2613* వ రోజు... ....           06-Dec-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

పాగోలు రహదారి పనులు ముగించిన కార్యకర్తల చతుష్టయం - @2613*

            మంగళవారం (06.12.2022) వేకువ కూడ చల్లపల్లి పరిసరాల్లో మంచు దంచుతూనే ఉంది. స్వఛ్ఛ సైనిక చతుష్టయం 4.27 కి పాగోలు బాట మీదికి చేరినప్పటి నుండి క్రమంగా ఆ దంచుడు పెరిగినా - వారి పనులేవీ కుంటుబడ లేదు!

            ఆరేడుగురి బలగంగా ఉండే ఈ ప్రత్యేక కార్యకర్తల దళం నేడు 4 కు పరిమితమయింది. ఒకరింట పెళ్లికార్యమూ, ఒక శంకరశాస్త్రి గారి రాష్ట్రాంతర నివాసమూ వంటి కారణాలు! ఐతే పాగోలు బాటలోని తమ కర్తవ్యాన్ని ఈ మంచి చతుష్టయమే నిన్నా - నేడూ చక్కబెట్టింది.

            మాన్యంబు లిచ్చెడి మాన్యుడెవ్వడు లేడు          

                        మాన్యముల్ లాగు దుర్మతులు తప్ప....

అని తనకు దానాలివ్వని రాజును ఒక ప్రాచీన కవి పరోక్షంగా నిందించాడట! ఇప్పుడైతే చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలు నేటి పరిస్థితికి తగ్గట్లు

            రహదార్లు చెడగొట్టు మహానీయులున్నారు

                        పరిశుభ్రపరచెడు ప్రజలు లేరు....

అనుకోవలసి వస్తున్నది!

            ఇటు స్వచ్ఛ - సుందర కార్యకర్తలూ, అటు వీధుల్ని కశ్మల భూయిష్టం కావించే కొందరు బాధ్యతా రహితులూ ఏరోజుకారోజు తమ డ్యూటీలు చేసుకుపోతూనే ఉన్నారనుకోండి! పైగా స్వచ్ఛ సైనికుల సుందరీకరణ కృషి గాని, రహదార్ల కశ్మల కారకులైన కొందరి అనాలోచిత పనులు గాని - ఈ చల్లపల్లికే పరిమితం కాలేదు! కాల పరిమితి కూడ ఇక్కడ కనపడడం లేదు!

            6.25 ప్రాంతంలో నేటి తమ శ్రమదాన సంకేతం గానూ, స్వచ్ఛోద్యమ స్ఫూర్తి గానూ తూములూరి లక్ష్మణరావు నామధేయ స్వచ్ఛ కార్మికుడు ముమ్మారు పలికిన నినాదాలతో నేటి వీధి పారిశుద్ధ్య కృషి ముగిసింది!

           రేపటి విస్తృత కార్యకర్తల కలయిక, సంఘటిత శ్రమదానమూ నడకుదురు మార్గమధ్యంలోనే ఉండగలదు!

            మన శ్రమదానోద్యమం:

ఊరిజనుల మార్పు కొరకు, ఊరు మెరుగు పరచేందుకు

బ్రతిమాలీ - బామాలీ పదేపదే విసిగించీ

గ్రామస్తుల కదిలించే ఘన ప్రయత్నమాగలేదు

ఆశించిన అంచనాల కతి దవ్వున నిలువలేదు!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   06.12.2022.