2610* వ రోజు ... ....           03-Dec-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

2610*వ నాటి 28 మంది గ్రామ బాధ్యుల కృషి!

          శనివారపు వేకువ, “4.30అనే నిర్ణీత క్షణాల కన్న ముందే 4.13 కే సంసిద్ధులైన 14 మంది పర్యావరణ హితుల్నీ, త్వరగా వచ్చి వారితో కలిసిపోయిన అంతే మంది ఊరి వీధి బాధ్యుల్ని తొలి నిముషాల ఛాయా చిత్రాల్లో గమనించండి! ఊరి కాలుష్యం మీద నేటి యుద్ధ రంగం ప్రొద్దుతిరుగుడుబడి తూర్పు, దక్షిణ వీధులు!

          ఈ ఉదయం కూడ తలొక 100 నిముషాల సార్థక శ్రమదానం, తన్మూలంగా స్వచ్ఛ- సుందరంగా మారిన సుమారు 150 గజాల వీధులు, సుదూర రాణ్మహేంద్రం నుండి వచ్చిన గౌరిశెట్టి అజయ్ అనే యువకుడు తప్ప మచ్చుకైనా ఒక్కరైనా పాల్గొనని స్థానికులు, రేపటి దాక ప్రతి కార్యకర్తకూ తగు పాళ్లలో దక్కిన ఆత్మ సంతృప్తీ.... ఇదీ స్థూలంగా 03.12.2022 వ నాటి గ్రామ పారిశుద్ధ్య ఘట్టం!

          ఈ ఉషోదయ గ్రామాభ్యుదయ శ్రమదానంలో 8 మందైతే ఒంటరి వారు కాక -సకుటుంబీకులు! (4 x 2) అందులో ఒక వైద్యుల కుటుంబమైతే విశాఖపట్నంలో పెళ్ళికి తొందరగా బయలుదేరవలసినా, విధిగా ఇందులో పాల్గొని, హడావిడిగా కాస్త ముందే వెళ్లింది.

          తీర్థమూ - స్వార్థమూ కలిసొచ్చినట్లుగా, నేటి రేపటి ఈ వీధి పారిశుద్ధ్య చర్యలు ఈ వారంలోనే జరగనున్న BSNL నరసింహుని కుమార్తె వివాహ సందర్భానికి సైతం అక్కరకు రావడం మరొక విశేషం !

          ఇంతకీ అందరివీ కలిపి 40 కి పైగా పని గంటల శ్రమ వేడుకతో ఊరికి ఏం ఒరిగిందని ఆరా తీస్తే :

1) BSNL వారి ఇంటి ఎదుటి వీధులు శుభ్ర సుందర- విశాలంగా మారడం. అందుకోసం కనీసం డజను మంది ఆ బాటపై మట్టినీ, తుక్కునీ, పుల్లల్నీ, పిచ్చి చెట్లనీ నరికి,గోకుడు పారల్తో గోకి, ప్రోగులు పెట్టి, ట్రాక్టర్ కెత్తి, ఎదుటి ఖాళీ ప్రదేశాన్ని కొంత చదును చేసి చివరికి దాని ప్రాత రూపాన్ని మార్చేయడం!

2) ఉత్తర దక్షిణాల దారి బారునా 10 మంది  కత్తులు – దంతెలు - గోకుడు పారలు గడ్డ పలుగులూ ఉపయోగించి ఎంత శ్రమిస్తే రెండు ప్రక్కలా గడ్డి తొలగి, వీధి విశాలమై, ఈ మాత్రం పొందికగా కనిపిస్తున్నది?

3) వాట్సప్ ఫోటోలు చూసి, ముగ్గురు మహిళలు చీపుళ్ళతో ఊడుస్తున్న పనిదేముందిలే, తేలికే కదా!అనుకోకండి! చూడడానికీ - చేయడానికీ అంతరాన్ని లెక్కించండి!

          మొత్తమ్మీద ఈ కాలనీలో రెండు వీధులు, డ్రైనులు, రెండు ఖాళీ స్థలాలూ నిన్నటి కన్న భిన్నంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తున్నవా లేదా? అందుకు కారణం తమ స్వార్థం కోసం కాక - కాలనీ వారందరి కోసం ఈ 28 మంది శ్రమదానం కాదా?

          రోజుటి కన్న 10 నిముషాల ముందే ముగిసిన నేటి శ్రమ సందడి 6.10 కి ముమ్మారు పల్నాటి భాస్కరుడు వీరోచితంగా గర్జించిన స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలతో మరికొంత ఉత్సాహభరితమయింది!

          గత మూడు రోజుల్లాగే ఈ ఉదయం కూడ మా జామ పళ్ళ పంపకం జరిగింది!

          రేపటి ఉదయం మనం కలిసి శ్రమించవలసిన చోటు కూడ ప్రొద్దు తిరుగుడుబడి ఎదుటనే!

          చేస్తున్నాం ప్రణామాలు 174

గతంలో గల కొంత మంచిని, కళ్ళు చెదరే త్యాగ స్ఫూర్తిని

భవిష్యత్ లో అవసరాలను ప్రతిదినం చర్చించుకొంటూ

వర్తమానపు స్వచ్ఛసంస్కృతి కై తపించిన శ్రద్ధ చూపిన

చల్లపల్లి స్వచ్ఛ సుందర సాహసికులకు నా ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   03.12.2022.