2628* వ రోజు.......           22-Dec-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల్ని వాడడం దేనికి?

2628* వ శుభోదయాన 27 మంది శ్రమదాన పోకడలు!

         గురువారం వేకువ కూడా మళ్ళీ నడకుదురు బాటలోనే జరిగిన శ్రమదాన విలాసంలో నికరంగా 24 మందికీ, ముగ్గురు అతిధులనదగ్గవాళ్లకీ ప్రమేయమున్నది! 10 - 11 మందైతే 4.20 కే చీకటైనా మంచైనా - అక్కడ వాలిపోతారు! సుమారు 2 గంటల పాటు మా ఇఛ్ఛయే గాక మాకేటి వెరపు...” (కృష్ణ శాస్త్రి) అన్నట్లుగా - ఊరికి ప్రయోజనకరంగా రకరకాలుగా శ్రమ వీర విహారం చేయందే వాళ్లకు సంతృప్తీ దక్కదు - ఇంటి దగ్గరుంటే తోచనూ తోచదు!

         ఏం చేస్తాం - కొన్ని జీవితాలంతే! లోతుగా ఆలోచించని వాళ్లకిది చాదస్తం గానూ, అమాయకత్వంగాను - బ్రతకచాతగాని అయోమయంగానూ అనిపించవచ్చుగాని - నిజానికి ఇలాంటి స్వచ్చ కార్యకర్తలే సామాజిక బాధ్యులే నవసమాజానికి వేగుచుక్కలు!

         దయచేసి 8-9 ఏళ్ల నాటి చల్లపల్లి వీధులు, డ్రైనులు, శ్మశానాలు, ఊళ్లోకి దారి తీసే 7 రహదార్లు, గుంటల రోడ్లు, బస్ ప్రాంగణాలు, కొన్ని పంటకాల్వలూ గుర్తుకు తెచ్చుకోండి! ఇందరు కార్యకర్తల శ్రమను మ్రింగి, చెమటలకు కారణమైన ఈనాటి హరిత - స్వచ్ఛ సుందర చల్లపల్లితో పోల్చి చూడండి! ఆపైన కార్యకర్తల శ్రమకు విలువ కట్టడం కాదు - సెంటిమెంటుకులోనై చేతులెత్తి మ్రొక్కడం కాదు చేయవలసింది ప్రతి వార్డు నుండి ఇద్దరు - ముగ్గురైనా క్రొత్తగా స్వచ్ఛ కార్యకర్తలుగా మారాలని మనవి!

         అసలింతకీ - ఈ ఊరు 30-40-50 మంది వాలంటీర్లది కాదే! వాళ్లు పెంచిన, పెంచుతున్న 30-40 వేల చెట్లూ పూల మొక్కలూ, రహదారి వనాలూ, తీర్చిదిద్దిన - శుభ్రపరచిన పబ్లిక్ ప్రదేశాలూ ఊరి సొత్తులు తప్ప వాళ్ల సొంత ముల్లెలు కావే! అందరమూ ఉమ్మడిగా అనుభవించాలి తప్ప - విడివిడిగా - ఒంటరిగా ఏ ఒక్కరమూ ఏసుఖమూ, సౌకర్యమూ పొందలేమనే తెలివిడే ఈ కార్యకర్తల ప్రత్యేకత!

         ఇలాంటివి బాగా అర్ధం చేసుకొన్న చైతన్యవంతులు చల్లపల్లిలో వందలు కాదు వేల సంఖ్యలో ఉండి కూడా స్వచ్చంద శ్రమదానంలో పాల్గొనక ఇంకా మీనమేషాలు లేక్కిస్తుండడమే ఒక వింత!

         22-12-22 వ నాటి శ్రమదానమంతా సాఫీగానే జరిగిపోయింది. వీధి ఊడ్పులు, ప్లాస్టిక్ వస్తువుల ఏరుడు, పిచ్చి ముళ్ల మొక్కల నరుకుడు, వ్యర్థాల్ని ట్రక్కులో కెక్కించి చెత్త కేంద్రానికి తరలింపుడు .... వంటివన్నీ షరామామూలే గాని

మూడు విశేషాలున్నవి :

1) చెన్నై  నివాసి – చల్లపల్లి  స్వచ్చ సుందరోద్యమాభిలాషి – మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారి కుమార్తె శ్రీమతి అనురాధ “మనకోసం మనం” ట్రస్టుకు నిన్న  25,000/- విరాళం పంపడమూ,

2) ఒక వీధి సౌందర్యకారుడు డ్రైను పైకి ఒరిగి, కాస్త ఊగుతున్న ఎత్తైన చెట్టు కొమ్మపై నిలబడి అరగంట దాక చెట్టును సుందరీకరించిన ఘట్టం,

3) ఒక ప్రవాస భారతీయుడు - నల్లూరి సూర్యవర్ధన్ సమయం చిక్కక - హడావిడిగా వచ్చి పాతిక మంది కార్యకర్తల నిస్వార్థ శ్రమను ఆశ్చర్యంతో పరిశీలించడం!

         అతని తరపున కార్యకర్తలకు చాక్లెట్లు పంచడమూ, స్వఛ్ఛ - సుందరోద్యమ నినాదాలను వల్లెవేయడమూ నా వంతు!

         రేపటి ఉషోదయ శ్రమదాన స్థలం కూడ నేటి తరువాయిగా - నడకుదురు దారిలోనే ఉండగలదు.

      పేరుపేరున మా ప్రణామం 176

ఒకట రెండా - వందరోజుల? రెండువేల దినాల పైగా

తాము నమ్మిన సత్యమునకై - ధన్య సుందర గ్రామమునకై

అలుపెరుంగని - పట్టు సడలని. అద్భుతావహ ప్రయోగంగా

కదం త్రొక్కిన స్వచ్ఛ - బంధుర కార్యకర్తకు మా ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   22.12.2022.