2598* వ రోజు.......           21-Nov-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి?

2598* వ నాటి గ్రామ బాధ్యతలు రెస్క్యూ దళానివి!

          సోమవారం సదరు బాధ్యతా మూర్తులు 4+1 మందే! ఈసారి వాళ్ల దృష్టి సన్ ఫ్లవర్ కాలనీ వీధి పైన బడింది! పాఠశాల – వసతి గృహాల సమీపంలోనే ఆ ఖాళీ స్థలం, దానిలోనే ఎవరో కొట్టి పడేసిన బోలెడు కొమ్మలు అవి ఎండి, గడ్డి పెరిగి చూడడానికి కలిగిస్తున్న అసహ్యం.

          వాటి సంగతి చూడాలనే ఈ స్వచ్ఛ కార్యకర్తల చతుష్టయం పూనిక! గంటంబావు పాటు జరిగిన ప్రయత్నంతో ఆ 10 సెంట్ల ఖాళీ స్తలము, ముఖ్యంగా రోడ్ల బారునా రెండు దిక్కులు ఇప్పుడు బాగానే మెరుగుపడినవి.

          ఓ ప్రక్కన తుఫాను వాతావరణం – ఈదురు గాలుల మధ్య వానజల్లులు, అక్కడ సామాజిక చైతన్యవంతులైన గృహస్తులున్నారు గాని ఆ క్లిష్ట వాతావరణం వల్ల కాబోలు - కార్యకర్తల పనికి సహకరించలేదు.

          నేటి ఐదుగురి సంకల్పం ముందు మాత్రం గంటకు పైగా మబ్బులూ - చలి గాలులూ- వానజల్లుల చికాకులేవీ పనిచేయలేదు.

          6.30 తరువాత నరసింహ నామధేయుని గ్రామ స్వచ్ఛ - సౌందర్య విధేయ నినాదాల తదుపరి రెస్క్యూ టీం వారి నేటి కృషి పరిసమాప్తి!

          ఒక విశ్వంభర కీర్తి

స్వచ్చోద్యమ చల్లపల్లి ఒక విశ్వంభర కీర్తి

నిబిడీకృత ఘన సంస్కృతి – నిత్య శ్రమదాన ప్రగతి

ఏ వీధిని పలకరించు - ఎన్ని వ్యధలు చెపుతుందో!

కార్యకర్త కఠిన శ్రమల కథలు పలవరిస్తుందో!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   21.11.2022.