2599* వ రోజు..........           22-Nov-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి?

రాశిపరమైన మైలురాయికి దగ్గరగా స్వచ్చోద్యమం - @2599*

            ఈ మంగళవారం వేకువ కూడ (22-11-22) మళ్లీ తుఫాను వాతావరణమే! చినుకుల్తో జంటగా చలిగాలులు వీస్తున్న 4:30 సమయమే! రెస్క్యూ టీమ్ కూడ నిన్నటి వలెనే నలుగురైదుగురే!

            వాళ్ల శుభ్ర - హరిత - సుందరీకరణ ప్రయత్నం మాత్రం చల్లపల్లిలో కాక 3 కిలోమీటర్ల దూరంలోని పాగోలు తూర్పు భాగాన వడ్లమర దగ్గర మొదలయింది. సుమారు అరకిలోమీటరు దాక NTR పాఠశాల దిశగా సాగింది.

            ఈ అల్ప సంఖ్యాక కార్తకర్తల అనల్ప ఉద్యోగాన్ని ఆ బాటన వెళ్లే వారు గాని గృహస్తులు గాని ఎవరు పట్టించుకొన్నారు? స్వచ్ఛ - సుందర వ్యవసాయదారులు మాత్రం గంటన్నర కాలం తదేక దీక్షగా - గతంలో తాము నాటిన మొక్కల పాదుల్లో కలుపు తీసుకొంటూ, పాదుల్ని సరిజేస్తూ, వాటిలో ఆర్గానిక్ ఎరువులు కలుపుకొంటూ శ్రమించారు.

            పని ముగించుకొని, గస్తీ గది దగ్గరకు చేరుకొని, ఉన్నంతలో పరిమిత భాషి ఐన తూములూరి లక్ష్మణ ప్రకటిత గ్రామ స్వచ్ఛోద్యమ నినాదాలను పునరుద్ఘాటించారు.

            రేపటికి తుఫాను సద్దుమణగవచ్చు. బుధవారం వేకువ మనం కలిసి, శ్రమించదగిన చోటు పాగోలు గ్రామ సమీపంలోనే!

            ఇంత తృప్తి దాగుందా?

యశస్సుకై పెనుగులాట కింత గాఢతుంటుందా!

తనదిగ ఊరిని తలవక త్యాగమింత పుడుతుందా!

ఆరుగాలముల వీధుల నందగింప వీలుందా!

ఇతరుల మేలుకు కృషిలో ఇంత తృప్తి దాగుందా?

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   22.11.2022.