2606* వ రోజు ....           29-Nov-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి?

స్వచ్చంద శ్రమదాన పనిదినాల వరుస సంఖ్య – 2606*

          ఇది మంగళవారం కనుక - నియమానుసారం స్వచ్ఛ సైన్యంలోని ఒక ఉప విభాగం వారు 29-11-22 ను తమకు కేటాయించుకొని - ఎక్కడో 3 కిలోమీటర్ల దూరాన పాగోలు దగ్గర - ఐదారుగురు శ్రమదాన ముదుర్లు ఈనాటి స్వచ్చోద్యమ పతాకాన్ని ఎగురవేశారు!

          ముదుర్లు కనుక ఇంకా వాళ్లకి దూరమెంతైతే ఏమిటి - మంచు దంచితే మాత్రం, దానిక్కాస్త గాలి కూడ కొటితే మాత్రం లెక్కేముంది? మనుషుల దృఢ సంకల్పాన్ని ప్రకృతి మాత్రం ఏమి అడ్డుకోగలదు?

          అదుగో కాస్త మన జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యంసామాజిక మాధ్యమ చిత్ర విచిత్రాల్ని పరిశీలించండి! సగం ఎండిన కొమ్మ - రెమ్మల్నీ, ఇతర తుక్కు గుట్టల్నీ వాళ్లెలా తిరగేస్తున్నారో, రహదారి అందాల్ని ఏ మాత్రం మెరుగు పరుస్తున్నారో, సుఖంగా ఈ బ్రహ్మ ముహూర్తంలో ఉభయ గ్రామస్తులు నిద్రిస్తున్న వేళ తమ కోసం కాక – ఊరి జనం సౌకర్యార్థం ఎందుకు పాటుబడుతున్నారో తెలిసివస్తుంది!

          యధాప్రకారం 6.30 తరువాత, తామనుకొన్నట్లు వీధి పారిశుద్ధ్య పనులు చక్కబెట్టిన సంతృప్తితో కస్తూరి విజయ్ కుమార్ గారు ముమ్మారు నినదించిన స్వచ్చోద్యమ ఆశయాన్ని పునరుద్ఘాటించి, గృహోన్ముఖులయ్యారు!

          రేపటి మన శ్రమదాన ప్రస్థానం - గత ఆదివారమే నిశ్చయించినట్లు - నడకుదురు బాటలోని రాజా వెంచర్దగ్గరే మొదలౌతుంది.

          సమీప గృహస్తులెవరైనా వచ్చి కలిస్తే బహు సంతోషం!

          చేస్తున్నాం ప్రణామాలు – 170

ఊరి వీధులు తిరిగి చూడుము – కుఢ్య చిత్ర ప్రబోధమ్ములు

ఊరి వెలుపలి ఏడుదారులు హరిత వింతలు, పూలతోటలు

అందమే ఆనందమైతే అదీ ఊరికి క్రొత్త కాదోయ్

స్వచ్ఛ సైన్యం శ్రమకు శ్రద్ధకు సమర్పిద్దాం సత్ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   29.11.2022.