1923 * వ రోజు....           16-Feb-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1923* వ నాటి ఉత్సాహాలు.

ఈ రోజు వేకువ 4.05 నిముషాలు- 6.16 నిముషాలు నడుమ జరిగిన స్వచ్చ సుందర స్వగ్రామ ప్రయత్నంలో పాల్గొనిన మూడు ప్రాంతాలకు చెందిన వారు 52 మంది. వీరిలో 10 మంది ఉత్తర చిరువోలులంక గ్రామ స్వచ్చ కార్యకర్తలు . ముగ్గురు విజయవాడకు, దేవరకోట/ అమెరికా కు చెందిన వారు. స్వచ్చ – శుభ్ర-సుందరీకృత ప్రదేశం శివరామపురం మార్గంలోని మేకల డొంక వంతెన – ప్రభుత్వ సారా దుకాణముల మధ్య భాగం.

 

నిన్నటి మన శ్రమదానం తరువాయిగా ఉభయ గ్రామాల కార్యకర్తల చే నిర్వహింపబడిన ఈ రహదారి సుందరీకరణ కృషి దట్టమైన మంచులోనే పలుచటి వెన్నెల ఉన్నప్పటికీ కొంత వరకు చీకటిలోనే జరగడం గమనార్హం.  ఈనాటి రెండు గ్రామాల (చిరువోల్లంక, చల్లపల్లి ) కార్యకర్తలు పరస్పర సమన్వయంతో,  స్ఫూర్తితో, సహకారంతో ఈ దారికి రెండు వైపులా వందలాది ప్లాస్టిక్ సీసాల ( మద్యపాన అవశేషాల ) ను ఏరి అక్కడక్కడ ప్లాస్టిక్ సంచులను, ఖాళీ టిఫిన్ పొట్లాలను, కార్యకర్తలు నాటి పెంచిన చెట్ల ఆకులను ఏరి, ఊడ్చి, పోగులు చేసి ట్రాక్టర్ లోనికి నింపి మూడు కిలో మీటర్ల దూరంలోని డంపింగ్ కేంద్రానికి తరలించారు. 

 

కొందరు చల్లపల్లి కార్యకర్తలు గతంలో తాము నాటిన చెట్ల, పూల మొక్కల పాదులను సరి చేసి అనవసరంగా పెరుగుతున్న కొమ్మలను కత్తిరించి తమ సుందరీకరణ ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు.

 

విజయవాడ నుండి వచ్చిన ఇద్దరు ముగ్గురు స్వచ్చంద శ్రమదాతలు, అమెరికా నుండి వచ్చిన డాక్టర్ దోనేపూడి శరత్ గారు ఈ 50 మంది కార్యకర్తల కృషిని, నిస్వార్ధ శ్రమ దీక్షను చూసి ఆశ్చర్యపడి, ఆనందంతో తన్మయులయ్యారు. వీరందరూ 6.35 నిముషాలకు కాఫీ, టీ మర్యాదలు ముగించుకొని  న్యూట్రీ ఫీడ్స్ ఆవరణం ముంగిట నేటి శ్రమదాన సమీక్షా సమావేశంలో పాల్గొని,  స్వచ్చోద్యమ నిరంతర సహకారి గుత్తికొండ కోటేశ్వర రావు గారు ముమ్మారు గట్టిగా ప్రకటించిన గ్రామ స్వచ్చ-శుభ్ర – సుందర సంకల్ప నినాదాలను గొంతెత్తి ప్రకటించి, అవి కార్యకర్తలందరి ఉద్వేగభరిత కంఠాలలో  ప్రతిధ్వనించి 7.05 నిముషాలకు నేటి మన స్వగ్రామ బాధ్యత ముగిసింది.  ఈ సమీక్షా సమావేశంలో :

- స్వచ్చ చిరువోలులంక ముఖ్య కార్యకర్త ప్రసంగం

- మనకోసం మనం ట్రస్టుకు  పదే పదే ఆర్థిక సహకార ప్రదాత డాక్టర్ దోనేపూడి శరత్ గారి 1923 రోజుల సుదీర్ఘ స్వచ్చోద్యమ చల్లపల్లి ప్రస్థానం అనితర సాధ్యమని, చల్లపల్లి ప్రజలకే కాక రాష్ట్ర – దేశ ఆలోచనా పరులందరికీ చైతన్య ప్రదాయకమని, భవిష్యత్తులో కూడా ఈ స్వచ్చోద్యమం కొనసాగాలని, ఎప్పటికీ తాను ఈ కార్యక్రమానికి తోచినంత, చేతనైనంత సహాయం చేస్తూనే ఉంటానని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

- చల్లపల్లి స్వచ్చోద్యమ సంచాలకులు డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాదు గారి వదనంలో  ఈ రోజు మరికొంత అదనపు ఆనందం కనిపించింది.

- దివంగత మన స్వచ్చోద్యమ ప్రముఖ కార్యకర్త, ట్రస్టు ఉద్యోగి పరుచూరి రాధాకృష్ణ గారి చల్లపల్లి గ్రామ సేవా నిరతిని గుర్తు చేసి,  రేపటి అతని అంతిమ సంస్కార కార్యక్రమానికి (11.00 లకు)  కార్యకర్తలందరినీ రమ్మని అభ్యర్దించారు.

రేపటి మన గ్రామ స్వచ్చ సుందరీకరణ కృషిని బందరు మార్గంలోని 6 వ నంబరు కాలువ వంతెన దగ్గర నుండి కొనసాగిద్దాం.

       బోధ పరిచిందా!

త్యాగమును తల దాల్చుటెందుకొ- స్వార్ధమును విడనాడుటెందుకొ-

వట్టి మాటలు కాక ఊరికి- గట్టి మేల్ తల పెట్టు టెందుకొ-

ఉన్న ఊరి కయాచితంగా వేల దిన శ్రమదాన మెందుకొ

స్వచ్చ సైన్యం నిజంగానే చల్లపల్లికి బోధ పరిచిందా!

 నల్లూరి రామారావు  

 స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

ఆదివారం – 16/02/2020

చల్లపల్లి.