2607* వ రోజు ....           30-Nov-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

మరో రహదారిలో 2607* వ నాటి సుందరీకరణం.

          ఆ సుందరీకరణం, వీధి మెరుగుదల పారిశుద్ధ్య కృషి ఊరిలో ఏదో ఒక చోటనో – 7 రహదార్లలోనో ఎడతెరపి లేకుండా జరిగే విషయమే! ప్రతి వేకువ సమయంలోనూ ఏదో ఒక ప్రక్క ఆ స్వచ్ఛంద శ్రమదాన పతాకం రెపరెపలాడుతుండే మాట నిజమే! ఈ బుధవారం బ్రహ్మ కాలంలోనూ 24 మంది సామాజిక బాధ్యుల తలా వంద నిముషాల అలాంటి ప్రయత్నం జరిగింది. కాకుంటే – ఇక్కడొక చిన్నపాటి విశేషమేమంటే:

          అది నడకుదురు దిశగా - చల్లపల్లికి 1 కిలోమీటరు దూరాన - ఒక్కో కార్యకర్త ఇంటికి సగటున 3 కి.మీ. దవ్వున 4.23 కే మొదలయింది! ఈ నడుమ రెండు మూడు మార్లు ట్రస్టు కార్మికులు పాటుబడడం తప్ప – స్వచ్ఛ కార్యకర్తలు సంవత్సరం పాటు ఈ దారి మీద శీతకన్నేశారట! పాపం - తమను నాటి, పోషించిన వాళ్ల కోసమూ - పదేపదే ఊడ్చి బాగు చేసిన మనుషుల కోసమూ - మెరుగులు దిద్దిన వాళ్ల రాకకూ ఆ మొక్కలు, మార్జిన్లు, మురుగు కాల్వలు ఎంతగా ఎదురు చూసి ఉంటాయో!

          1 వ కి.మీ. రాయి వద్ద మొదలైన రెండు డజన్ల మంది పనివాళ్ళు “100 గజాలకు పైగా నడకుదురు దారిని ఏం సంస్కరించారు, గ్రామ సామాజిక బాధ్యతనెంత వరకు నెరవేర్చుకొన్నారు, తన్మూలంగా ఏమాత్రం సంతృప్తి పొందగలిగారు..... అని పర్యాలోకిస్తే:

          అసలది వేకువ కటిక చీకటి – వీధి లైట్లన్నా వెలగడంలేదు - పైగా మెడలో గంటలు మ్రోగని ఎడ్ల ఇసుక బళ్లు! ఆ 100 గజాల జాగాలో - రెండు డ్రైన్ల అంచుల దాక శ్రమదాతలు రెండు భాగాలుగా మారి,

- కొందరు పనికి మాలిన మొక్కల్ని, తీగల్ని నరిక్కుంటూపోతుంటే,  

- మరికొందరు దంతెలతో గుట్టలుగా లాగుతుంటే,

- చీపుళ్ల నిపుణులు తమ పని తనం చూపుతుంటే,

- ప్లాస్టిక్ సీసాల్నీ, సారా గాజు బుడ్లనీ రెండు గోతాల నిండుగా ఒక పెద్దాయన సేకరిస్తుంటే-,

- వీళ్లలో ఐదారుగురు చివరి 25 నిముషాలు నేటి వ్యర్థాల ప్రోగుల్నీ, ఎవరు నరికినవో గాని, చెట్ల ఎండుకొమ్మల్నీ ట్రాక్టర్లో నింపుకొని చెత్త కేంద్రానికి తరలిస్తుంటే,

          100 నిముషాల శ్రమదాన కాలం ఇట్టే గడిచిపోయింది!

          కాఫీ ఆస్వాదనం పిదప శివబాబు గ్రామ స్వచ్ఛ - సుందరీకరణోద్యమ ఉద్దేశాన్ని గట్టిగా నినదించి, మనిషి చావు - పుట్టుకల తత్త్వాన్ని క్లుప్తంగా - తమాషాగా వివరిస్తే - డాక్టరు గారు కొన్ని స్వచ్ఛోద్యమ గణాంకాల్ని ప్రస్తావించారు.

          రేపటి వేకువ సమయపు రహదారి పారిశుద్ధ్య సమీకరణం కూడ నడకుదురు బాటలోనే!

          చేస్తున్నాం ప్రణామాలు – 171

బాహ్య మల సర్జనలు మానిపి - మరుగు దొడ్లకు నాంది పలికి-

వీధి కుఢ్యము లందగించీ - దేవళములను బాగుపరచీ

సత్ప్రవర్తక సచ్ఛరిత్రతో జనుల మనసులు మార్చి, గెలిచీ

సుదీర్ఘకాలం ఉద్యమించిన కార్యకర్తకు నా ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   30.11.2022.