2596* వ రోజు..... .......           19-Nov-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

ఊరి స్వచ్చ - సుందరీకరణ కోసం - @2596* రోజులు.

        శనివారం (19-11-22) వేకువ సైతం 4.20 కే ఊరి మెరుగుదల పనులు మొదలై 6.10 దాక అవిరళంగా జరిగాయి! స్థలం మాత్రం పాగోలుకు బదులు బెజవాడ రహదారిలో గాంధీ స్మృతి వనం. పనేమో కుడి ఎడమల మొక్కల పెంపకానికి ఎదురు చూస్తున్న జాగాలు! వ్యక్తులేమో - వేమన కవి చెప్పినట్లు గంగిగోవు పాలలాంటి, పురుషులందు పుణ్యపురుషుల్లాంటి 41 మంది!

        అందరివీ కలిపి 60 పనిగంటల పాటు అక్కడ జరిగింది కరసేవో - సామాజిక బాధ్యతో తమ తమ అంతరంగాల్ని సంతృప్తిపరుచుకోవడమో స్వ, పర బాధ్యతల్ని మరచిన నేటి ప్రజలకొక స్ఫూర్తిదాయక గుణపాఠమో - లేక కొందరనుకొనేట్లు పనీ పాటూ లేని, ఇంటి దగ్గర నిద్రపట్టని, కొద్దిమంది వీధి పారిశుద్ధ్య వ్యసనమో... ఏదైతేనేం వాళ్లనుకొన్న పద్ధతిలో జరిగేపోయింది!

        ఇంతకీ సామాజిక యోధులో, ఊరంతటి పాపాల్ని కడిగేసే చెత్తమనుషులో గాని ఇందరు స్వచ్ఛ కార్యకర్తలీ శనివారం వేకువ గజగజలాడిస్తున్న చలిలో ఏం సాధించారు? చీకట్లోనే - మట్టిలో చతికిలబడి, గునపాలతోను పారల్తోను నీళ్ల బకెట్లు మోస్తూను సంపాదించినది పరమార్థం? మహత్కార్యం నెరవేర్చారని ఇలా వ్రాసి, వాట్సప్ ల కెక్కించి, ప్రచార ప్రచార ప్రసార మాధ్యమాల్లో ఊదరగొట్టాలి? అనే సందేహాలకు :

        నేను ఏడెనిమిది గజాల దూరం నుండి కంటే బాగా దగ్గర కెళ్ళి చూస్తే గాని తెలియలేదు – కొందరు త్రవ్వుడు పారల్తో ఎంత బలంగా త్రవ్వి, పాదులు చేసి, 12 అంగుళాల దూరం చొప్పున పూల మొక్కలు నాటుతున్నారనే సంగతి. మరి - ఒక్క మారైనా వచ్చి, కార్యకర్తలతో కలిసి, వేకువ శ్రమ వేడుక చేయని - చూడని గ్రామస్తుల మాటేమిటి?

        గంటన్నరపాటు గునపాల పోటులేస్తూనూ, మట్టి పెళ్లల్ని పొడుం చేస్తూనూ, ఆర్కిటెక్ట్ గారి సూచనల ప్రకారం ఒక్కొక్కటి గా వందల పూల, క్రోటన్ మొక్కలు నాటడం రోడ్డు మీద వెళ్తూ చూసి, చప్పరించేసినంత సులభం కాదు మరి!

        ఎవరు మెచ్చినా, ఎవరు నొచ్చినా - మౌనముద్రాంకితుడైన ఒక కర్మిష్టి - సమాజ శ్రేయస్సు కోసం బలైన జాతిపిత ఈ 40 మంది నిష్కామ కర్మవీరుల ప్రయత్నాన్ని తప్పక ఆశీర్వదించే ఉంటాడు.

ఇన్నేళ్లుగా ఈ క్రింది ఒక వైచిత్రికి ఆశ్చర్యపడుతూనే ఉన్నాను:

1) 2596* రోజులుగా 30/40/50 మంది స్వచ్ఛ కార్యకర్తలు నిత్యం శ్రమిస్తూనే ఉంటారు ద్భిన్నంగా కొందరు. బాధ్యతా రహితులు రోడ్లను, మురుగు కాల్వలను కశ్మలాలతో నింపుతూనే ఉంటారు!

2) చల్లపల్లికి చెందిన ఒక ప్రవాసుడు తన ఊరి బాగు కోసం 20 వేల కిలోమీటర్ల దూరాన అమెరికాలో – 50 కి.మీ. పరుగులు పెట్టి దాతల దగ్గర డాలర్లు సమీకరిస్తాడు. ఇదే ఊళ్లోని కొందరు అందరికీ చెందిన స్థలాల్ని వాడుకుంటూ ఉంటారు!

        చేయగలిగినంత శ్రమదానం చేసి, 6.30 కు సమీక్షా సమయంలో తమ కుమారుడు – అర్నవ్ జన్మదినాన్ని - దుబాయి, హైద్రాబాద్ నుండి వచ్చి మరీ - ఈ స్వచ్ఛ శ్రమదాతనడుమ జరిపుకొన్న స్నేహ - కుమార్ లు అభినందనీయులు! ఆ కుర్రవాడి మరో 91 జన్మదిన సంబరాలకూ, వారు కార్యకర్తలకు చేసిన అనల్పాహార విందులకూ మన ఆహ్వానం!

        రేపటి మన వేకువ పునర్దర్శనం నిన్న ఆగిన - పాగోలు రహదారిలోనే!

        వర్ధిల్లుము - వర్ధిల్లుము

ఎవరికి నష్టము జరుగక - ఎవరికి కష్టము కలుగ

ఉమ్మడిగా చూసినపుడు ఊరికి మేలొన గూర్చే

సమైక్యతను శ్రమ శక్తిని చాటగలుగు - మీటగలుగు

చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమమా! వర్ధిల్లుము!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   19.11.2022