2593* వ రోజు.........           16-Nov-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి?

శ్రమ బంధుర సుమ సుందర చల్లపల్లి - @2593*

            బుధవారం (16-11-22) నాటిది ఆ పని దినాల సంఖ్య! వేకువ ఎప్పుడు మేల్కొన్నారో గాని, 3/4 కిలోమీటర్ల దూరంలోని పాగోలు మార్గానికి 4.19 కాకుండానే అడుగు పెట్టారు! వీధి మలుపు దాక పురోగమించిన 24 మంది శుభ్ర సుందరీకర్తలు మరొక ట్రాక్టరు నిండుగా వ్యర్ధాలను సేకరిం చారు. రోజుటి కన్న కొంచెం అలస్యమై - 6.20 దాక - రెండేసి గంటలు శ్రమిస్తే శ్రమించారు గాని - 6.30 తదుపరి చూడండి – ఈ వీధి ఒంపు సొంపుల్ని!

            “దేనికైనా పెట్టి పుట్టి ఉండాలి” అంటారు! “నోములు నోచి ఉండాలి” అనీ అంటారు. ఆ నానుడులు రెండూ చల్లపల్లి గ్రామానికీ, గ్రామస్తులకూ, ఈ రహదారి పైన పయనించే వారికీ వర్తిస్తాయి! గ్రామం నుండీ, పౌరుల్నుండి  రావలసిన సహకారమూ, ప్రోత్సాహమూ, భాగస్వామ్యమూ రాకున్నా - వాళ్లు అభ్యర్థించకున్నా - చల్లపల్లి వీధుల, 7 రహదారుల సుందరీకరణ బాధ్యతల్ని స్వచ్ఛ కార్యకర్తలు తీసుకొంటున్నారు మరి!

            ఇంత చలిలో ఏ 3.30 కో లేచి, 3/4 కిలో మీటర్లో గడిచి, ఒక ప్రణాళికానుగుణంగా – నియమబద్ధంగా వీధి పారిశుద్ధ్య బాధ్యతల కోసం 7.00 దాక - అంటే 3 ½  గంటల సమయ - శ్రమ – మేధోదానం చేయడమంటే - అందుకెంత సంకల్ప బలం కావాలి? 8-9 ఏళ్ల సుదీర్ఘ పారిశుద్ధ్య పరిశ్రమ కెంత ఓర్పు - నేర్పు కావాలి?

            ఇవేమీ లెక్క కుదరకుండానే చల్లపల్లికి రాష్ట్రీయ – దేశీయ – అంతర్జాతీయ గుర్తింపులు జరిగిపోయాయా? మన డాక్టరు DRK గారు పదే పదే పదే చెప్పే మాట – “డబ్బు సాయం, మాట సాయం ఎప్పుడైనా, ఎక్కడైనా ఉంటుంది. ఇంత కరుకు - మురికి - కఠిన కాయకష్టానికి ఈ చల్లపల్లిలో మాత్రమే అవకాశముంటుంది. అందుకే మానవ జాతి కంతటికీ “శ్రమయేవ జయతే” అనే సూత్రం వర్తిస్తుంది!

నేటి 2 డజన్ల మందీ ఒళ్ళు వంచి సుమారు 45 పని గంటలు సాధించినదేమిటని చూస్తే -  

1) ప్లాస్టిక్ గ్లాసుల, సంచుల, ప్లేటుల, ఖాళీ మద్యం సీసాల దరిద్రం తొలగించారు.

2) రేగు మొక్కల ముళ్ల కొమ్మల్తో సహా – ఎవరో కొట్టి పడేసిన తాటాకుల్తో సహా ప్రతి వ్యర్ధాన్ని నరికి – ట్రక్కులో కెక్కించి - చెత్త కేంద్రానికి చేర్చారు!

3) కాస్త ముందే పని నుండి వైదొలగిన నర్సులు దంతెలతో, చీపుళ్లతో కృషి చేశారు!

4) ఆరేడుగుర్ని చూశాను - పనిలో మునిగి, ఏ మంచి నీళ్లకో తప్ప తలయెత్తక - నడుమెత్తక శ్రమదానాల్లో మునక లేసేవాళ్లని!

            నేటి కృషి సమీక్షా సందర్భంలో చల్లపల్లి వారికి విన్పించేలా జబర్దస్త్ గా తన గ్రామ స్వచ్చోద్యమ సందేశాన్ని ముమ్మారు విన్పించినది దేసు మాధురి నామధేయురాలు.

            రేపటి బ్రహ్మ ముహూర్త సామాజిక బాధ్యత కోసం పాగోలు వీధి మలుపు దగ్గర మనం కలవవలసి ఉన్నది!

            తరలింపుడు ఇకనైనా!

ఓ ఆర్టీసీ ప్రాంగణమా! అద్భుత శ్మశానమా!

రహదారి వనమ్ములార! రమ్య శుభ్ర వీథులార!

ప్రతిదీ శ్రమ ఫలితమనుచు ప్రకటింపుడు - చల్లపల్లి

ప్రజలను శ్రమదానానికి తరలింపుడు ఇకనైనా!

 

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   16.11.2022.