2595* వ రోజు..... ....           18-Nov-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి?

స్వచ్ఛ - సౌందర్య సాధనలో మరొక రోజు - @2595*

          తమ సొంతానికి కాక - తమ ఊరి కోసం నేటి (18-11-22 - శుక్రవారం) వేకువ శ్రమదాతలు 28+2 మంది! (చివరి వాళ్లు పాగోలుకు చెందిన స్వచ్ఛోద్యమ అతిథులు!) వారి శ్రమ సమయం 4.20 - 6.10 నడుమ! ఈ నిస్వార్ధ శ్రమ సమర్పితమయింది పాగోలు రహదారిలోని తొలి - మలి మలుపుల నడుమ!

          మంచు + ఉత్తరపు గాలితో కూడిన చలిపులి గాండ్రిస్తూనే ఉన్నది గాని - 8-9 ఏళ్లుగా అన్ని తుఫానుల్నీ, గ్రీష్మ తాపాల్నీ, హేమంత తుషారాల్ని తట్టుకొని, రాటుతేలిన స్వచ్ఛ కార్యకర్తలు దాన్ని లెక్కచేయనేలేదు! (ఏదో ఒకరిద్దరు మాత్రం ముందస్తు జాగ్రత్తగా స్వెట్టర్లు తొడుక్కొని కష్టించారు.) ఈ ఉదయం కూడ మరొక వంద గజాల రహదారి కశ్మలాలు పాతిక – ముప్పై మంది శ్రమకు బలైపోయినవి!

          రోడ్డుకు పడమర ఇంటి ప్రహరీ వైపుగా దురాక్రమిస్తున్న ఒక ముళ్ల చెట్టు కొమ్మలు అందులో ముఖ్యమైనది. ఇక్కడా, బాటకు తూర్పుగా పెరిగిన యూకలిప్టస్ తదితర చిందర వందర కొమ్మలూ, అంతకుముందే ఉన్న చిన్నపాటి ఎండు కొమ్మల - పిచ్చి కంపల డంపులూ, ఎగుడు దిగుళ్లూ – ఇక్కడే 20 మంది శ్రమ కేంద్రీకృతమైతే చక్కబడకేం చేస్తాయి?

          చల్లపల్లి సహృదయ జనాలకీ, ముఖ్యంగా మన వాట్సప్ – ఫేస్ బుక్ పాఠక మిత్రులకూ ఒక విన్నపమేమంటే – వారానికో, పక్షానికో, మాసానికో ఒక్కమారైనా వచ్చి, ఈ దైనందిన శ్రమదానాన్ని పరిశీలించండి - ఫర్వాలేదనిపిస్తే పాల్గొనండి ! లోపాలుంటే విమర్శించండి! నేనేదో ఉన్నదున్నట్లు వ్రాయక, అతిశయోక్తులో – అభూత కల్పనలో - అనవసర వర్ణనలో చేస్తున్నాననే అపవాదు అందుమూలంగా తొలగిపోగలదు!

          ప్రఖ్యాత వైద్యులూ, ఇంటి పనులు తప్ప వీధుల్లో కనిపించని గృహిణులూ, ఉద్యోగులూ, రైతులూ, మళ్లీ అందులో 70-80 ఏళ్ల వర్షీయసులూ ఇన్ని వేల రోజులుగా - లక్షల గంటలుగా ఒక నిర్దిష్ట సామాజిక ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్న విశిష్ట సామాజిక బాధ్యతను కాస్త నాలుగు మంచి మాటల్తో ఉన్నదున్నట్లు వ్రాయడమే నేను చేస్తున్నది.

          “ఒకవిధంగా నేటి కార్యకర్తల శ్రమదానం ఆద్యంతమూ నిన్న దివికేగిన ఆత్మపరబ్రహ్మం స్మృతి - చిహ్నంగానే జరిగినట్లుంది! నిన్న కాక, నేటి ఉదయం కూడ కార్యకర్తలాతని ఇంటికేగి, శ్రద్ధాంజలి ఘటించారు. నేటి కృషి సమీక్షా కాలంలో ఒక ఆదర్శ శ్రమదాన ఉద్దేశ్యాలైన గ్రామ స్వచ్ఛ – సౌందర్య సాధనా సంకల్ప నినాదాన్ని ప్రకటించినది పాగోలు దుర్గా ప్రసాదు గారు.

          రేపటి మన పునర్దర్శనం బెజవాడ రోడ్డులోని గాంధీ స్మృతి వనం దగ్గరే!

                   నా ప్రశ్న

ఎవరైనా మెచ్చదగినదీ స్వచ్ఛోద్యమ మైనప్పుడు -

ఏ గ్రామం భవితకైన ఇది హామీ ఇచ్చునపుడు -

సదసత్ చింతన పరులకు – సద్విచక్షణామయులకు

ఎందుల కనుసరణీయం ఇది కాలేదనెడి ప్రశ్న!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   18.11.2022.