2601* వ రోజు...... .......           24-Nov-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి?

2601* వ నాటి వీధి శుభ్ర సంకల్పం.

            చలిగాలితో జంటగా విజృంభించిన మంచును లెక్కచేయక గురువారం వేకువ 4.20 కే పాగోలు సమీప రహదారిపైన 29 మంది స్వచ్ఛ కార్యకర్తల సన్నద్ధతను గమనించారా? అందులో నలుగురు పాగోలుకు చెందిన వారుండటం కాస్త శుభసూచకం.

వాట్సప్ ఛాయా చిత్రాల్లో మంచు వల్ల బాగా కనిపించని కొందరి శ్రమదాన విన్యాసాలను వివరిస్తాను:

- ఒక సుందరీకర్త నిచ్చెన కడదాక ఎక్కి నిలిచి, కరెంటు తీగల దాక పెరిగిన వేప కొమ్మల్ని తొలగించి, పచ్చదనాన్ని క్రమబద్ధీకరిస్తున్న వైనం! (ఇది సాహసమో, అత్యుత్సాహమో కావచ్చు)

- మంచుకు తడిసిన గడ్డిలో, మట్టిలో కూర్చొని, రహదారి సుందరాకృతికి తోడ్పడని ఒక పొట్టి - తాడి చెట్టును మొదలంటా నరికేస్తున్న శ్రమ ;

- ఏడెనిమిది మంది కత్తులకు పని చెప్పి కొన్ని ముళ్ల - పిచ్చి - మాచర్ల మొక్కల్ని నరికి బాటను విశాలపరచడం! (ఏం చేశాడో గాని - ఒకాయన చేతికత్తి విరిగిపోనే పోయింది.)

- ఇక చీపుళ్లతో బాటనూ, మార్జిన్లనూ గంటన్నర పాటు ఊడ్చే వాళ్ల కష్టం దూరంగా నిలబడీ - చూసుకొంటూ వచ్చేపోయే వాళ్లకేం తెలుస్తుంది?

- నరికేసిన, పీకేసిన కొమ్మ - రెమ్మల్నీ, గడ్డినీ, ఎండు కొమ్మల్నీ దంతెలతో గుట్టలు చేసి, డిప్పలతో ట్రాక్టరులోకి బట్వాడా చేసిన వారి బాధ్యత?

- మిగిలిన మరికొందరేమో ముదనష్టపు ఖాళీ సారా సీసాల్నీ, ప్లాస్టిక్ సంచుల్నీ ఏరి, రెండు గోతాలకెత్తడం కాస్త తేలిక పనే కావచ్చు!

            తమది కాని రహదారి స్వచ్ఛ - సౌందర్యం కోసం ఇళ్ల నుండి ఏ 3 - 4 కిలోమీటర్లో పయనించి, చలీ - మంచూ వైపరీత్యాలనెదిరించి, చాల మంది నాగరికులు అసహ్యించుకొనే రహదారి పారిశుధ్యం కోసం శ్రమించిన సోదర కార్యకర్తలకు ఉభయ గ్రామాల తరపున ప్రణామాలు!

            6.25 కు సమీక్షా సభ జరిగిన రామబ్రహ్మం గారి కొబ్బరితోట ఒకప్పుడు గ్రామ పెద్దల సత్సంగ స్థలమట! నేడది ప్లాస్టిక్ గ్లాసుల సారాసీసాల - సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ల దుస్సంగ ప్రదేశంగా మారిపోయింది.

            ఒక ప్రక్క విరగ పండిన వరిచేలు, నడుమ బారులు తీరిన హరిత వృక్షాల మధ్య నల్లని తారు రోడ్డు - అక్కడ నిస్వార్థంగా గుంపెడు మంది రహదారి మెరుగుదల కృషి - ఇవన్నీ తలచుకొని దాసరి రామకృష్ణ వైద్యుని పరమానందం!

            అంతకుముందు నేనే మన ఊరి స్వచ్ఛ శుభ్ర - సౌందర్య సంకల్ప నినాదాలను పలికి, అందరిచే పలికించి సంతోషించాను.

            రేపటి వేకువ ద్విగుణీకృత చైతన్యంతో మనం శ్రమించదగిన చోటు యార్లగడ్డ శివప్రసాదు గారి ఇంటి సమీపం నుండి.

            స్థిత ప్రజ్ఞ కలవారికి

స్వార్ధరహిత సేవలందు జయాపజయములు ఎక్కడ?

ప్రతిఫల మాసించనపుడు నిరాశా నిస్పృహ లెందుకు?

స్థిత ప్రజ్ఞ కలవారికి చిరాకులూ పరాకులా?

ఎనిమిదేళ్ల ఉద్యమాని కింకను ఆటంకములా?

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   24.11.2022.