2630* వ రోజు.......           24-Dec-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల్ని వాడడం దేనికి?

అరుదైన స్వచ్ఛ - సుందరోద్యమంలో - బిరుదైన 2630* శ్రమదానం!

          - అది 24-12-22 (శనివారం) నాటి సంగతి! శ్రమదాతలు 27+½+2 = మొత్తం 29 ½  మంది (‘ఇర్షాద్ షరీఫ్  అనే 6-7 ళ్ల అరటిక్కెట్టు కాక 6.20 కు వేరే అవసరార్థం వచ్చిన ఇద్దరు -) స్థలం - కోమలానగర్ కు చెందిన మినీ అపార్ట్మెంట్స్! సమయం - 4.20 - 6.10 మధ్యస్తం! జరిగిన కాలుష్య విధ్వంసం - సుమారు 50 గజాలు!          

          పారిశుద్ధ్య శ్రమదాన సమయం కానీ, స్థలం గానీ నిక్కచ్చిగా కొలిచినవేమీ కావు! ఎందుకంటే వీళ్లలో తొలి కార్యకర్తలు కొందరు 4.10 కే అక్కడ వేచి ఉంటారు; ఒకరిద్డరి పని విరమణ వేళ 6.15 కూడ కావచ్చు – దేన్నీ క్రమశిక్షణ ఉల్లంఘనగా చెప్పలేం!

          నేటి ఉదయం ఎట్టకేలకు ఈ వీధి పారిశుధ్య సుందరీకరణ వేడుక చిన్నకార్ల కడుగుడు కర్మశాల(కార్ వాషింగ్ వర్క్స్) ను దాటింది ! ఏమీ కశ్మలాలూ పెద్దగా లేవులే - త్వరగా మరింత వీధి శుభ్రత జరుగుతుందిలేఅనిపించే కొన్ని స్థలాల్లో తీసేకొద్దీ రకరకాల వ్యర్థాలు బైట పడుతుంటే పనిలో ఆలస్యం కాక తప్పుతుందా?

          అస్తవ్యస్తంగా - చిందరవందరగా పడి ఉన్న పొడవాటి ఆరేడు తాడి మొద్దుల్ని రోడ్డుకు ఉత్తరాన పొందికగా అమర్చి, ఆ అమరికపైన విలాసంగా ఆశీనులైన కార్యకర్తల్ని చూస్తే ఏమనిపిస్తుంది?

          ఎవరో త్రవ్వి పడేస్తే ఎండిన మురుగు మట్టి గుట్టను పలుగుల్తో, పారల్తో త్రవ్వి - చదును చేసేందుకు శ్రమించిన ఐదారుగురి అలసట - అది వాళ్ల స్వప్రయోజనార్థం కాక రహదారి అందం కోసమూ, స్థానికుల ప్రయాణికుల ఆహ్లాదం కోసమూ కనుక - వాళ్ల కాయకష్టం ఎంత సార్థకమో ఆలోచించండి!       

          ముగ్గురు స్త్రీలూ, ఒక పెద్ద వైద్యుడూ గంటన్నరకు పైగా 50/60 గజాల వీధిని ఊడ్చి శుభ్రం చేస్తున్న పని అంతరార్థమేమిటి ?

          ఈ కార్యకర్తలిలా ఇంత చలి వేకువ వేళ - ఇన్ని వేల దినాలుగా - 99 శాతం మంది అసహ్యించుకొనే - పారిశుద్ధ్య కృషిని - చివరకు అశుద్ధాలను సైతం తొలగించే పనులకెందుకు పాల్పడాలి?

          “దేశమును ప్రేమించుమన్నా - మంచి అన్నది పెంచుమన్నా...

          పూని ఏదైననూ ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయ్...

అని 120 ఏళ్ల నాడు ఒక గురజాడ చెప్పిన హితవును ఇలా చల్లపల్లిలో ఆచరించి చూపుతున్న స్వచ్ఛ కార్యకర్తల్ని అభినందించాలా - అనుసరించాలా?      

          చిన్న కార్ల శుద్ధి దుకాణం ఆవరణలో 6.30 కి జరిగిన సమీక్షకు ముందు కోమలానగర్ అంతటికీ వినిపించేలా దైనందిన స్వచ్ఛోద్యమ నినాదాలను గర్జించినది మాలెంపాటి అంజయ్య కాక మరెవ్వరు?

          రేపటి వేకువ కూడ ఇదే కోమలానగర్ ప్రధాన (నడకుదురు) వీధిలోనే మన అర్థవంతమైన శ్రమదానం ఉండునని ఇందుమూలంగా ప్రకటించడమైనది!

          నా ప్రణామం – 178

జాగృతంబగు సాంప్రదాయమె జాతి జనులకు జీవనాళిక

(మరి) సాంప్రదాయం క్రొత్తదైతే జనుల మనసులకది ప్రహేళిక

స్వచ్ఛ - బంధుర సాంప్రదాయం ఆచరణతో ఋజువుపరచిన

చల్లపల్లి స్వచ్ఛ - సుందర సాహసానికి నా ప్రణామం!

 

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   24.12.2022.