2625* వ రోజు.......           19-Dec-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

సోకాల్డ్ రెస్క్యూ టీం వారి సోమవారం నాటి కృషి - @2625*

            19.12.2022 వ వేకువ సమయం 4.27-6.15 మధ్య పైన పేర్కొన్న గ్రామ భద్రతా దళం 4+1 మంది చేసిన రహదారి మెరుగుదల కృషి -  అది ఎన్ని గజాల నిడివీ, ఎంత వైశాల్యమూ అని  లెక్కించలేను గాని, వాళ్ల నిబద్ధతా, గజనీ,ఘోరీల వంటి ఎడతెగని ప్రయత్నమూ మనం గుర్తించక తప్పదు!

            గత 10 రోజుల్నుండీ స్వచ్చ కార్యకర్తల, మనకోసం మన ట్రస్టు కార్మికుల దృష్టంతా కేంద్రీకృతమయిన క్రొత్త విషయ మేమంటే వందలాది చెట్లను విద్యుత్ శాఖ వారు నిర్దయగా మొదలంటా కొట్టి, డ్రైన్ల లో వదిలిన అస్వస్తతే! బహుశా మరి కొన్ని నెలలకు సరిపడా వాళ్లకీ పనే ఉండవచ్చు!

            ఈ నలుగురు కార్యకర్తలూ తొలుత తరిగోపుల ప్రాంగణం దగ్గరా, ఆపైన ఒకప్పటి సారా బాట్లింగ్ కంపెనీ దగ్గరా, డ్రైనులోని చెట్ల నుండి కొమ్మల్ని వేరు చేసి, ఆకుల్నీ, పుల్లల్నీ ప్రోగుచేసి, చల్లపల్లి స్వచ్చంద శ్రమ దాతలంటే ఏమిటో ఋజువు చేస్తున్న వైనాన్ని జై స్వచ్చ చల్లపల్లి సైన్యంసామాజిక మాధ్యమ చిత్రాలలో తిలకించండి!

            ఒకటి రెండు మార్లు బరువైన చెట్ల మొదళ్లను కదిలించే శక్తి చాలనపుడు ట్రస్టు ఉద్యోగి సహకారం తీసుకోవడమూ గమనించండి! ఐతే – “అయ్యో పాపం! జీతం భత్యం లేని ఇంత చలి వేకువలో- ఈ బురద-కరకు- మురికి పనుల ఖర్మేంటో వీళ్లకిఅని జాలి చూపకండి! ఐచ్చికంగానే కోరి కోరి రెండు-మూడు వేల రోజులుగా వాళ్లీ కార్యక్రమానికంకితమై పోయారని మరువకండి! వీలైతే

            యదా యధాహి ధర్మస్య గ్లానిర్భవతి భరాతా....! (ధర్మానికి ఎప్పుడు ఎక్కడ భంగం కలిగినా నేను అప్పుడు అక్కడ ప్రత్యక్షమవుతుంటాను...)

అనే భగవద్గీతా వాక్యాన్ని గుర్తుకుతెచ్చుకోండి!

            నేటి కార్యకర్తల కృషికి 6.30 వేళ తూములూరి లక్ష్మణరావు పలికిన స్వచ్చ సుందరోద్యమ నినాదాలతో స్వస్తి!

            గొప్ప ధన్య మూర్తులే!

పనిమంతుల, ఆత్మ తృప్తి శ్రీమంతుల, తమ ఊరికి

అనునిత్యం త్యాగధనుల - అడ్రస్ కనిపెట్టారా?

వారెవరో కారు సుమా! స్వచ్చ కార్యకర్తలే

కుల- మతాల గొడవెరగని గొప్ప ధన్య మూర్తులే!    

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   19.12.2022.