1924 * వ రోజు....           17-Feb-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1924* వ నాటి శ్రమదాన సందేశం.

ఈ నాటి వేకువన కూడ యధావిధిగా 4.05-6.15 నిముషాల నడుమ 28 మంది స్వచ్చోద్యమ కారుల శుభ్ర-సుందరీకరణ కృషి చల్లపల్లికి దక్కింది. వీరి శ్రమకు, చెమట చుక్కలకు నోచుకొన్న ప్రదేశం బందరు మార్గంలోని 6 వ నంబరు పంట కాలువ వంతెన- అమరావతి రాజు గారి భవన మధ్యస్థ ప్రాంతం.

 

సువిశాలంగా ఉన్న ఈ 200 గజాల నిడివి దారిలోని ఆరంగుళంమందపు ఇసుక-దుమ్ము వ్యర్ధాలను చీపుళ్లతో ఊడ్చి- అక్కడక్కడ నిరర్ధక పిచ్చి మొక్కల్ని తొలగించడానికి కార్యకర్తల భుజాలు ఒక దశలో నొప్పి పెట్టినవి. దారి కిరుప్రక్కల కిరాణా, పూల మొక్కల, కొబ్బరి బొండాల, ఇంకా ఇతర దుకాణాల వ్యర్ధాల విరజిమ్ముడుకు- ఈ కార్యకర్తల 48 గంటల (24 మంది x 2గంటలు) నిస్వార్ధ శ్రమ దానమే పరిష్కారం మరి! 1924 రోజులుగా ఈ ఉభయుల్లో ఎవరి పని వాళ్లదే!

 

నిన్నటి సాయంత్రపు ఒక పెద్ద విశేషం ఇక్కడ ముచ్చటించుకోవాలి: నియోజక వర్గంలోని ఐదారు మండలాల స్వచ్చ కార్యకర్తలు చల్లపల్లి లోని పద్మావతి ఆసుపత్రి దగ్గర సమావేశమై “ ఒక్క మారు ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువుల నిరోధాన్ని” గూర్చి చర్చోప చర్యలు నిర్వహించడమే సదరు విశేషం! సుమారు 66 మంది ఆరు స్వచ్చోద్యమ కేంద్రాల నుండి వచ్చి-ప్లాస్టిక్ వాడక నిర్వీర్యతలో తమ కెదురౌతున్న సాధక బాధకాలను, పరిష్కార మార్గాలను గంటన్నరకు పైగా సమయంలో, గాంధీ గిరి బాటలో ప్రయత్నించాలన్నదే ఈ సమావేశ సారాంశం.

 

నేటి శ్రమదాన వేడుక ముగిసిన పిదప జరిగిన సమీక్షా సమావేశ వివరాలు:

- మన నిశ్శబ్ద స్వచ్చ శ్రామికుడు ఆత్మ ప్రరబ్రహ్మం చక్కని లయ బద్ధంగా ముమ్మారు ప్రకటించిన గ్రామ స్వచ్చ-శుభ్ర-సుందర సంకల్ప నినాదాలు- వాటికి కార్యకర్తల స్పందన.

 

తన మనుమడు వేద సాయి సంకల్ప్’(10 వ తేదీ) జన్మదిన సందర్భంగా పరబ్రహ్మం గారు “మనకోసం మనం” ట్రస్టుకు ఇచ్చిన 1000/- విరాళం.

 

- మండవ శేషగిరి రావు గారు (వక్కలగడ్డకు చెందిన అమెరికా ప్రవాసి) గత కొన్నేళ్లుగా ఈ ప్రాంత విద్యార్ధులలో గుణాత్మక మార్పు కోసం శ్రమిస్తున్నది, వ్యయిస్తున్నది చాలక “ మనకోసం మనం” ట్రస్టుకు 1000/- విరాళం. ఈ ఆదర్శ దాతలిద్దరికీ మన ధన్యవాదాలు, అభినందనలు.  

 

ఈ మధ్యాహ్నం 12.00 – 1.00 ల మధ్య పరుచూరి రాధాకృష్ణ గారి పెద్ద కర్మ నిర్వహణకు కార్యకర్తలందరం హాజరవుదాం.

 

రేపటి మన శ్రమదాన వేదిక ఈ బందరు రహదారి లోని అమరావతి రాజు గారి భవనం దగ్గరి నుండి పడమటి దిశగా!

 

      1900 దిన స్వచ్చ శ్రమ

స్వచ్చోద్యమ చల్లపల్లి కథాక్రమం బెట్టిదనిన...

సామాజిక ఋణం తొలగు తాత్వికతే ప్రేరణగా-

గ్రామ స్వచ్చ-స్వస్తతలను కలగంటూ-నిజంచేయ

పందొమ్మిది వందల దిన పర్యంతం శ్రమించడం!

 

 నల్లూరి రామారావు  

 స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

సోమవారం – 17/02/2020

చల్లపల్లి.