2597* వ రోజు....           20-Nov-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ లు వాడనే వాడం!

ఇది పరిసరాల హరిత – సౌందర్య సాధనలో – 2597* వ నాడు!

       ఇది ఆదివారం (20-11-22) వేకువ 4.20 6.12 నడిమి సమయం! అది చల్లపల్లికి 3 ½ కిలోమీటర్ల - పాగోలు గ్రామ సమీప R&B మార్గం! అక్కడ రకరకాల నేపధ్యాల సామాజిక కార్యకర్తలు పాతిక మంది! వాళ్లు పాటుబడి శుభ్ర - సుందరీకరించింది 100 గజాలలోపు రహదారినే! ఐతే అక్కడ 112 నిముషాల సందడిగాని, వారు పొందిన సంతృప్తి గాని గణనీయమే!

       ఎక్కడ లైఫ్ బాయ్ ఉండునో - అక్కడ ఆరోగ్యం తిష్ఠవేయును అనే పాతకాలపు ప్రకనలాగా ఎక్కడ జనావాసములున్నవో - అచ్చటే కాలుష్యం పెచ్చరిల్లునుఅనేది నేటి వాస్తవం! నెలనెలా స్వచ్ఛంద శ్రామికులు చెమటోడ్చి బాగుచేస్తున్న రహదారి మీద ఇన్నిరకాల చెత్తలు ఎలా వచ్చి చేరతాయి మరి?

       ఈ ఉదయం శ్రమదాన కాలంలో కార్యకర్తల మనసులు చివుక్కుమన్నదీ - వాళ్లు పదేపదే శ్రద్ధాంజలి ఘటించిందీ - తాము ఐదారేళ్లుగా పోషించిన, గుమ్మటంలా పెరిగి, పూలు విరబూసిన అందమైన, పొందికైన ఎవరి అపోహకోబలై, దీనంగా బాట ప్రక్కన పడి ఉన్న ఏడాకుల వృక్షానికే! పెంచిన మమకారం మరి ! అది పెరిగి ఐదారేళ్లుగా పంచిన పచ్చదనానికీ, ఆహ్లాదానికీ, ప్రాణ వాయువుకూ నేటితో స్వస్తి!

       ఒక వంక తాము నిన్న శాశ్వత వీడుకోలు పలికిన ఆత్మ పరబ్రహ్మం జ్ఞాపకాలతోను, మరో ప్రక్క చల్లపల్లి స్వచ్ఛ శుభ్ర - జాగృతి కోసం అమెరికాలో 50 కిలోమీటర్ల పరుగులు చేస్తున్న నాదెళ్ల సురేష్ కబుర్లతోను నేటి కార్యకర్తల వీధి శుభ్ర కృషి నడిచింది! పాగోలు నుండి కార్యకర్తల ద్వయం తప్ప స్ధానికుల తోడ్పాటూ లభించనే లేదు!

       6.30 వేళ ముగింపు సభలో మాత్రం గుండె జబ్బుల కారణాలూ – నివారణ కోసం జాగ్రత్తల గురించీ కొంత చర్చ జరిగింది. కర్ణాటకం నుండి వేమూరి అర్జునుల వారి పరామర్శ కూడ జరిగింది.

       ఈ ఉదయం గ్రామ స్వచ్ఛ - సౌందర్య సంకల్పాన్ని చాటి చెప్పే వంతు ధ్యానమండలి తరపున శ్రీమాన్ గోళ్ల వేంకటరత్నం గారిది!

       బుధవారం నాటి వేకువ మన విధి నిర్వహణ కూడ పాగోలు సమీపంలోనే అనే నిర్ణయం కూడ వచ్చింది!

       ప్రశ్న ప్రశ్నగా మిగిలెను!

జగమంతా పదే పదే వినుతిస్తూ – విరుపిస్తూ

తీర్ధయాత్ర పద్ధతిగా తరలి వచ్చు - అనుకరించు

చల్లపల్లి స్వచ్ఛోద్యమ శ్రమదానం గ్రామస్తులు

పాటింపని దెందుకన్న ప్రశ్న ప్రశ్నగా మిగిలెను!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   20.11.2022