2611* వ రోజు ... ....           04-Dec-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

ఒక నిర్దిష్ట లక్ష్యం దిశగా  2611*వ నాటి సామూహిక శ్రమదానం!

 

          ఆదివారం (04.12.2022) వేకువ 4.19 – 6.10 నడుమ అట్టి శ్రమ వేడుక నిర్వహించిన వారు 29 మంది ; నిముషాల కాలంలో క్రమంగా చలికి మంచు తోడైనా వెనుదీయక – అదే ప్రొద్దు తిరుగుడు పూలబడి దక్షిణ, తూర్పు, ఉత్తర వీధుల్ని, ఖాళీ నివేశన స్థలాన్నీ – నిన్నటి కన్న మరింత బాగు చేసి, మెరుగులు దిద్ది ఆనందించడమే వారి ప్రత్యేకత!

 

          ఈ కాస్త మంది కార్యకర్తలు వేల దినాలుగా మురుగు గుంటల్నీ – వీధుల గలీజునీ – వల్లకాడుల్నీ, ఊరి చుట్టూ 7 రహదారుల్నీ శుభ్ర పరుస్తుంటే, సుందరీకరిస్తుంటే, పూదోటలు పెంచుతుంటే – గ్రామ సామాజిక బాధ్యత గుర్తుండని పౌరులు వెచ్చగా-సుఖంగా శయనిస్తుండటం చూస్తే ఏమనిపిస్తున్నది?

          నాకైతే – శ్రమదాన సమయంలో మైకు నుండి విన్న ఒక పాటే గుర్తొస్తున్నది – (రచన : అందేశ్రీ – పాట వ్రాసే కాలానికి నిరక్షరాస్యుడుట!)

 

“ మాయమై పోతున్న డమ్మా – మనిషన్న వాడూ

మచ్చుకైనా లేడు చూడు – మానవత్వం ఉన్నవాడూ

నిలువెత్తు స్వార్థమూ నీడలా వస్తుంటె – చెడిపోక ఏమౌతడమ్మా...”

 

          ఒక వంక సమయ – శ్రమ – ధన దాతలైన స్వచ్చ కార్యకర్తలు క్రమం తప్పక వీధినీ, చెట్లనూ, చెట్ల మోడుల్నీ, గోడల్నీ సుందరీకరిస్తుంటే మరో వంక మర్నాటికే చెత్తా చెదారాలు చేరుతుంటే – వీధి మార్జిన్లు ఆక్రమణలకు గురౌతుంటే – ఏమనుకోవాలి?

          ఏదో ... నేనిలా అతిగా ఆలోచిస్తున్నానుగాని, బాధ్యతలకు పూనుకొన్న కార్యకర్తలకు మాత్రం ఇలాంటి విచారం అంతగా ఉండదనుకొంటా, పనిలో దిగిన వెంటనే – అర్జునుడికి పక్షి కన్నొక్కటే కనిపించినట్లు – తమ ఎదుట రోడ్ల దుమ్మే, ప్లాస్టిక్ తదితర కాలుష్యాలే, అస్తవ్యస్తంగా ఉన్న గడ్డీ – పిచ్చి మొక్కలే వాళ్లకి కనిపిస్తాయి కాబోలు!

          నేటి శుభ్ర- సుందరీకరణకు నోచుకొన్న మూడు చోట్ల వివరాలు :

- BSNL – గౌరుశెట్టి- నరసింహా రావు ఇంటి ఎదుటి ఖాళీ స్తలాల్లో గుబుర్లుగా అల్లుకొన్న పూల తీగల్తో సహా – ఎండు తుక్కులూ, రాళ్లు రప్పలూ, ఎగుడు దిగుళ్లూ – అన్నిటికీ సమాధానం దొరికింది. వారింటి పెళ్ళికి అక్కడ భోజన – భాజనాల వంటివీ ఇప్పుడు జరుపుకోవచ్చు!

- పాఠశాల తూర్పు బాట 2 రోజుల క్రితం కన్న ఇప్పుడెంత శుభ్రంగా, విశాలంగా కనిపిస్తున్నది?

- అదే బడికి ఉత్తరపు వీధిని కూడ – అక్కడ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లున్నా సరే- జాగ్రత్తగా ఏడెనిమిది మంది బాగు చేశారు.

మరి – ఇది చల్లపల్లి అదృష్టమో లేక కార్యకర్తల అదృష్టమో గాని – 2611* రోజులైనా నడిచి పోతూనే ఉన్నది.

          6.25 కు కాఫీల సమయాన - జామ పళ్ల పంపకం జరిగిన పిదప – 7 వ తేదీన అర్థరాత్రి దాటాక తమ ఏకైక కుమార్తె దివ్య తేజ యొక్క వైవాహిక వేడుకకూ, అంతకన్న ముందు ఆత్మీయ విందుకూ గౌరుశెట్టి వారి ఆహ్వానం అందింది, తధాస్తు!

          నేటి గ్రామ స్వచ్చ- సౌందర్య సంకల్ప నినాదాలను పలికిన కంఠం అనుమోలు దుర్గా ప్రసాదు గారిది.

          బుధవారం నాటి వేకువ మన పాలిటి సుందరీకరణ ప్రదేశం – నడకుదురు దారిలో!  

        మన శ్రమదానోద్యమం

ఆశించిన అంచనాల కతిదవ్వున నిలువ లేదు

ఊరి జనుల మార్పు కొరకు, ఊరు మెరుగుపరచేందుకు

బ్రతిమాలీ – బామాలీ పదేపదే విసిగించీ

గ్రామస్తుల కదిలించే ఘన ప్రయత్నమాగలేదు

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   04.12.2022.