చూస్తే వింటే ఆ మాటకర్ధం తెలిసిపోతుంది. ధనం కోసం, కీర్తి కోసం పనిచేసినట్లుగా అదృశ్య శ్రవణాల్లో అనిపిస్తున్నదా? లేక - పరమ సంతోషంగా ఒక పాతిక మంది పాతిక వేల గ్రామస్తులకు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ తమ కర్తవ్యాన్ని అవలీలగా నెరవేరుస్తున్నట్లుందా?

            పైగా ఇదేదో ఒకనాటి ఒక ఏటి ముచ్చటా? 8 - 9 ఏళ్ల - అక్షరాలా 2592* నాళ్ల - ఎంత చూసినా తనివి తీరని శ్రమవేడుక! మరి - ఈ వేడుక నిర్వాహకులెవరు? సౌమ్యులే గాని గ్రామ కాలుష్యం పట్ల కఠినాత్ములూ, లబ్ద ప్రతిష్టులేగాని - ఉద్యోగ, వైద్య, రైతు ప్రముఖులే గాని, మురుగులు చేతుల్తో తోడే రోడ్లను చీపుళ్లతో ఊడ్చే మట్టి మనుషులు! (వీళ్లలో ఒకామె బెజవాడ జరూరు ప్రయాణమున్నా గంటైనా శ్రమ నియమం పాటించి వెళ్లింది!)

            ఊళ్లో వారు సీరియస్ గా ఆలోచించరు పట్టించుకోరు గాని, మన స్వచ్చోద్యమకారుల వైఖరి అదీ! నిబద్ధత అంతటిదీ! 6 లక్షల భారతీయ పల్లెల్లో ఈ మారుమూల చల్లపల్లే దేశమంతటికీ ఆదర్శంగా నిలుస్తున్నదిందుకే!

            గాంధీ స్మృతివనం రెండో ప్రక్కన జరిగిన నేటి కృషిలో కుండీలు మోసే వాళ్ల, గొప్పులు త్రవ్వే వాళ్లు, మూలల్దాకా ఎగుడు దిగుళ్లు చదును చేసేవాళ్లు, పాదుల్లో నీళ్లు వంపే వాళ్లు, ఆ స్థలాన్ని పట్టి పట్టి సుందరీకరించే వాళ్లు - ఇదంతా సూక్ష్మంగా ఒక్క మాటలో చెప్పాలంటే - మంగళవారం నాటి స్వచ్ఛ సుందరోద్యమం. ఇది గ్రహించగల్గిన వాళ్లకు ఇదే సామాజిక చైతన్య పాఠం!-

 

            కాఫీల వేళ అచ్చిక - బుచ్చిక ముచ్చట్లు గడిచాక - గోళ్ళ కృష్ణ గారు ముమ్మార్లు ఉద్యమ సార్థక ప్రతిజ్ఞలు పలికి నేటి గ్రామ స్వచ్ఛ పరిశ్రమ ముగిసింది.

            రేపటి వేకువ పరస్పర పునర్దర్శనం పాగోలు రహదారిలోనే!

       .... కార్యకర్తల పుట్టినిల్లిది!

కపట నీతుల నాచరిస్తూ - అబద్దాలనె ఆరగిస్తూ

తనను తానే మోసగించే సమాజంలో ఎనిమిదేళ్లుగ

స్వార్థమంటని సార్థక శ్రమదానమే ఆలంబనంగా

గ్రామ ప్రగతికి నడుం కట్టిన కార్యకర్తల పుట్టినిల్లిది!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   15.11.2022.