2633* వ రోజు... .......           27-Dec-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

నిన్నటి వీధికే మరొక మెరుగుదల ప్రయత్నం - @2633*

          మంగళవారం వేకువ కూడ 4.30 కు ముందే స్వచ్ఛ కార్యకర్తల చతుష్టయం గంగులవారిపాలెం వీధిలోకి చేరుకొన్నది. నిన్న వదలిన పేవర్ టైల్స్ పనిని పూర్తిచేయడంతో బాటు ఆస్పత్రి దగ్గర రెండు చింత మొద్దుల క్రమబద్ధీకరణ / సుందరీకరణను కూడ చేపట్టింది.

          ఇతరుల సంగతేమో గాని, స్వచ్ఛ కార్యకర్తల్లోనే ఒకరిద్దరు ఒకటి రెండు మార్లు నేనిలా ప్రతి ఉదయం స్వచ్ఛ కార్యాక్రమ నివేదికలు వ్రాయడాన్ని కొంచెం అభ్యంతర పెట్టారు – “మనం చేసే ఈ చిన్న చిన్న బాధ్యతలకింత వివరణ, వర్ణన అవసరమా...? “అని! ఎక్కువ మందేమో” ఇదేమీ కల్పన కాదు, అభూత వర్ణనా కాదు, ప్రతి ఊరి జనానికీ తెలిసి తీరాల్సిన – ఎంతో కొంత స్ఫూర్తి కలిగించే వాస్తవం కనుక ఇక్కడి వాస్తవాల నివేదన అవసరమే” అని భావించారు!

          నలుగురు రాటు దేలిన కార్యకర్తలూ, వాళ్లకు కాస్తో కూస్తో సహకరించిన ముగ్గురూ ఈ సోమ  మంగళవారాల్లో తాము తలపెట్టినవి చాల వరకు పూర్తిచేయడం విశేషం!

          6.30 పిదప నేటి స్వచ్ఛ - సుందర నినాదాలను వినిపించిన వంతు, అతిథి కార్యకర్త పాత్రధారి – కస్తూరి విజయ్ ది!

          ఏ వీధిలో స్వచంద శ్రమదానం అలజడి ఉంటే, ఇకపై ఆ వీధి నుండి తాత్కాలిక స్వచ్ఛ కార్యకర్తలు బైటకు వచ్చి, మనతో కలవాలని ఆశిస్తూనే ఉందాం!

          రేపు - 28.12.22 వేకువ సమయంలో మన శ్రమదానానికి ఎదురు చూసేది నడకుదురు బాటలోని కోమలా థియేటర్ ప్రాంతమే!

            నా ప్రణామం -181

ఏది సులువుగా దక్కబోదని – ఏదసాధ్యం కానే కాదని –

ఐకమత్యమే మహాశక్తిని - పారదర్శకతే బలమ్మని –

హేతు బద్ధ సమష్టి నిశ్చయమే సదాచరణీయ మనుకొని

పురోగమించిన స్వచ్ఛ సైనిక స్ఫూర్తికే నాతొలి ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   27.12.2022.