2621* వ రోజు.......           15-Dec-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

అదే రోడ్డులో ఆ 21 మందితోనే పారిశుద్ధ్య కృషి - @2621*.

            అదే రోడ్డు అంటే 3 వారాలుగా శుభ్రపరుస్తున్న ఒక కిలో మీటరు నడకుదురు మార్గమే. ఎంతమంది ప్రయత్నించినా కశ్మలాలు కరగని పాగోలు పంచాయితీకి చెందిన ఒక కాలనీ పరిసరాలే. పశువుల, మనుషుల, పేడ దిబ్బల రహదారి దక్షిణ భాగమే.

            ఎంత పోరాడితే స్వచ్చ కార్యకర్తలు ఏరోజుకారోజు 50 గజాలకు మించి సుందరీకరించడం సాధ్యపడడం లేదంటే ఎవరైనా ఊహించవచ్చు. ఇక్కడి గృహస్థుల చైతన్యం ఏపాటిదో! మీకు అనుమానం వస్తే ప్లాస్టిక్ - చెత్త చెదారాల ప్రోగుల మీద ఒక గృహిణి దంతెతో ఎలా శ్రమిస్తున్నదో గమనించండి. రోడ్డు ప్రక్క ఎవరో నరికి పడేసిన చెట్ల కొమ్మలను చీకటి మంచు సమయంలోనే ఏడెనిమిది మంది కత్తులతో నరికి అక్కడి అస్థవ్యస్థతను ఎలా దారిలోకి తెస్తున్నారో గ్రహించండి.

 

            మిగిలిన కత్తుల వారు, దంతెదారులు రోడ్డుకు రెండు ప్రక్కల దుమ్ము ముక్కుల్లోకి వెళ్తున్నా లెక్క చేయక చలిని ధిక్కరిస్తూ రెండు గంటల పాటు ఎంతగా శ్రమిస్తున్నారో కశ్మల కారకులైన గృహస్థులైనా ఆలోచించారా అని! 

            ఈ నడకుదురు బాట సుందరీకరణ కృషికి సమాంతరంగా బెజవాడ రహదారి ప్రక్క గత వారం కొందరు ఆవేశపరుల చేత సమూలంగా నరకబడ్డ చెట్ల కొమ్మలను తొలగిస్తూ మరికొందరు శ్రమిస్తున్నారు. వీళ్ళ కృషికి తరువాయిగా 7 గంటల సమయం తరువాత ట్రస్టు కార్మికుల కొనసాగింపు ఉండనే ఉంటుంది.

            మనం చరిత్రను చదువుకున్నాం కదా! ఎవరెవరి పాపాలనో శిలువ రూపంలో ఏసుక్రీస్తు మోయడం, తన చెంప మీద కొట్టినా, తుపాకీతో కాల్చినా వాళ్ళను కూడా క్షమించిన గాంధీని చదువుకోలేదా? ఈ స్వచ్చ కార్యకర్తల తపస్సు కూడా అలాంటిదే అని నాకనిపిస్తున్నది.

            6.30 సమయం దాటినప్పటికీ మంచు తెరలు తొలగని మెహర్ వడ్లమర ప్రాంగణంలోనే  జరిగిన సమీక్షా సభలో పోస్టల్ ఉద్యోగి మెండు శ్రీనివాస్ విస్పష్టంగా ముమ్మారు ప్రకటించిన స్వచ్చ సుందరోద్యమ నినాదాలు అచ్చటి స్థానుకులనేమాత్రం కదిలించాయో నాకు తెలియదు.

            రేపటి మన వీధి సుందరీకరణం కూడా వడ్లమర దగ్గర నుండే మొదలుపెడదాం.    

            అంది వచ్చిన మహాదృష్టం!   

సొంత బాధ్యత లేక కాదు కుటుంబ భారం వదలి కాదు - ప

రోపకారమె వృత్తి కాదు – “సమాజ బాధ్యత కూడ కలదను

చింతయే మన స్వచ్ఛ సుందర కార్యకర్తల జవం సత్త్వం   

అదే ఈ చల్లపల్లికి అంది వచ్చిన మహాదృష్టం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   15.12.2022.