2626* వ రోజు..........           20-Dec-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

గ్రామ స్వచ్చ- సుందరోద్యమ కారుల 2626*వ నాటి ప్రయత్నం!

            సదరు మనః పూర్వక ప్రయత్నం మంగళవారం (20.12.2022) నాటిది! ఆ పూనిక 25+5 మందిది! స్థలం గంగులవారిపాలెం గస్తీ గది మొదలు మునసబు వీధి దాక! 6 వ నంబరు కాలువ వంతెన ఉత్తర దక్షిణ భాగాల సుందరీకరణం దాని కదనం! ప్రేక్షకులు వందల మంది- మొహమాట పడైనా పాల్గొన్న క్రొత్త వారు సున్నామంది! చివర్లో ఉద్యమాభిమానులు ఐదారుగురి అతిథి పాత్ర! - ఇదీ, ఈ వేకువ వీధి పారిశుద్ధ్య ప్రగతి నివేదిక!

            పంట కాల్వ గట్లను తీర్చిదిద్దడం కాక - 60-70 అడుగుల వెడల్పైన జాతీయ రహదారిని - అందలి టీకొట్ల గలీజును, ‘రాజ ద్రవ్య నిధి’ (SBI) ఆవరణను, ఆస్పత్రి ప్రాంగణాన్ని, కళాశాల ముఖ ద్వారాన్ని, ఇతర దుకాణాల కార్యాలయాల అపరిశుభ్రతను ఊడ్చి-ప్లాస్టిక్ పదార్థాలను సమీకరించి పనికిరాని తిక్క మొక్కల్ని తొలగించి, అందాల పూల మొక్కల్ని సన్మానించి ప్రోగుపడ్డ వ్యర్థాలను డిప్పలతో ట్రక్కులో కెత్తి ... ఇలాంటి పనుల్ని మంచినీళ్ల ప్రాయంగా స్వచ్చ కార్యకర్తలెలాగూ చేస్తూనే ఉంటారు!

            ఎన్ని లక్షల గంటలో ఇలా తమ విలువైన సమయాన్ని ఊరి బాగుదల కోసం కృషి చేయడం వాళ్లకు క్రొత్త కాదు గాని

            ఈ డిసెంబరు 20 వ తేదీ ప్రత్యేకత ఒకటున్నది. తొమ్మిదేళ్ల నాడు- ఇదే వీధి మొదట్లో ఐదారుగురు జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలూ, సామాజిక సేవాభిలషులూ కలిసి, ఈ ఊరికొక క్రొత్త చరిత్రను ప్రారంభించిన సుదినం అది! కడియాల భారతి, డొక్కు రంగారావుల ఆ రోజుల్లో నిబద్ధత నాబోటి వాళ్లకు ప్రేరణ!

            కాలక్రమాన నడక సంఘం వారు, ఇంకొందరు సహృదయులూ కలిసొచ్చారు. అప్పటికింకా ఏ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలూ స్వచ్చ కార్యక్రమాల్ని ప్రస్తావించనే లేదు. ఈ వీధి సుందరీకరణ విజయమే -  ఆ తదుపరి 12.11.2014 న మొదలై ఇప్పటికీ విజయవంతంగా నడుస్తున్న చల్లపల్లి స్వచ్చంద శ్రమదానానికి బీజావాపనం అదే!

            ఈ ఉదయం జరిగిన 9 ఏళ్ల శ్రమదాన సింహావలోకనం ఆ గత స్మృతులు నెమరు వేసుకోవడంతో మొదలై, పోలీసు ఉన్నతోద్యోగి సతీమణి కాకర సుజాత గారి ఇతోధిక వీధి సుందరీకరణ ప్రయత్నంతో, అప్పటి ఒక దృఢ కార్యకర్త భారతి గారు ముమ్మార్లు స్వచ్చ- సుందరోద్యమ జయ జయ ధ్వానాలతోను పట్టరాని ఆనందంతో DRK గారి సమీక్షా వచనాలతోను ముగిసింది.

            9 ఏళ్ల స్వచ్చ- సుందరోద్యమ తొలి నాళ్ల కార్యకర్త విశ్రాంత ప్రాచార్యుడూ శ్రీ తగిరిశ సాంబశివరావు గారి 1000/- విరాళమూ, మరీ విశేషించి మన స్వచ్చోద్యమ ప్రాతకాపు శాస్త్రి మహాశయుని గత నెల చందాతో సహా మొత్తం 10 వేల రూపాయలు మనకోసం మనంట్రస్టుకు ఈరోజు జమ పడినవి. చల్లపల్లి యార్లగడ్డ శ్రమదానోద్యమ కార్యకర్త తూము వేంకటేశ్వరుని అనుభవ వ్యక్తీకరణంతోను అది ఇంకాస్త సుసంపన్నమయింది!

            రేపటి వేకువ మన శ్రమదాన గమ్యస్థలం మరొక మారు నడకుదురు బాటలోనే!

                సుగతికి శ్రీరామ రక్ష 

ప్రతి ఉదయం శ్రమ వేడుక ప్రతి డ్రైనుకు పరిశీలన

ప్రతి వీధికి పరామర్శ రహదారుల అనుశీలన

అన్ని పనులకూ సమీక్ష ఆత్మ విమర్శ దిదృక్ష

స్వచ్చోద్యమ చల్లపల్లి సుగతికి శ్రీ రామ రక్ష!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   20.12.2022.