2600* వ రోజు...... ....           23-Nov-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి?

2600* వ నాటి శ్రమదానం ఆత్మ సంతృప్తికరం!

            బుధవారం (23-11-22) 4.20 కే పాగోలు రహదారి మీద రెండో ములుపు దగ్గర వీధి శుభ్రతాపరులు డజను మంది! కొంచెం సేపటి తర్వాత చూస్తే ఆ సంఖ్య 25 - అందులో పాగోలు నుండి ముగ్గురు. అక్కడి నుండి 6.10 దాక - ఇంచుమించు 2 గంటల పాటు ప్రత్యక్షంగా రకరకాల కశ్మలాల మీద, పరోక్షంగా గ్రామ సుందరోద్యమానికి స్పందించని వేల మంది ఉభయ గ్రామస్తుల చైతన్య రాహిత్యం పైన వారి పోరాటం!

            పోరాట ఫలితంగా బండి పట్టనంతగా చెత్తా చెదారం సమీకరణ! పిచ్చి - ముళ్ల మొక్కల, ప్లాస్టిక్ పదార్ధాల, చిత్తు కాగితాల, ఖాళీ మద్యం సీసాల, ఎవరో కట్టిపడేసిన ఎండుపుల్లల కొట్టివేతలు, ఏరివేతలు! గ్రామ జన జీవితాల మెరుగుదలకవసరమైన - ఆహ్లాద కల్పన కోసం వాళ్ళ ఆయుధాలైన కత్తులు, దంతెలు, డిప్పలు, చీపుళ్లు వంటి ఆయుధాల ప్రయోగం!

            గతంలో మనం ప్రస్తావించుకొన్నట్లు - పాతిక వేల మంది జన సంఖ్యకు పాతిక మంది దామాషా, ఐతే కానీండి; ఇంటి ముంగిట్లో ఎవరెవరో ఎచ్చటెచటి నుండో వచ్చి శుభ్రపరుస్తున్నా వచ్చి కలవని సోదరుల సంగతి వదిలేద్దాం; వాళ్లు కాస్తంత గ్రామ సామాజిక స్పృహతో :

1) ప్లాస్టిక్ సంచుల వంటి ఏకమాత్ర ప్రయోజనకరమైనవి వాడకుండా, రహదార్ల మీద, డ్రైన్లలో విసరకుండా ఉంటే చాలనీ -

2) ఖాళీ మద్యం సీసాల్ని బాటల మీద పడేయకుంటే మేలనీ -

3) మనకు మేలు చేస్తున్న చెట్లను అవసరం లేకున్నా కొట్టేయకుండాలనీ కోరుకుందాం!

            నిన్నటికన్న చలి ఉధృతి కాస్త తగ్గింది గాని, ఈ వేకువ సైతం రోడ్డుపైన వణికించే చలే! అది స్వచ్ఛ కార్యకర్తలకు మాత్రం సుపరిచితమే!

            చెట్ల కొమ్మల్ని క్రమబద్ధీకరించడం, పూలమొక్కల పాదుల్ని పరామర్శించడం, రహదారిని ఊడ్చి శుభ్రపరచడం వంటి పనులు పూర్తయ్యాక, DRK గారి నేటి సమీక్షా వచనాలు ముగియక ముందు, శివరామపురం నుండి వచ్చి పాగోలు రహదారిని సంస్కరించిన కొత్తపల్లి లవ్లీ వేంకటేశ్వరరావు ముమ్మారు స్పష్టంగా వినిపించిన గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలు కార్యకర్తల కంఠాల నుండి సమైక్యంగా ప్రతిధ్వనించాయి.

            పెదకళ్లేపల్లికి చెందిన గొర్రెపాటి పార్థసారధి గారు వారి భార్య రత్న కుమారి జ్ఞాపకార్ధం మనకోసం మనంట్రస్టుకు 5,175/- విరాళం సమర్పించినందుకు ధన్యవాదాలు.

            రేపటి మన వీధి బాధ్యతల కోసం పాగోలు సమీపంలోనే ఆగి చాతనైనంత కృషి చేద్దాం!

            దారి దివ్వెగ మిగిలి ఉన్నది!

అసలు స్వచ్చోద్యమం ఎందుకు? – గ్రామమెల్ల సుఖించడానికి!

అలాగని శ్రమదానమందున అన్ని వార్డుల జనం కలవరు!

మాట సాయం కొందరిది - మొగమాట హాసం చేసి కొందరు

ఎనిమిదేళ్లుగా వెలుగుతున్నది - దారి దివ్వెగ మిగిలి ఉన్నది!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   23.11.2022.