2624* వ రోజు.......           18-Dec-2022

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల్ని వాడడం దేనికి?

                2624*వ శుభోదయాన గ్రామ స్వచ్ఛ సుందరోద్యమ జమిలి శుభవార్తలు!

        ఈ ఆదివారం (18.12.2022) బ్రహ్మ ముహూర్తాన నడకుదురు రహదారిలోనిది తొలి విశేషంగా కాగా విజయ నగర్ కు చెందిన ౩ వీధుల చైతన్యవంతులది 7.00 వేళ మలి శుభ వార్త! ఇవి కాక-విజయవాడ కానూరు వైద్యుడూ సామాజిక కర్తవ్య నిష్టా గరిష్టుడూ సరిగ్గా  చెప్పాలంటే గ్రామీణ పేద రోగుల సేవల్లో ఉగ్రవాదీ ఐన గోపాళం శివన్నారాయణ గురించిన నేటి ఈనాడుపత్రికలో వచ్చిన వివరణ మరో ముఖ్య వార్త!

        సమకాలిక సమాజాన్ని దగ్గరగా పరిశీలించే వాళ్లకు రెండు వైవిధ్యాలు, వైరుధ్యాలూ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి :

1)క్షణ క్షణానికీ పతనమౌతున్న మానవతా విలువలూ, చిక్కబడి, కరడు కట్టుకుపోతున్న సగటు మనుషుల్ని వెంటాడుతున్న నిలువెత్తు స్వార్థమూ చైతన్య రాహిత్యమూ .... ఒక వైపు! 

2) నదుల నడుమ లంకల్లా అక్కడక్కడా కొందరి వృత్తి విలువల నిబద్ధతా, ఏటికెదురీదుతున్న నైతిక జీవనం నడకలూ, చల్లపల్లి లో లాగా ఒక సామాజిక ప్రయోజక సాముహిక శ్రమదానాల ఒయాసిస్సులూ!

        ఇందులో మొదటి సామాజిక విలువల విధ్వంస రచన పైకి మూకుమ్మడిగా బలంగా కన్పించినా, లోతుగా చూస్తే పిరికిదీ డొల్లదీ ! రెండోది అల్ప సంఖ్యాకమే ఐనా మౌలిక తాత్త్వికత బలంతో, ధైర్యంగా ఉండేదీ!

        27 మంది స్వచ్ఛ కార్యకర్తల తలా గంటా 50 నిముషాల వీధి శుభ్ర సుందరీకరణం ఈ వేకువ సాధించింది మరొక 40-50 గజాల క్రమబద్దీకరణమే! ప్రతి అంగుళాన్నీ పట్టి పట్టి శుభ్రపరచి అందగించి ప్రతి పూల మొక్కనూ పరామర్శించి, చెట్లను అదుపులో ఉంచి, మట్టి దిబ్బల్ని పెళ్లగించి, రహదారి మార్జిన్ల గుంటల్ని పూడ్చే పనులు తొందరగా ఎలా జరుగుతాయి?

        పైగా ఇదేమన్నా ఒకనాటి - ఒక ఏటి కార్యక్రమమా? ఎడతెగని దశాబ్దాల కొద్దీ సాగే స్వచ్ఛ సుందరోద్యమ మాయె! ప్రతి వేకువా ఒక శ్రమదాన వేడుకే ఐనప్పుడు – ‘ఈ వీధిని ఒక వారంలోనే బాగుచేయాలనే నిబంధనా, ఆతృతా ఎందుకు!

        ఒకప్పుడు గాంధీ మహాత్ముడి బ్రతుకును గురించి ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నాడట –“ఇలాంటి సర్వోత్తమ మానవుడొకాయన ఈ భూగోళం పైన రక్తమాంసాలతో సజీవంగా తిరిగాడంటే - భవిష్యత్తు తరాల వాళ్లు నమ్మనే నమ్మరుఅని! గోపాళం శివన్నారాయణ 49 వైద్య శిబిరాలు దశాబ్దాల తరబడి నడిపాడంటేనో - స్వచ్ఛ కార్యకర్తలు ఇన్ని వేల రోజులు తమ ఊరికి సేవలందించారంటేనో - భవిష్యత్తరాల దాకా ఎందుకు? ప్రత్యక్షంగా చూడకపోతే ఈ తరం వాళ్లే నమ్మరు!

        6.40 -7.10 నడుమ విజయనగర్ లో - ముమ్మనేని రాజశేఖరుని ఇంటి వద్ద జరిగిన 3 వీధుల భూగర్భ మురుగు వ్యవస్థా సమీక్ష, దాని ఆదాయ వ్యయాలూ, సాధక బాధకాలూ, ప్రయోజనాలూ, ఆ పిమ్మట సుష్టయిన విందూ ముగిసే కార్యకర్తలు ఇంటికి చేరింది!

        ఈ సమా వేశంలో పాల్గొన్న 70 మందిలో మిగిలిన వీధుల వారెవరైనా ఇలా భూ-అంతర్గత మురుగు పారుదలకు పూనుకొంటేనే - ఈ సభ, ఈ ఉపన్యాసాలూ సార్థకమయ్యేది!

        స్వచ్ఛ కార్యకర్తలంతా మంగళవారం వేకువ జరిగే గంగులవారిపాలెంవీధి సుందరీకరణ 9 వ వార్షికోత్సవానికీ, బుధవారం నాటి నడకుదురు బాట శ్రమదానానికీ రావలెనని విన్నపం!

        శాసనకర్తలు - మార్గదర్శకులు!

స్వచ్ఛ - సౌందర్య శాసన కర్తలు - జాగృత సమాజ మార్గదర్శకులు

శ్రమానంద సంభరిత మనస్కులు - ప్రమోద భావుక ప్రసన్న జీవులు

బ్రహ్మముహూర్తం కాల కార్మికులు - వాడవాడలా స్ఫూర్తి ప్రదాతలు

మీదే మహోత్తమాశయ మార్గం - మీకొరకే మా సత్ప్రణామములు!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   18.12.2022.