2627* వ రోజు..........           21-Dec-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల్ని వాడడం దేనికి?

2627* వ నాటి చెప్పుకోదగిన శ్రమదాన విశేషం!

            బుధవారం (21-12-22) వేకువ 4.17 కే మొదలై 6.15 దాక అవిచ్ఛిన్నంగా జరిగిన సామాజిక శుభప్రదమైన శ్రమదాన ప్రదేశం మరొక మారు నడకుదురు మార్గంలోనే! ఆ వేడుక కర్తలు 26 మందే! బాగుపడిన రహదారి 50 గజాల మేరకే!

            అది ఎందుకు చెప్పుకోదగినదంటే - అననుకూల వాతావరణ కారణంగానే! ఈ డిసెంబరు నెలలో బాగా ఉగ్రరూపం దాల్చిన మంచూ, చలి పరాకాష్టకు చేరినదీ ఈ బ్రహ్మముహుర్తాననేమో! ఐతే - అసలీ స్వచ్ఛ కార్యకర్త లేనాడు ఏ ప్రకృతి అకృత్యానికి భయపడ్డారు గనుక? ఏ వానకు - ఎండకు దుమ్మూధూళికీ జడిసి ఇంట్లో దాక్కున్నారు గనుక! ఎన్ని సందర్భాల్లోనైనా ఈ స్వచ్ఛ - సుందరోద్యమ కారులదే గదా పైచేయి?

            ఆ ప్రకారంబుగా - నేటి ఉషోదయ - 50 పని గంటల - పారిశుద్ధ్య కృషి విజయవంతంగా 2627* వ మైలు రాయిని దాటినట్లే! ఆంగ్ల మాధ్యమ పాఠశాల దగ్గర ఉన్న పెద్దమట్టి దిబ్బ రాకపోకలకు కొంత అభ్యంతరం పెడుతుంటే - దాన్ని త్రవ్వి, పారలు - డిప్పల్లో ఎత్తి అవసరమైన చోటకు చేర్చడమే 10 మంది శ్రమప్రదాతల వంతయింది!

            అచ్చటికి దూరంగా కొందరు కార్యకర్తల సుందరీకరణాన్ని అపార్థం చేసుకొన్న గృహస్తుడిని సమాధాన పరచడం, చల్లబరచడం ఇంకొందరు చేసిన ప్రయత్నం!

            అది పుట్టో- మట్టి దిబ్బో గాని ఇద్దరు దాని మీద మొలిచిన గడ్డినీ పిచ్చిమొక్కల్నీ తుదముట్టించడం గమనించాను.

            రోడ్డు ఊడుపు బాధ్యతను తీసికొన్న మహిళా కార్యకర్తలు 50 - 60 గజాల వీధినీ - వాటి అంచుల్నీ అనుకొన్నకంటే బాగా శుభ్రపరిచారు.

            స్వచ్ఛ కార్యకర్తలు పాతిక ముప్పై మంది కాక - ఈ దైనందిన శ్రమదాన నివేదికను క్రమం తప్పక చదివే జిజ్ఞాసా పరులకు వారానికొక మార్తెనా వచ్చి - పాల్గొని - ప్రత్యక్షంగా పరిశీలిస్తేనే బోధపడగలదు - అసలీ నడకుదురు బాట 1 కిలోమీటరు భాగమే నెలనాళ్ల పాటు ఎందుకు పట్టుతున్నదీ! ఈ జగమొండి ఘటాల మురికి బురద - దుమ్ము - పనుల సంగతీ, ఓర్పులూ - నేర్పులూ ఎలాంటి వన్నదీ!

            6.40 సమయంలో వడ్లమర ద్వారంలో - నేను అందుకోలేనంత వేగంగా ఒక జాస్తి ప్రసాదు మహాశయుడు ముమ్మారు పలికిన (తనది కాని) ఊరి స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలతోనూ, తదుపరి గ్రామ ప్రముఖ భిషగ్వరుడు మన శ్రమదాన ధారా స్రవంతిపై నందిగామ ప్రముఖుడి వ్యాఖ్యానం గుర్తుచేసి, సమన్వయించడంతోనూ ఈ బుధవారం సార్ధక శ్రమదానానికి స్వస్తి!

            రేపటి మన పునర్దర్శనం కూడ నడకుదురు దారిలోనే అనేది సమష్టి నిర్ణయం!

        పేరుపేరున మా ప్రణామం 175

భావి తరముల స్వస్తతే తమ బాధ్యతగ తలపోయు వారికి

విశ్వమానవ ప్రగతి కోసం విరామ మెరుగక సాగువారికి

మొదటి మెట్టుగ సొంత ఊరిని ముమ్మరంగా కొలుచు వారికి

ఎక్కడున్నా - ఎవ్వరైనా పేరుపేరున మా ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   21.12.2022.