2629* వ రోజు... ....           23-Dec-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల్ని వాడడం దేనికి?

నేటి (23-12-22) వీధి పారిశుద్ధ్యం సైతం నడకుదురు బాటలోనే! @2629*

 

          ఈ శుక్రవారం వేకువ అందుకు పాల్పడింది 25 మందే! వారిలో సగానికి పైగా 4.19 కి ముందే అక్కడ ప్రత్యక్షం! అందరూ కలిసి 6.10 దాక శ్రమించి చక్కదిద్దింది మరొక 50 గజాల వీధినే! ఇన్నాళ్లకు పడమటి వీధికి వెళ్లే రోడ్డు దాక పని పూర్తయ్యింది! బహుశా మరో నాల్గు రోజుల్లో ఈ నడకుదురు దారి సుందరీకరణం పూర్తికావచ్చు.

          DRK డాక్టరు గారి అభిప్రాయాన్ని బట్టైతే నేటి సుప్రభాత బాధ్యతలు కఠినాతి కఠినమైనవి! ఎండిన బురద గుట్టల మట్టిని పలుగుల్తో త్రవ్వి - రాళ్లనూ, ప్లాస్టిక్ వ్యర్ధాల్ని విడగొట్టి, పారల్తో డిప్పలకెత్తి, పెద్ద ట్రక్కును నింపడమూ, దాన్ని ఊరు, రోడ్ల మార్జిన్ల పటిష్ఠీకరణకు వాడడమూ ఏమైనా తేలిక పనులా? (నిన్నా మొన్నా కాస్త అస్వస్తుడైన ఒక కార్యకర్త పలుగు బలంగా వాడి, ఆయాసపడడం గమనించాను!)

 

          తమ ఊరి స్వచ్ఛ - సౌందర్య సౌభాగ్యానికి తమకు తాముగా అంకితులైపోయిన ఈ స్వచ్ఛ కార్యకర్తల్లో ఎవరు - ఏనాడు - ఏపనికి బద్ధకించారు గనుక? అది బరువు పనో - మురికి పనో - ఎవరు ఒళ్లు దాచుకొన్నారని? ఈ వేకువ వేళైనా అంతే!

 

          10 మందిది మట్టి దిబ్బల పనైతే, నలుగురిది అంతిమ సుందరీకరణమైతే, కత్తుల వాళ్లది పిచ్చి ముళ్ల మొక్కల పనిబట్టడమైతే, మరో నలుగురిది చీపుళ్లతో దుమ్మూ - ఆకులూ - సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లూ ఊడ్చే కృషైతే, చెట్ల క్రింద దూరి, దంతెలతో నానాజాతి కశ్మలాలను లాగి - పాదుల్ని శుభ్రం చేసిన బాధ్యత ముగ్గురిది! ఖాళీ సారా - నీళ్ల సీసాలను సమీకరించిన తేలిక పని ఒకరిద్దరిది!

 

          కార్యకర్తలందరిదీ ఒకే ఉమ్మడి లక్ష్యం - తమ ఊరి వీధులు మురికోడుతూ, దుమ్ము కొట్టుకొని, కళాకాంతులు లేక నిర్జీవంగా మిగిలిపోరాదని! 7 రహదారులు గానీ, ఊరి రోడ్ల గుంటలు గానీ, జన సంచార ప్రదేశమేదైనా గానీ - ఏవీ నిరంలంకృతంగా, నిరామయంగా మిగిలి పోరాదనీ! సహృదయ సోదర గ్రామస్తులెప్పటికైనా కనికరించి, తమతో చేతులు కలిపకపోతారా అనీ కలిసి రాకున్నా సరేననీ! తమ గమ్యం ఉత్తమమైనప్పుడు - అందుకనుసరించే మార్గం సరైనదే కనుక - ఎన్నటికీ తమ సొంత ఊరి సేవలు ఆపరాని వనీ!

 

          ఇవి తమ బాధ్యతో సేవో - అదిప్పటికిప్పుడు తమతోనే పొద్దు పొడవలేదనీ ఎందరెందరో త్యాగ ధనులు ఎప్పటి నుండో తమకు మార్గదర్శకులనే స్పృహ కూడ వాళ్లకు లేకపోలేదు!

 

          కాఫీ/సరదా కబుర్లు ముగిశాక 6.30 వేళ జరిగే సభలో ITC ఉద్యోగి నాయుడు మోహనరావు ఊరి స్వచ్ఛ శ్రమదానోద్యమ సందేశాన్ని ముమ్మారు నినదించడంతో బాటు - గత నెలలో వేగేశ్న పృధ్వీరాజు గారి ప్రసంగ భాగాల్ని ముగ్గురు స్వచ్ఛ కార్యకర్తలకు తన పద్ధతిలో సమన్వయించగా – ‘దేవుడు భక్తి సంప్రదాయాలపట్ల తన ఉద్దేశాన్ని DRK గారు వ్యక్తీకరించగా - నేటి కార్యక్రమం ముగిసెను!

 

          రేపటి వేకువ మన ఊరి కర్తవ్యం కూడ కోమలానగర్/నడకుదురు బాటలోనే!

 

          తొలి ప్రణామం - 177

దేశ భద్రత - గ్రామ స్వస్తత త్రిమూర్త్యాత్మకమైన విషయం

దీన్ని గాలికి వదలి వేసిన దీన స్థితి ప్రస్తుత సమాజం

ఒక నమూనా గ్రామ కల్పన కుద్యమించిన స్వచ్ఛ సైన్యం

సాహసిక శ్రమదాతలకు మేం సమర్పిస్తాం తొలి ప్రణామం!

 

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   23.12.2022.