2608* వ రోజు ....           01-Dec-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

సుదీర్ఘ శ్రమదానోత్సవం - @2608*

            గురువారం (01.12.2022) నాటి వేకువ 4.20 కన్న ముందే 13 మంది, కొద్ది నిముషాల ఎడంలో మరో 15 మందీ వెరసి 28 మంది శ్రమదాతల 105 నిముషాల చొరవతో నడకుదురు దారిలో నిన్నటి తరువాయిగా మరొక 100 గజాల దాక- పరిశుభ్ర-సుందరీకరణ  పరీక్షలో ఉత్తీర్ణమయింది!

            ఆ సమీప నివాసుల్లో కొందరు స్వచ్చతకు ప్రత్యర్థులో కక్షి దారులో సామాజిక స్పృహ చాలని వారోగాని- వాళ్ళ కృషీ తక్కువేం కాదు- శక్తి వంచన లేకుండ ప్లాస్టిక్ సంచులు, సీసాలు, వంటింటి వ్యర్థాలు, కొన్ని ప్రాత గుడ్డలు ఈ రహదారి మీదనో డ్రైనులోనో వేసి, స్వచ్ఛ కార్యకర్తలకు పని తగ్గకుండ చూస్తారు! స్వచ్చంద శ్రమ దాతలదేముంది గ్రామ పౌరుల, పంచాయతీ బాధ్యతలకు సిద్ధపడి పోతుంటారు.

            తక్కిన రోజుల కంటె ఈ వేకువ స్వచ్ఛ కార్యక్రమ సందడి కొంత పెరిగింది. మైకు పాటల సందడిని మించి, వనపర్తి వైద్యుల వితరణగా మనకు లభించిన ష్రెడ్డర్’ (అవలీలగా వ్యర్థాలను తునకలు కొట్టే యంత్రం) నుండి గట్టి శబ్దమే అందుకు కారణం! శ్రమదాతల శరీర కష్టంతో బాటు వీధి పారిశుద్ధ్యంలో కొంత యాంత్రీకరణ మన్న మాట!

            ఈ సామాజిక కర్తవ్య పరాయణుల కోసం నడకుదురు రహదారి నిరీక్షణ ఫలించి, 28 మంది ప్రయత్నం తో నేటి వేకువ పారిశుద్ధ్య కృషి ఎలా జరిగిందంటే :

            ముందుగా చెప్పవలసి అంశం కరెంటు సరఫరా శాఖ వారు నరికి కోసిపడేసిన- బాటకు దక్షిణాన పడి ఉన్న చింత, గానుగ వంటి చెట్ల కొమ్మల తొలగింపు, ‘ష్రెడ్డర్ నోటికి వాటినందించడమే! ఆ పని 10 మందికి సరిపోయింది!

- బాటకు భయ దిక్కుల మార్జిన్ల గడ్డిని, పనికి రాని మొక్కల్ని, ముళ్ల చెట్లను తొలగించే పని కత్తుల వారిది. వారికనుబంధంగా నలుగురు దంతెల వాళ్లు వ్యర్థాల్ని లాగి ప్రోగులు పెట్టడం.

- ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పురుషులు చీపుళ్లతో  రహదారిని క్షుణ్ణంగా ఊడ్చే పని.

- చెత్తా- చెదారాల్ని ట్రాక్టర్ లో లోడింగ్ చేసే పని కొంత తగ్గింది.

మొత్తమ్మీద ఇదొక సంఘటిత వీధి పారిశుద్ధ్య పరిశ్రమ ! ఆ బాటలో అటు ప్రయాణికుల- ఇటు స్థానికుల అనాలోచిత కశ్మలాల విరజిమ్ముడుకు కార్యకర్తల సమాధానమిది!

            స్వచ్చోద్యమానికి బాసటగా మనకోసం మనంమేనేజింగ్ ట్రస్టీకి 2000/- విరాళమిచ్చిన మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారు.

            ఒకింత జాప్యంగా నందేటి శ్రీనివాసుడిచ్చిన కాఫీ తదుపరి 6.30 కు సమీక్షా సమావేశంలో BSNL నరసింహుని స్వచ్చోద్యమ సారాంశ నినాదాల తరువాత గురవయ్య, శివబాబుల జీవిత సత్యాలవల్లె వేత అనంతరం- శ్రమదాన కృషికి DRK గారి ప్రశంస పిదప నేటి గ్రామ బాధ్యత ముగిసింది!

            మన రేపటి వేకువ వేళ పరస్పర కుశల ప్రశ్నల స్థానం ఇదే నడకుదురు బాటలోనే!

            చేస్తున్నాం ప్రణామాలు 172

ఒకరి కండగ ఒకరు నిలుచుచు లోపముంటే ఎత్తి చూపుచు

గ్రామమందలి మూల మూలల కశ్మలంపై చర్చ జరుపుచు

ఎక్కడే పని యెట్లు జరుపుటొ సమగ్రంగా నిర్ణయించుచు

విక్రమించిన స్వచ్ఛ సైనిక విజ్ఞులకు నా సత్ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   01.12.2022.

స్వచ్చోద్యమానికి బాసటగా ‘మనకోసం మనం’ మేనేజింగ్ ట్రస్టీకి 2000/- విరాళమిచ్చిన మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారు.