2619* వ రోజు.....           13-Dec-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

విజయవాడ రోడ్డుకు మారిన 2619* వ నాటి శ్రమదానం!

            ఎప్పటిలాగే 4.25 కే 4+1 కార్యకర్తలు 6 వ నంబరు పంట కాలువ దగ్గర నుండి ఉత్తరం దిక్కుగా, ఊరి బాధ్యతను కొనసాగించారు. ఆ రోడ్డు కు రెండు ప్రక్కల ఉన్నది విద్యుత్ శాఖ వారి చర్యలతో కొంత భీభత్సంగా మారిన చోటు.

            పెద్ద పెద్ద చెట్లే సమూలంగా తెగి డ్రైన్ల నిండా పడి ఉంటే, అది ఏ నలుగురైదుగురు కార్యకర్తలో శుభ్రపరచదగింది మాత్రం కాదు. ఇటు ప్రక్క వార్డు నుండైనా ఇంటికొక్కళ్లైనా వచ్చి మోయదగిన బాధ్యత.  కానీ- ఏరి, ఎక్కడ? వీళ్ళేమో కేవలం నలుగురు + ఒక అతిథి కార్యకర్త. మరి ఇప్పుడు ఊహించండి ఈ విజయవాడ రోడ్డు ఒక్కటే ఎన్నాళ్ల కు మళ్ళీ స్వచ్చ సుందరం కావాలో!

            సరే ఏంచేస్తాం ఎనిమిది తొమ్మిదేళ్ల స్వచ్చ సుందరోద్యమం తరువాత కూడా మన చల్లపల్లి పరిస్థితి ఇది! ఉన్న ఈ నలుగురైదుగురు కార్యకర్తలు మాత్రం ఏ కొంచెమో దిగులు చెందలేదు, తమ ప్రయత్నం ఆపలేదు. తమకు చేతనైనంత వరకు తమ కత్తులతో, రంపాలతో కూల్చబడిన చెట్ల కొమ్మలను కోసి వాటిని అవసరమైన వారికి వంట చెరకుగా ఇచ్చి వేశారు.

            రేపటి మన వీధి పారిశుద్ధ్యం కోసం మరొక మారు విస్తృత కార్యకర్తలం నడకుదురు బాటలోని మెహర్ వడ్లమర దగ్గర కలుసుకొందాం.

          సుగతికి శ్రీరామ రక్ష!  

ప్రతి ఉదయం శ్రమ వేడుక ప్రతి డ్రైనుకు పరిశీలన

ప్రతి వీధికి పరామర్శ రహదారుల అనుశీలన

అన్ని పనులకూ సమీక్ష ఆత్మ విమర్శా దిదృక్ష

స్వచ్చోద్యమ చల్లపల్లి సుగతికి శ్రీరామ రక్ష!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   13.12.2022.