1922* వ రోజు....           15-Feb-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1922* వ నాటి కొన్ని ప్రత్యేకతలు.

పొగ మంచు ముంచేస్తున్న ఈ వేకువ 4.05 - 6.20 నిముషాల నడుమ పెదకళ్లేపల్లి మార్గంలోని మేకలడొంక సమీపంలో జరిగిన చల్లపల్లి స్వచ్చ సైన్య శ్రమదాన వేడుక విజయవంతంగా ముగిసింది. చల్లపల్లికి సుమారు 2 కి. మీ దూరంలో దట్టమైన మంచులో, ఊరి పొలిమేరలలో 21 మంది నిర్వహించిన ఈ నిస్వార్ధ గ్రామ బాధ్యతా నిర్వహణ చిరస్మరణీయమైనది.

 

మేకలడొంక ప్రక్క మురుగు కాలువ గట్ల ఉభయదరుల మీద దట్టంగా కమ్ముకున్న పొదలను 64 ఏళ్ల ఒకే పేరుగల ఇద్దరు వృద్ధులు (వంగలేక కాబోలు) ఎగుడు దిగుడు నేల మీదనే చతికిలబడి, నరికి గడ్డిని చెక్కి, గొర్రులతో బయటకు లాగి కాలుష్యం మీద, అనాకారితనం మీద జరిపిన పోరాటం నన్ను ఆకర్షించింది. వంతెన నుండి చల్లపల్లి వైపుగా రోడ్డు ప్రక్కల ఇద్దరు స్వచ్చంద శ్రమదాతలు రకరకాల ముళ్ల, పిచ్చి మొక్కలను ఆ గాఢమైన మంచులో, చలిలో చెమటలు చిందిస్తూ శుభ్రపరచడం శ్రమైకజీవన సౌందర్య నిరూపణం కాక మరేమిటి?

 

వంతెన నుండి దక్షిణపు దారికిరువైపులా మిగిలిన కార్యకర్తలు డ్రైన్లలోని రకరకాల వ్యర్ధాలను బయటకు లాగి, గడ్డిని, మొక్కలను తొలగించి గతంలో తాము నాటి పెంచిన చెట్లు, పూల మొక్కల పాదులను సరిదిద్ది, మళ్ళీ ఈ వ్యర్ధాలన్నిటినీ గొర్రులతో పోగులు చేసి ట్రాక్టర్ లో కి ఎక్కించి 3,4 కి.మీ దూరంలోని చెత్త కేంద్రానికి తరలిచారు. పని జరిగినంత మేర ముగ్గురు మహిళా కార్యకర్తలు చీపుళ్లతో పెదకళ్లేపల్లి దారిని ఊడ్చి శుభ్రం చేస్తూనే ఉన్నారు.

 

సుందరీకరణ బృందం సభ్యులు RTC బస్ ప్రాంగణంలో గత 15 రోజులుగా తీర్చిదిద్దుతున్న ఒక కళాఖండాన్ని సర్వాంగ సుందరంగా - వందలాది ప్రయాణికుల దృష్టి దాని మీద నుండి మరలనట్లుగా - ఈ వేకువలో పూర్తి చేశారు. (పురాతనమైన చల్లపల్లి అసలు కోట కన్నా ఈ బస్ ప్రాంగణంలోని చిత్రమే అందంగా ఉన్నదేమో అని నా అనుమానం) ఒక అరగంట సమయం మిగిలినందున వీరు బస్ ప్రాంగణ భవన స్తంబాల వెలిసిపోయిన రంగులను గీకి, ప్రైమర్ పూసి, రంగులు వేశారు.

 

మేకలడొంక వంతెన సమీపంలో 6.40 నిముషాలకు జరిగిన స్వచ్చ కృషి సమీక్షా సమావేశంలో:

 

- భోగాది వాసు గత 2 వారాల తమ సుందరీకరణ పూర్వాపరాలను వివరించి స్వచ్చోద్యమ నాయకత్వ పటిమను గుర్తుచేసి, గొంతెత్తి ముమ్మారు ప్రకటించిన గ్రామ స్వచ్చ- సుందర సంకల్ప నినాదాలను ప్రకటించి నేటి మన దైనందిన కర్తవ్య దీక్షను రేపటికి వాయిదా వేశారు. (ఇదే మేకలడొంక సమీపంలో)

 

- డా. దాసరి రామకృష్ణ ప్రసాదు గారు నిన్నటి కుంచెనపల్లి అరవింద పాఠశాల విద్యార్ధుల చల్లపల్లి పర్యటనను, ఆ పిల్లల ద్వారా స్వచ్చ సుందర చల్లపల్లి సుదీర్ఘ ఉద్యమ ప్రస్థాన సందేశం సమాజంలో విస్తరించే అవకాశాన్ని ప్రస్తావించారు.

 

- అన్నింటికన్నా పెద్ద విశేషం - ఐక్యరాజ్య సమితి(UNO) లో నిన్న న్యూయార్క్ లో మన స్వచ్చ చల్లపల్లి కార్యకర్త నాదెళ్ళ సురేష్ గారు ఈ స్వచ్చోద్యమ చల్లపల్లి 1922 రోజుల ప్రస్ధాన విశేషాలను 10 నిముషాల పాటు వివరించడం. ఈ వివరణ సమయంలో అక్కడి దేశదేశాల ప్రతినిధులు తమ ముందున్న మంచినీటి  ప్లాస్టిక్ సీసాలను తీసి తమ వెనుక దాచుకోవడం మన స్వచ్చ చల్లపల్లి సైన్య సుదీర్ఘ కృషి ప్రభావమే అని భావిద్దాం. (ఈ సంఘటన భారత కాలమానం ప్రకారం ఈ వేకువజామున జరిగింది)

 

రేపటి వేకువ 4 గంటలకు శివరాంపురం దారిలోని మేకలడొంక సమీపంలో మన స్వచ్చంద బాధ్యతలను పునః ప్రారంభిద్దాం.

 

          సద్యః ఫల ప్రాప్తిరస్తు

వందలాది స్కూలు పిల్లల స్వచ్చతా సంకల్ప దీక్షలు!

ప్రక్క జిల్లా నుండి సుందర చల్లపల్లి విహార యాత్రలు-

ఇవే మన ఈ స్వచ్చ సైన్యం వీర విక్రమ విహారమ్ములు

ఇవి కదా స్వచ్చోద్యమ క్రమ విస్తృతికి సద్యః ఫలమ్ములు!

 

 నల్లూరి రామారావు  

 స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

శనివారం – 15/02/2020

చల్లపల్లి.