1925 * వ రోజు....           18-Feb-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1925* వ నాటి శ్రమసౌందర్యం.

నేటి బ్రహ్మ ముహూర్తాన బందరు జాతీయ రహదారిలో అమరావతి (చిన్న రాజా గారి) వైజయంతం మొదలుకొని వారం సంత వీధి దాకా అలుపెరుగని 27 మంది స్వచ్చ సైనికుల స్వచ్చంద శ్రమదాన విన్యాసాలను రెండు గంటల పాటు-4.01-6.15 ల మధ్య గమనించాను. “చీపుళ్లతో ఊడ్వడమూ, గొర్రులతో లాగి, పోగులు చేసి, వ్యర్ధాలను, డిప్పలతో ఎత్తి ట్రాక్టర్ లో నింపి, డంపింగ్ కేంద్రానికి చేర్చడమే కదా- అని పైపైన చూస్తూ పోయేవారికనిపించవచ్చు గాని, ½ కిలో మీటరు దాక సువిశాల ప్రధాన రహదారిని, వేలాది మంది విసరుతున్న వ్యర్ధాలను ఊడ్చి, శుభ్ర పరచడం మనమనుకొన్నంత సులభం కాదు! నిన్న, నేడు బందరు దారిలో శ్రమిస్తున్న కార్యకర్తల గూళ్లు నొప్పి తో విల విలలాడాయి, చీపుళ్లలో ఎక్కువ భాగం అరిగి, విరిగి పోయాయి!  

ఇసుక బళ్ల, ట్రాక్టర్ల, లారీల నుండి చిందే ఇసుక, పెద్ద-చిన్న వాహనాల దుమ్ము-ధూళి తో కలిసి పేరుకొని, గట్టిపడి కదలమని మొరాయిస్తుంటే-బలాత్కారం చేసి, పంతం పట్టి, గోకి, చెక్కి, వేలాది మంది ప్రయాణీకుల సౌకర్యం కోసం శ్రమిస్తున్న ఈ కార్యకర్తలు ధన్యులు! నేటి వీరి శ్రమతో రకరకాల అంగళ్ల, దేవాలయాల ముంగిటి వ్యర్ధాలు, డ్రైన్ల, గట్ల మీది తుక్కులు, కనిపించిన పిచ్చి మొక్కలు వంటి వన్నీ తొలగి, ఈ బాట ఎంత శుభ్ర-సుందర-విశాలంగా కనిపిస్తున్నదో చూడండి. అందుకే ఎప్పటికైనా- నిస్వార్ధ నిరంతర “శ్రమయేవ జయతి!” సొంత ఊరి మేలు కై 1925 రోజులుగా పాటు బడుతున్న ఈ స్వచ్చ సైనికులకు మనసున్న సోదర గ్రామస్తుల తరపున నా ధన్యవాదాలు!

 

6.35 కు జరిగిన నేటి స్వచ్చ శ్రమ సమీక్షా సమావేశంలో:

- ప్రముఖ పాత్రికేయ సంపాదకుడు స్వాతి(వేమూరి) బలరాం గారు స్వచ్చోద్యమ చల్లపల్లి సంచాలకుడు డాక్టర్ రామ కృష్ణ ప్రసాదు గారితో సుదీర్ఘంగా (ఫోనులో) చర్చించి, స్వచ్చ కార్యకర్తలను ప్రశంసించి, తాను త్వరలో చల్లపల్లిని సావకాశంగా చూస్తానని చెప్పారు.

 

- మహా శివరాత్రి పండుగ సందర్భంగా చల్లపల్లి, పెదకళ్లేపల్లి, యార్లగడ్డ వంటి ప్రముఖ శివాలయాల లోనికి, పరిసరాలలోనికి ప్లాస్టిక్ సంచుల వంటి ఒక్కసారి వాడి వేసే ప్లాస్టిక్ వస్తువులు అనుమతించరాదని సదరు దేవాలయాల కార్యనిర్వహణాధికారులకు ముందస్తుగా అభ్యర్ధన పత్రాలను మన స్వచ్చ కార్యకర్తలు అందజేయాలని నిర్ణయించారు.

- రేపు 12.00 గంటలకు జరుగనున్న “ పల్నాటి భాస్కర్-అన్నపూర్ణ”  ల కుమారుని, కోడలి “స్వీకరణ-పరిచయ వేడుక”(పెద కళ్లేపల్లి రోడ్డులోని వాసవీ కళ్యాణ మండపంలో) కు రాజబాబు గారి పునరాహ్వానం.

 

రేపటి మన స్వచ్చంద శ్రమదానం పెద కదళీపుర మార్గంలోని “ సాగర్ ఆక్వా ఫీడ్స్” సమీపంలో కలిసి నిర్వహిద్దాం.

 

ఈ స్వచ్చోద్యమ కవితలందు...

పునరుక్తుల దోషాలో – సమన్వయ రాహిత్యాలో

ఉదాత్త మహా స్వచ్చోద్యమ- ఉదాహరణ పొరపాట్లో

స్వచ్చోద్యమ చల్లపల్లి వర్ణనలో దొరలవచ్చు

అవగాహన సమస్యలూ అడ్డుపడే ఉండవచ్చు!

 నల్లూరి రామారావు  

 స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

మంగళవారం – 18/02/2020

చల్లపల్లి.