2623* వ రోజు.......           17-Dec-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

24x2 గంటల వీధి పారిశుధ్యం - @2623*

          శనివారం వేకువ  - 4.17 నుండి 6.15 వరకు 24 మంది స్వచ్ఛ కార్యకర్తల శ్రమానందం! 45 కు పైగా పని గంటల పాటు - నడకుదురు మార్గంలోనే - వడ్లమరకు కాస్త దూరంగా – ఇనుప కొలిమి కర్మశాలల ఎదురుగా – నేత్ర పర్వంగా – చలీ, మంచుల పట్ల ధిక్కారంగా సాగిన గ్రామ సామాజిక బాధ్యతా నిర్వహణం!

          అసలింత దట్టమైన హిమపాతాన్ని, చీకటి వేకువలో రహదారికి దక్షిణాన ఉన్న – తామీ ఉదయాన తొలగించాలనుకొన్న కశ్మలాల గుట్టల్నీ, మట్టి దిబ్బల్నీ చూసి ఎవరైనా బెదరిపోతారు. ఐతే - ఇక్కడున్నది కర్తవ్య పాలనలో రాటు తేలిన చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తలు! వీధి సుందరీకరణలో వాళ్లకున్న 9 ఏళ్ల అనుభవాలు!

          3 కిలోమీటర్ల దూరం ఒంటరిగా వచ్చి, రోడ్డు ప్రక్క పల్లాన్ని మట్టితో పూడుస్తున్న ఒక మధ్యతరగతి - నడి వయస్సు గృహిణిని “ఈ మంచులో - చీకట్లో వచ్చి శ్రమించడ మెందుకు” అని ప్రశ్నిస్తే – “ఇంట్లో ముసుగుతన్ని పడుకొంటే చలి గాని – ఇందరు సహ కార్యకర్తలతో కలిసి, ఊరికి పనికొచ్చే ఈ కాస్త పని చేస్తుంటే ఇంకా చలేమిటి సార్!” అని బదులిచ్చింది! అదీ - ఈ ఊరి స్వచ్చ కుటుంబీకుల స్ఫూర్తి అంటే!

          72 ఏళ్లు దాటిన ఇంకొకాయన నిన్న కత్తివేటు తగిలిన చేతికి కట్టు బిగించుకొని, కాలుజారుతున్న మిట్ట - పల్లంలో పనిచేయడానికి కారణం - అలవాటైన వీధి సుందరీకరణ శ్రమదానం మానేస్తే ఇంటి దగ్గర తోచక - అశాంతిగా అనిపించడమట! అదే వయసున్న ఒక పంచాయితి (విశ్రాంత) చిరుద్యోగి పాగోలు నుండి సైకిల్ మీద వచ్చి, శ్రమించగలిగినంత శ్రమించి, అందరికీ తన పెరటి నిమ్మ పళ్లు పంచి, సంతృప్తి చెందారు!

          “తీసుకోవడం తప్ప సమాజానికి తిరిగి చెల్లించే ఉద్దేశమే లేని ప్రస్తుత సమాజానికి” ఇవన్నీ ఆచరణాత్మక పాఠాలే! ప్రతిఫల మాసించని విధ్యుక్త కర్మాచరణలే! కాకపోతే - దురదృష్టవశాత్తూ - వందల మందితో జరగాల్సిన శ్రమదాన వేడుక పాతిక – ముప్పై మందికే పరిమితమైపోయింది!

          పడిపోయిన చెట్లను నిలబెట్టి, ఊత కర్రలు కట్టి, కొన్నిటి పాదులు తీర్చిదిద్ది, చెత్తాచెదారాలను ఊడ్చి ఖాళీ సారా - నీళ్ల ప్లాస్టిక్ సీసాలను ఏరి, కొన్ని చెట్లను సుందరీకరించి, ఈ పనులన్నీ వచ్చే - పోయే వాహన రద్దీల నడుమనే జరిగడాన్ని ప్రత్యేకంగా వివరించేదేముంది?

          6.30 వేళ - డాక్టర్ DRK గారి గైరు హాజరీలో జరిగిన సమీక్షా సమావేశంలో - పద్మావతి వైద్యశాలకు చెందిన ల్యాబ్ నిపుణుడు బత్తుల రవి ముమ్మార్లు గ్రామ స్వచ్చ సౌందర్య సంకల్పాన్ని ప్రతిపాదించగా అందరూ ఆమోదించి, 6.45 కు ఇంటి దారి పట్టారు.   

          రేపటి వేకువ సైతం మన శ్రమ బాధ్యత ఇదే నడకుదురు బాటలో - ఇది వడ్లమర దగ్గర్నుండే పూర్తి చేద్దాం!

స్వచ్చ కార్యకర్తలకు సూచనలు :

1. గత ఆదివారం జరగవలసిన విజయ్ నగర్ భూగర్భ మురుగు వ్యవస్థ లాంఛన ప్రారంభమూ, అల్పాహార విందూ, సామూహిక ఛాయా చిత్రమూ రేపు అనగా 18.12.2022 ఉదయం 6.30 - 7.00 మధ్య గ్రామ ఉపసర్పంచ్ ముమ్మనేని నాని తదితర పెద్దల ఆధ్వర్యంలో జరుగనున్నది.  

2. స్వచ్చ కార్యకర్తల పట్ల గౌరవాభిమానాలతో పామర్తి వేంకటేశ్వరరావు గారు ఆహ్వానించిన పెండ్లి వేడుకకు రేపు సాయంత్రం కార్యకర్తలంతా హాజరు కావలసి ఉన్నది.

          ఈ స్వచ్చ - సుందరోద్యమం.

‘సామాజిక వీధి’ ప్రక్రియ జరిగే సక్సెస్ మంత్రం

స్వార్థం వాసన సోకని స్వప్నాలకు ఋజుమార్గం

శ్రమజీవన సౌందర్యం సాధించే ప్రయత్నం

సదాలోచనా పరులకు సత్వర ఆచరణీయం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   17.12.2022.