2594* వ రోజు..... ....           17-Nov-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి?

గురువారం (17-11-22) నాటి స్వచ్చోద్యమ చల్లపల్లి - @2594*

          నేటి ఆ ఉద్యమ కర్తలు నిన్నటి వలెనే 24 మంది! వాళ్లు చలిలో - మంచులో పావుగంట సైకిళ్లు త్రొక్కుకొనో, ఇతర వాహనాల మీదనో పాగోలు బాట మలుపుకు చేరింది కూడ నిన్నటి వలెనే! ఇక అక్కడి నుండి వారి పారిశుద్ధ్య శ్రమదాన కథ సైతం పునరావృతమే! చలిలో కూడ వాళ్ల చెమటలు చింది శుభ్ర సుందరమైన రహదారి సుమారు 100 గజాలే!

          “మరి, ఇంతోటి చిన్న సంగతి మీద ప్రతిరోజూ ఇలా వర్ణించి వ్రాసి, సామాజిక మాద్యమాల్లోకెక్కించడం అవసరమా?” అనే శంకలు కొందరు కార్యకర్తల్లోనూ, గ్రామస్తుల్లోనూ  ఉండవచ్చు!

          నిప్పురవ్వ చిన్నదే గాని, సానుకూలంగానో - వ్యతిరిక్తంగానో దాని చర్య తీవ్రంగానే ఉండగలదు. 9 ఏళ్ల నాడు జనవిజ్ఞాన వేదిక 10 - 12 మందితో తలపెట్టిన గ్రామ స్వచ్ఛ – సుందర శ్రమదానం ఎందుకు వందలాది స్వచ్ఛ కార్యకర్తల్ని తట్టి లేపి భాగస్వాముల్ని చేసుకొన్నదో - సుమారు 40 గ్రామాల్లో శ్రమదాన బీజాలు వేసిందో - దిగజారిపోతున్న, విలువలు లుప్తమౌతున్న నేటి సమాజానికి ఈ ఉద్యమం అవసరమెంతో ప్రతిదినం గుర్తు చేసుకోవద్దా?

ఈ వేకువ సమయాన నా దృష్టిలో పడిన కొన్నిశ్రమదాన విశేషాలివి:

1) ఈ రెండు డజన్ల మందిలో ఒకానొక బీమా సంస్థ ఉన్నతోద్యోగి ఓ పది గజాల రహదారి భాగాన్ని గడ్డి చెక్కి – పూల మొక్కల పాదులు భద్రపరచి, ఒక్కటన్నా మిగలకుండ పిచ్చి మొక్కల్ని కలుపునీ పీకుతూ శ్రమించడం;

2) ఎనిమిదేళ్లుగా ఉద్యమ భారాన్ని మోస్తున్న ఒక సీనియర్ వైద్యుడు ఇక్కడి శ్రమదాన చర్యల్ని సమన్వయించడం కాక, గబగబా ప్రక్క రహదార్ల బాగోగుల్ని పరిశీలించి రావడం;

3) ఒక భారీ శరీరుడు – విశ్రాంత వృద్ధుడు వయస్సునూ - అలసటనూ పట్టించుకోక గంటన్నర పాటు తన కోసం కాక, తన ఊరి కోసం పనిచేయడం;

4) దూరంగా చెట్లకు అందాలద్దుతున్న సుందరీకర్తలు గాని, కుడి - ఎడమ చేతి వాటం గల ముగ్గురు రైతులు గాని, చీపుళ్ల రిగేలా రోడ్డు ఊడ్చిన నర్సులు గాని, సమయంతో పోటీపడిన చెత్త లోడింగ్ వీరులు గాని.... అసలెవరి కృషి చిన్నదని? తాముంటున్న ఊరి సౌకర్యాల పట్ల ఎవరి పట్టింపులో లోపమున్నదని?

          40 కి పైగా పని గంటల వీధి పారిశుద్ధ్యం తరువాత ఏ ఒక్కరిలోనైన నేటి తమ శ్రమదానం పట్ల సంతృప్తి తప్ప – “ఊళ్లో మిగిలిన వాళ్లకు పట్టనే పట్టని ఈ ప్రయత్నం నాకు మాత్రం ఎందుకు?” అనే ఆలోచన ఉన్నదా?

          6.30 కు ఏదో అసంకల్పితంగా కాక, మ్రొక్కుబడిగా కాక - పూర్తిగా మనసు పెట్టి చల్లపల్లి గ్రామ సౌందర్య సంకల్పాన్ని బలంగా నినదించినవారు - పద్మావతి డాక్టరు!

          అందరి అంగీకారంతో మన రేపటి వేకువ శుభ్ర - సుందరీకరణ కృషి ఇదే పాగోలు బాటలో అని ప్రకటించినది DRK వైద్యుల వారు!

          ఆ సంగతి తరువాతి మాట!

అందరి కవకాశముంది - శ్రమదానం చేసేందుకు

స్వచ్ఛ - సుందరోద్యమ సంచలనంలో కలిసేందుకు

వారంలో ఒక రోజా – వ్యక్తిగతం గాన - లేక

సకుటుంబంగానా అను సంగతి తరువాతి మాట!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   17.11.2022.