2622* వ రోజు.......           16-Dec-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

స్వచ్ఛ సుందరోద్యమ ధారావాహికలో 2622* వ ఎపిసోడ్ !

            శుక్రవారం నాటి (16-12-22) సదరు శ్రమదాన ఘట్టం నడకుదురు బాటలోనే; నిన్నటిలాగే 21 మందే గాని, పని వేళ మాత్రం కాస్త ముందుకూ - ఇంకాస్త వెనుకకూ జరిగి (4.15 to 6.15) - తొలినాళ్లలో అనుకొన్న గంట కాక - తలా 2 గంటలకు విస్తరించింది.

            మెహెర్ వడ్లమర దగ్గర రహదారి కటూ ఇటూగా - బురద మురుగు నీళ్లున్న చోట - క్రింద తడీ పొడీ మట్టీ, పైన తగు మాత్రం హిమపాతం ఉన్న 50 - 60 గజాల దారి పరిశుభ్ర - సుందరీకరణం కోసం ఈ కార్యకర్తలు శ్రమించడం చూస్తుంటే, అపూర్వమైన ఈ మొండి పట్టుదలను గమనిస్తే, పరుల కొరకు జరుగుతున్న ఒక అనితర సాధ్యమైన శ్రమజీవన సౌందర్య సన్నివేశం పరిశీలిస్తుంటే, చూడడం తప్ప దాని విశిష్టతను వ్యక్తీకరించడానికి సరైన మాటలు దొరకడం లేదు!

            తొలి ఏళ్ళలో విస్తృతం గానూ, ఇప్పటికీ సకృత్తుగాను చల్లపల్లి సహృదయులను కొనే మాటలు –“ఆఁ! వీళ్ల భ్రమ కానీ పాతిక వేల మంది అనాలోచితంగా వేసే వీధి కశ్మలాల మీద - ఈ 30-40-50 మంది సాగించే పోరాటం ఎన్నాళ్లు నిలిచేను? ఎప్పటికి గెలిచేను...అని! మరి అలాగని స్వచ్ఛ కార్యకర్తలు అత్యంత సమంజసమైన తమ శ్రమదానోద్యమాన్ని వదులుకోవాలా.. లేక గ్రామస్తులే ఒక్కరొక్కరుగా వచ్చి వాళ్లతో చేతులు కలపాలా? శ్రీశ్రీ కవి ప్రశ్నించినట్లు

ఓ మహత్మా! ఓ మహర్షీ! ఏది ధర్మం? ఏదధర్మం?

ఏది సత్యం? ఏదసత్యం? ఏది పూజ్యం? ఏదిత్యాజ్యం?.......”

చల్లపల్లి స్వచ్చ - సుందరోద్యమం ఏరోజుకారోజే ఒక నిత్య నూతనమూ, ఒకానొక సృజనశీలమూ, సాహసాత్మకమూ కనుక ఏ నాటి విశేషాలు ఆ నాడు ఉండనే ఉంటాయి:

- ఇంత చలీ - మంచులో, చీకటి వేకువలో ఇందరు సమష్టిగా క్రమం తప్పక తమ ఊరి బాగు కోసం తపించడమే ఒక విశేషం!

- ఎన్ని సొంత పనుల్నో ప్రక్కన పెట్టి 2 - 3 కిలోమీటర్ల దూరం వచ్చి ఇన్ని వర్గాల, ఉభయ లింగాల సామాజిక బాధ్యులు యధాశక్తి శ్రమించడం మాత్రం విశేషం కాదా?

- ఒక ఎడం చేతి వాటం రైతు చేతికి కట్టూ, వంటికి నెత్తుటి మరకలూ గురించి వాకబు చేస్తే  - పిచ్చి చెట్ల నరుకుడులో పొరపాటున చేయి తెగినట్లు తెలిసింది! (ఐనా సరే అతడు తాన పని విరమించలేదనుకోండి)

- ఈ రాత్రంతా సుదూర ప్రయాణం చేసిన ఒక పెద్దమనిషి 5 రోజుల తర్వాత హడావిడిగా వచ్చి, కార్యకర్తలతో కలవడం కూడ విశేషమేనా?

            6.30 తర్వాతైనా - మంచు తగ్గని, సూర్యుడు కనిపించని వేళ వడ్లమర ద్వారం దగ్గర జరిగిన దైనందిన కృషి సమీక్షా సమావేశంలో గురవయ్య గురువరేణ్యుడి గారి గ్రామ స్వఛ్ఛ శుభ్ర సౌందర్య సంపాదక నినాదాలూ, రెండు మూడు ప్రయోజనకర నీతి వాక్యాలూ విన్నాం!

రేపటి వేకువ కూడ మన ఉమ్మడి శుభ్ర - సుందరీకరణ ప్రయత్నం కోసం ఇదే వడ్లమర దగ్గరే కలుసుకొందాం!      

            సులభమేది - ప్రశస్తమేది?

పరులకు హిత బోధఅనెడి పని ఎంతగ సులభమో

ఆచరించి చూపుటన్న - అదెంతగా కష్టమో

తనకు గాక ఇతరులకై తపన చెందు మార్గంలో

పయనించుట - గెలుచుటెంత ప్రశస్తమైన జీవనమో!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   16.12.2022.