1926 * వ రోజు....           19-Feb-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1926* వ నాటి పోకడలు.

మళ్లీ మంచు కుమ్మేస్తున్న ఈ వేకువ 4.10-6.15 నిముషాల నడుమ వేంకటాపురం మార్గంలోని మేకల డొంక, జాతీయ ఉప రహదారుల మధ్య జరిగిన స్వచ్చంద శ్రమ విన్యాస కర్తలు 28 మంది. 

వీరిలో ఎక్కువ మంది వాడినవి గొర్రులు, చీపుళ్లు, కత్తులు: శుభ్ర-సుందరీకృత రహదారి ప్రాంతం సుమారు ½ కిలో మీటరు. అసలే ఇది రెండు సారా దుకాణాల ప్రదేశం! తమ ఆరోగ్యాలనూ, కుటుంబ ఆర్థికాన్ని గుల్ల చేసుకొంటూ వేలాది మంది శ్రామికులు, క్రింది-మధ్య తరగతి వ్యక్తులూ త్రాగి త్రాగి ప్రభుత్వానికి పన్ను కడుతున్న మద్య విక్రయ కేంద్రాల దగ్గర ఈ కార్యకర్తలు ఏరి- ఊడ్చిన గాజు సీసాలు, ప్లాస్టిక్ సీసాలు, గ్లాసులు, తిను బండారాల పొట్లాలూ, సంచులూ వేల సంఖ్యలో ఉన్నవి! రహదారి మీద, మురుగు కాల్వలోన, ఆవిచాలక ప్రక్క పొలాలలోన ప్లాస్టిక్ వ్యర్ధాల విశ్వ రూపాన్ని ఈ 18 మంది కార్యకర్తలు ఆ కనీ-కనిపించని మసక వెన్నెల్లోనే తగ్గించ గల్గారు.

 

మరికొందరు శివరామపురం దారికిరుప్రక్కల పెరిగిన గడ్డిని, పిచ్చి- ముళ్ల మొక్కల పని బట్టి, లాగి, పోగులు పెట్టి, డిప్పలతో ట్రాక్టర్ లో నింపారు. ప్రభుత్వం తరపున అక్కడక్కడ మాసికలు(పాచ్వర్క్)వేయబూనుకొన్న ఈ పరిమిత రహదారి 6.00 కు చూస్తే-అందంగా-శుభ్రంగా, విశాలంగా కనిపిస్తున్నది.  

గ్రామ రక్షక దళం వారు వేంకటాపురం దగ్గర రోడ్డు(ఒప్పందీకులు)కాంట్రాక్టర్స్ లేవ గొట్టిన తారు మిశ్రమాన్ని ట్రాక్టర్ లో నింపుకొని, విజయవాడ దారిలో, గతుకులు పడిన నడకుదురు మార్గంలో దింపి వచ్చారు. త్వరలో ఆ రోడ్ల గుంటల్ని పూడ్చి, వాహనదారులకు సౌకర్యం పెంచాలని వాళ్ల ఉత్సాహం! 

ఈ నాటి స్వచ్చంద శ్రమదాన కృషి సమీక్షా సమావేశంలో :

- త్వరలో రానున్న మహా శివరాత్రి సందర్భంగా ముందు జాగ్రత్తగా- మూడు ప్రధాన శివాలయాల –(కళ్లేపల్లి, మోపిదేవి, చల్లపల్లి) అర్చకులకూ, కార్యనిర్వహణాధికారులకు పర్యావరణ పరి రక్షణ కోసం-“సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించేందుకు విజ్ఞాపన పత్రాల నందజేసే పని, కొందరు కార్యకర్తలు సిద్ధపడ్డారు.

 

- మధ్యాహ్నం 12-12.30 కు వాసవీ కళ్యాణ మండపంలో జరిగే పల్నాటి వారి “ స్వీకరణ- పరిచయ” వేడుకకు కార్యకర్తలు హాజరు కావాలని గుర్తు చేశారు.

 

రేపటి మన స్వచ్చంద శ్రమదానం కొనసాగింపు ఈ పెదకళ్లేపల్లి మార్గంలోని ఉప రహదారి’(బైపాస్) దగ్గర ప్రారంభిద్దాం.

     ఈ పద్మ వ్యూహంలో .....

ఎవరు పూజ్యు-లెవరు త్యాజ్యు-లెవరనుసరణీయులో

ఏదినటన- ఏది సృజన-ఏది ప్రశంసార్హమో

పద్మవ్యూహామైన ఈ ప్రపంచాన్ని గ్రహించుటెట్లో!

స్వచ్చ – శుభ్ర –సుందర తర స్వగ్రామం పొందుటెట్లో!    

 నల్లూరి రామారావు  

 స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

బుధవారం – 19/02/2020

చల్లపల్లి.